Wednesday, December 25, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


54. న మే భక్తః ప్రణశ్యతి

నా భక్తుడు నశించడు(భగవద్గీత)

ఇది భగవద్గీతలో భగవానుడు పలికిన అభయవాక్యం. పరమాత్మ కన్నా
ఆప్తులెవరుంటారు? అందుకే ఈ అభయవాక్యాన్నే ఆప్తవాక్యంగా గ్రహించి ఆశ్వాసన పొందాలి. భగవానుడు అర్జునునకు గురువుగా జ్ఞానాన్ని ప్రసాదించడమేకాక, ఒక
ఆప్తునిగా, దైవంగా ధైర్యాన్నీ, సాంత్వననీ, అభయాన్నీ అందించాడు.

“మా శుచః” (దుఃఖించకు) అనే ఓదార్పు ప్రసాదించిన శ్రీకృష్ణుడు, “యోగక్షేమం వహామ్యహం” అని హామీనిచ్చాడు. “భక్తుడు” అంటే సర్వాత్మనా ఆశ్రయించినవాడు
- అని అర్థం. కర్మపట్ల అహంకారం, ఫలాపేక్ష విడచి ఆచరించే యోగి నిస్సంగిత ఒక విధానం. అలాకాక హృదయాన్ని భగవత్సరం చేసినవానికి కూడా కర్మపరమైన
అహంకృతి, ఫలాభిసంధి ఉండదు. సరికదా-భగవత్సంబంధం ప్రగాఢంగా ఉంటుంది.కనుక అతడి యోగక్షేమాలను వహించడం భగవంతుని బాధ్యత.

భగవదాశ్రయం పొందినవాడు తనను నిత్యం పరమేశ్వరుడు గమనిస్తున్నాడనే స్పృహతో ఉంటాడు. అందువల్ల ఏది చేసినా భగవత్ప్రతిగా, భగవదర్పణంగా భావించి చేస్తాడు. ధర్మస్వరూపుడైన భగవానుని ప్రీతికోసం పనిచేసేటప్పుడు- ధర్మమయమైన
సత్కర్మనే ఆచరిస్తాడు. భగవత్రీతి తప్ప మరో ఫలాన్ని ఆశించని అటువంటి భక్తయోగి కర్మలోనే భగవానుడు జోక్యం చేసుకుంటాడు.

కర్మాహంకారి విషయంలో భగవానుడు సాక్షిమాత్రుడు. అహంకార రహితుడైన భక్తునికి మాత్రం సదా రక్షకుడు. భక్తుడు తాను రక్షింపబడాలని కూడా భావించనంతగా పరమాత్మతో తన్మయుడై యుంటాడు. అటువంటి స్థితిలో అతడి సర్వబాధ్యతలు
పరమాత్మ వహించక తప్పదు.

అనన్యాశ్చింతయన్తో మాం
యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్ ||

“ఇతర చింతనలు విడచి, ఎవరు పర్యుపాసన చేస్తారో (ఎడతెగని
భగవత్సాన్నిధ్యభావన కలిగినవారు) అటువంటి నిత్యయోగుల యోగక్షేమాలను నేను వహిస్తాను" అని స్వామి మాట.

అంతేగానీ ఏదో కావాలని భగవంతుని ప్రార్థించేవారు ఈ తరగతికి రారు. వారికి కావాల్సిన దానిపైనే చింత ఉంటుంది. కానీ భగవంతునిపై ఉండదు. కనుక దానిని
'అనన్య చింతన' అనరాదు. వారి ఆధ్యాత్మిక సాధన పూర్తి భౌతికబంధంతో కూడినది
కనుక 'పర్యుపాసన' అనలేం. భగవానునితో నిత్యానుబంధాన్ని అనుభవించే తాదాత్మ్యస్థితి లేదు కనుక, 'నిత్యాభియుక్తులు' కూడా కారు. అటువంటివారే -"ఇంత కొలుచుకుంటున్నా దేవుడు నా కోరిక నెరవేర్చలేదేం?" అని బేరసారాలకు
దిగుతారు. వారిని 'వ్యాపారులు' అని కటువుగానే పేర్కొన్నది భాగవతం.

'నీ వాడను - నువ్వే గతి' అని శరణు వేడిన వానికి భగవానుడు అభయాన్ని
పలుకుతాడు.
-
శ్రీకృష్ణావతారంలోనే కాదు రామావతారంలో కూడా “నీ వాడను” అని ఒక్కసారి (మనసునీ, మాటనీ, క్రియనీ ఒక్కటిగా చేసి) శరణువేడితే, అతడిని అన్ని విధములా కాపాడుతానని అభయదానం చేశాడు.

ఈ ఆప్తవాక్యాన్ని గ్రహిస్తే, మనస్సుకి కలిగే నిబ్బరం నిరంతరం భగవత్ స్పృహని ఏర్పరచి, జీవితాన్ని అభయంగా మలచుతుంది.

'నమ్మి చెడిన వారు లేరు' అని రామదాసు పలికిన మాట యథార్థం. తాను నమ్మిన దైవం తనకు యోగక్షేమకారకుడని భావించే భక్తుడు, ప్రతి అనుభవాన్నీ
భగవత్ప్రసాదంగానే భావిస్తాడు కనుక అతడు ఎన్నటికీ చెడడు.

'ఏ పురాణముల ఎంత వెదికినా శ్రీపతిదాసులు చెడరెన్నడును' అని అన్నమయ్య పలుకు.            

No comments:

Post a Comment