🌹 మనసు కథలు 🌹
💖🌹 వింధ్య 🌹💖
వింధ్య సెల్లార్ లో కారుని పార్క్ చేస్తోంది..
డ్రైవింగ్ బాగానే చేస్తుంది కానీ పార్కింగు
చేయటంలోనే ఇబ్బంది వింధ్యకి...
కారుని ముందుకి తిప్పుతుంటే
అప్పుడే స్కూటీ మీద వెళుతున్న
కౌసుధి స్కూటీకి వెనుక నుంచీ కారు బలంగా తగిలింది..వింధ్య టక్కున బ్రేక్ వేసేలోపే స్కూటీకి సొట్ట పడింది..
కౌసుధికి, తాను కొత్తగా నాన్నతో పోరాడి మరీ కొనుక్కున్న తన స్కూటీ అంటే ప్రాణం...అసలే ఆఫీసులో ప్రాజెక్టు వర్కులో బుర్ర వేడెక్కి ఉందేమో...తిట్లు అందుకుంది...కళ్ళు కనపడవా, డ్రైవింగ్ రాకపోతే ఇంట్లో కూర్చోవాలి కానీ ఇలా జనాల మీదకి వస్తారా.. అని వింధ్యని దులిపేస్తోంది...
వింధ్య సారీ చెప్పింది, డామేజీ ఖర్చులు ఇస్తానంది...కౌసుధి వింధ్యను అడిగింది..మీ డబ్బులకు సొట్ట తీయించుకోగలను, కానీ అసలు గీత కూడా పడకుండా చూసుకుంటున్న నా స్కూటీని కొత్తదానిలా దెబ్బతగలనట్లు తిరిగివ్వగలరా.. అంది...
వింధ్యకి కౌసుధి మాటలు మూర్ఖంగా అనిపించాయి...అయినా సరే సౌమ్యంగానే.. చూడమ్మా నేను చూసుకోలేదు..చూసి ఉంటే ఇంత గొడవే లేదు...అయిపోయినదాన్ని అవ్వనట్టుగా చేసేది ఎవ్వరి వల్లా కాదు...నీ స్కూటీ రిపేరు నేనే దగ్గరుండి చేయిస్తాను.. అంది...
అవున్లెండి మీలాంటి డబ్బుపొగరున్నోళ్ళు మనిషిని కారుతో ఆక్సిడెంట్ చేసి చంపేసి అయిపోయింది కదా ఇప్పుడేమి చేస్తాం, నష్టపరిహారం ఇస్తాం అని చేతులు దులిపేసుకునే రకాలు.. అని అంటుంటే.. ఇహ వింధ్యకు కోపం ఆగలేదు...షటప్ మంచిగా చెబుతుంటే బాధపెట్టేలా మాట్లాడుతున్నావేంటి, మాట్లాడే వివేకం కూడా లేనట్టుందే నీకు అని..
వింధ్య కోప్పడింది..
కౌసుధి వింధ్యతో, తప్పుచేసి ఎదురు నన్ను తిడతారేంటీ.. అంది...
వింధ్య చెప్పింది...ఎంత ఇవ్వాలో చెప్పు లేదా గార్డుకి నీ బండి కీస్ ఇవ్వు మా అబ్బాయితో బండి రిపేరు చేయించి ఇస్తాను అంది...
మరి అప్పటివరకు ఆఫీసుకి మీ కారులో తీసుకెళ్ళితీసుకువస్తారా నన్ను మీరు.. అంది కౌసుధి..
కాబ్ డబ్బులు ఇస్తాను కాబ్ లో వెళ్ళిరా.. అంది వింధ్య..
అబ్బో కుప్పలు కుప్పలు పడున్నట్టుయే మీదగ్గర డబ్బులు, కష్టపడ్డవి కావేమో.. అంది హేళనగా కౌసుధి..
వింధ్యకి చాలా కోపం వచ్చింది..ఇంక ఈ పిల్లమూర్ఖురాలుతో నాకెందుకు అనుకుని తన విజిటింగ్ కార్డు తీసి కౌసుధికి ఇచ్చి తన కారు పార్కు చేసుకుని తన ఫ్లాటుకి వెళ్ళిపోయింది వింధ్య.
ఆ రోజే కాసేపు తరువాత కౌసుధి వాళ్ళ అమ్మ
లత వచ్చి రిపేరుకోసం వెయ్యిరూపాయలు తీసుకెళ్ళింది...
హోలీ పండుగ వచ్చింది.. ఫ్లాట్సులో వాళ్ళందరూ సొసైటీ పార్కులోనూ బాట్ మింటన్ కోర్టులోనూ రంగులు చల్లుకుని విషెస్ చెప్పుకుని ఫ్లాట్సుకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న లంచ్ కి వచ్చారు...
వింధ్య, యష్ వారి అబ్బాయి ఆర్య, ప్లేట్సులో వడ్డించుకుంటున్నారు...వింధ్యకి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి పక్కకు చూసింది...దూరంగా ఫ్రెండ్సుతో మాట్లాడుతూ తననే చూస్తున్న కౌసుధి కనపడింది...వింధ్యకి వెంటనే కోపంతో నొసలు ముడిపడ్డాయి, విసురుగా తల పక్కకు తిప్పేసుకుంది...
అందరూ రుచికరమయిన విందుభోజనం చేసి ఎవరిళ్ళకి వాళ్ళెళ్ళిపోతుంటే కౌసుధి వాళ్ళ అమ్మ లత ఎదురుపడింది, నమస్తే హాపీ హోలి అని పలకరించింది..వింధ్యకి లోపల మనసుకి కష్టంగా అనిపించినా పైకి మాత్రం నమస్తే, సేం టూ యూ.. అని జవాబు చెప్పింది...
ఆర్య చదువుతాడు కానీ అంత మరీ ప్రతిభ చూపించే విద్యార్ధి కాదు..చదువు కంటే పాడటం ఎక్కువ ఇష్టం..ఒకవైపు ఇంజనీరింగ్ చదువుతూ, ఇంకోవైపు ఎక్కువగా తెలుగు, హిందీ పాటలు మాష్ అప్ అని యూ ట్యూబ్ వీడియోలు చేస్తూ పాటలకే ఎక్కువ సమయం కేటాయించేవాడు...చదువులో మార్కులు 85 పర్సెంటుకి పెరిగేవి కాదు...ఒక్కో సంవత్సరం కొన్ని సబ్జెక్ట్స్ తప్పి ఒక సంవత్సరం లేటుగానే ఉద్యోగం తెచ్చుకున్నాడు...సాఫ్ట్వేర్ ఇంజనీర్...తన ప్రాజెక్టులో మొత్తం ఎనిమిదిమంది, వారికో టీం లీడర్ లేడీ హిట్లర్ కౌసుధి...
చెప్పిన టైముకి ఇచ్చిన పని చెయ్యకపోతే పిచ్చి తిట్లు తిట్టేది...ఆర్య పనిదొంగ, అందరికంటే తిట్లు ఎక్కువ ఆర్యకే పడేవి...ఖాళీ దొరికితే పాటలు పాడటం, పాటలు వినటం ఆర్య అలవాటు....
ఒకరోజు సాయంత్రం నాలుగయ్యింది ముసురుగా ఉంది వాతావరణం అప్పుడప్పుడూ ఉరుముల సంగీతం, మెరుపులు, జోరున వాన ...ఆస్వాదిస్తూ ఆర్య...బాల్కనీలో బీన్ బాగ్ మీద వాలి కూర్చుని వానని దీర్ఘంగా చూస్తూ...థోడా థోడా ప్యార్ హొ గయా
తుమ్ సే థోడా థోడా ప్యార్ హొ గయా అని ఇందిర సినిమాలోని పాటను పాడుకుంటున్నాడు...
చిన్నగా దగ్గి తను వచ్చానన్న సంకేతం ఇచ్చింది వింధ్య ఆర్యకి...తల్లి వైపు చూసాడు ఆర్య...పొగలు కక్కే కాఫీ కప్పులతో తల్లి నించుని ఉంది...కాఫీ తీసుకుని అమ్మా అన్నాడు ఆర్య...సిగ్గుతో కొంచెం ఎర్రబడిన కొడుకు మొహం చూసి వింధ్య ఎవరేంటీ అంది అల్లరిగా...ఆ తల్లీ కొడుకులకి సరదా మాటలు , ఏడిపించుకోవటాలు చాలా అలవాటు...ఏంటమ్మా అన్నాడు ఏమీ తెలీనట్లు కాఫీ సిప్ చేస్తూ ఆర్య...యష్ కూడా వచ్చి కూర్చున్నాడు...భలే ఉంది కదా మన శెలవురోజున ఇలా హాయిగా వానసాయంత్రం..... అనుకుని ముగ్గురూ అంత్యాక్షరి ఆడుతూ హాయిగా ఓ రెండుగంటలు పాటలు, మాటలుతో సమయం గడిపారు...అలాంటి మంచి సమయాలను అప్పుడప్పుడూ ఇలా మూట కట్టుకుంటూ ఉంటారు వింధ్య, యష్, ఆర్య...
ఆ రోజు వినాయకచవితి...సొసైటీవాళ్ళు ఎప్పట్లానే గ్రౌండులో గణేషుని పూజకు ఏర్పాట్లు చేసారు..ఫ్లాట్సు వాళ్ళందరూ పూజకోసం కిందకొచ్చారు...ఆర్యకి దూరంగా గులాబీరంగు చీర ఆకుపచ్చని డిజైనర్ బ్లౌజులో ఎర్రనిచిన్నబొట్టు చెవులకు వేలాడుతూ బంగారుబుట్టలు అచ్చతెలుగు ఆడపిల్ల అలంకరణలో కౌసుధి కనపడింది...అప్రయత్నంగా కౌసుధి వైపు వెళ్ళాడు ఆర్య ..కౌసుధి ఆర్యను చూసింది...హాయ్ అన్నాడు ఆర్య..అరే నువ్వేంటి ఇక్కడ అంది కౌసుధి ఆర్యని...ఇక్కడే జి ఫైవ్ నాట్ టూ లో ఉంటాము అన్నాడు ఆర్య...అవునా అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది కౌసుధి...ఎందుకంటే వింధ్య ఇంటి నంబరు కౌసుధికి గుర్తుండిపోయింది...
సరిగ్గా రెండురోజుల ముందే ఆర్య కౌసుధికి తన ప్రేమను తెలియచెప్పాడు...కౌసుధికి, పై చదువులకి, ఫారెన్ వెళ్ళాలని ఉంది, అందుకే ప్రేమపెళ్ళి గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించట్లేదు...
ఆర్య చెప్పాడు భలే ఉన్నావ్ కౌసుధి ఇలా చీరలో, చాలా బావున్నావు అన్నాడు...ఊ ఊ సరే అంది నిరాసక్తిగా కౌసుధి...
అందరూ పూజ చేస్తున్నారు...ఆర్య మధ్యమధ్యలో కౌసుధి వైపు తలతిప్పి చూస్తున్నాడు...వింధ్య.. ఆర్యా ఏమిటీ శ్రద్ధపెట్టటంలేదు పూజ మీద అంది కొడుకుతో...లేదమ్మా ఏమీ లేదు. అన్నాడు ఆర్య....
కొన్ని నెలలకు కౌసుధికి ఫారెన్ లో ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చింది...ఇంక కౌసుధి ఆనందానికి హద్దులు లేవు...ఇంకో నెలలో తాను విదేశానికి వెళుతున్నట్టు చెప్పింది...ఆర్యకు ఆలోచనలు, దిగులు ఎక్కువయ్యాయి...
ఆ రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాడు చెప్పు నాన్నా ఏంటి అంది పప్పుచారు తయారుచేస్తూ వింధ్య...తల్లిని చెయ్యిపట్టుకుని హాలులోకి తీసుకొచ్చి సోఫాలో కూచోపెట్టాడు ఆర్య...
అమ్మా తను ఫారెన్ వెళ్ళిపోతుందమ్మా.. అన్నాడు దిగులుగా ఆర్య.. ఎవరు నాన్నా.. అడిగింది వింధ్య..కౌసుధి.. అన్నాడు ఆర్య...ఓ మీ టీం లీడరా మంచిదేగా, హిట్లర్ వెళ్ళిపోతే మీకు రిలీఫేగా అంది వింధ్య...తనకి నేను ఆరునెలల క్రితం నా ప్రేమను చెప్పానమ్మా, తనేమీ జవాబు చెప్పలేదు అన్నాడు ఆర్య..
ఏమిటీ అంది ఆశ్చర్యం, ఆనందం, తెలీని భయం అన్నీ కలగలిసి వింధ్య...అవునమ్మా నాకు తనంటే చాలా ప్రేమ, నువ్వు నాన్న ఒప్పుకుంటే, తనూ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటే నాకు కౌసుధిని పెళ్ళి చేసుకోవాలని ఉంది అన్నాడు స్థిరంగా ఆర్య...ఇన్నిరోజులూ తను సమాధానం చెప్పిన తరువాత నీకు చెబుదామనుకున్నాను, ఇప్పుడు తను దూరం వెళుతుంటే చెప్పాల్సిన సమయం వచ్చింది అనిపించి చెబుతున్నాను అన్నాడు ఆర్య...
తను మన సొసైటీలోనే ఉంటుందమ్మా అన్నాడు ఆర్య...అవునా మరి ఇన్నిరోజులూ చెప్పలేదే.. అని సరే కానీ ఇప్పుడు చెప్పు ఏ ఫ్లాట్ అంది వింధ్య...బి త్రీ నాట్ ఫోర్ అన్నాడు...సరే నాన్నని అడిగి మనింటికి పిలుద్దాము వారిని, మాట్లాడుకుని అన్నీ బావుంటే ముందుకెళ్ళొచ్చు సరేనా.. అంది ప్రేమగా, స్నేహంగా కొడుకు తల నిమురుతూ వింధ్య...
ఆదివారం కౌసుధి, లత, నారాయణ వచ్చారు...వింధ్య పప్పులో తిరగమోత పెడుతోంది..ఆర్య రూంలో రెడీ అవుతున్నాడు, యష్ తలుపు తీసాడు..రండి రండి అంటూ చేతులు తుడుచుకుంటూ హాలులోకి వచ్చిన వింధ్య కౌసుధి వాళ్ళని చూసి షాక్ అయ్తింది..మొహాన నవ్వు మాయం అయ్యింది..ఆర్య వచ్చాడు కూర్చోండి అన్నాడు..కౌసుధి వింధ్య మొహంలో మారుతున్న భావాలను చూస్తూ నుంచుంది..యష్ హెల్పర్ ఖుషీకి నీళ్ళు తెచ్చి ఇమ్మని చెప్పాడు...
కౌసుధి ఉన్నట్టుండి అల్లరిగా నవ్వుతూ వచ్చి చిలిపిగా వింధ్యని చేతులు పట్టుకుని హాయ్ ఆంటీ అని పలకరించింది..వింధ్య నెమ్మదిగా మృదువుగా కౌసుధి చేతులు విడిపించుకుని లతకి నారాయణకి చేతులు జోడించి స్వాగతం పలికింది..ఎలా ఉన్నారు అని మర్యాదగా నవ్వుతూ పలకరించింది..చిన్నగా మాటల్లో పడ్డారు పెద్దవాళ్ళు..
కౌసుధీ పదా నా రూం చూద్దువుగానీ అన్నాడు ఆర్య..వింధ్య చివుక్కున తల తిప్పి చూసింది పిల్లల వైపు..కొంచెంసేపు ఆగి చూస్తాను ఆర్యా అని చెబుతూ కౌసుధి, స్వతంత్రంగా వింధ్య పక్కన వచ్చికూర్చుంది..
కాఫీనా టీనా అంటూ వింధ్య వంటింట్లోకి వెళ్ళింది..కౌసుధి వింధ్య వెనకే వెళ్ళింది..లంచ్ టైములో కాఫీ ఎందుకు అని వేడి వేడి టొమాటో సూప్ కప్పుల్లో పోస్తోంది వింధ్య..కౌసుధి హెల్ప్ చెయ్యబోతోంది..ప్లీజ్ నువ్వేమీ చెయ్యనవసరం లేదు అంది వింధ్య..
ఆంటీ సారీ, ప్లీజ్ కోపం వద్దు.. అంది కౌసుధి చిన్నపిల్లలా చెవులు చేతులతో పట్టుకుని ..వింధ్యకి ఎలా స్పందించాలో అర్ధం కానట్టుగా అనిపించింది..తిట్టాలనీ లేదు అలాగని స్నేహంగా ఉండాలని అస్సలు అనిపించటం లేదు...ఒక్క నిముషం దీక్షగా కౌసుధిని చూసింది వింధ్య..
కౌసుధి కళ్ళల్లో సన్నటి నీటితెరలా కనిపించింది వింధ్యకి..ఆర్య అంతా గమనించి అమ్మా ఏంటీ అన్నాడు..వింధ్య ఏమీ లేదు అంది..కౌసుధి ఏంటీ అన్నాడు ఆర్య మళ్ళీ ..
నాకు ఆంటీకి ఒకసారి గొడవ జరిగింది..నేను ఆంటీని చాలానే అనేసాను..అంది కౌసుధి..ఏమన్నావ్ అన్నాడు ఆర్య..
వింధ్య, అరే పదండి హాల్లోకి ఇప్పుడు అవన్నీ ఎందుకు.. అంది..
భోజనాలు కానిచ్చారు..అందరూ అన్నీ మాట్లాడుకున్నారు...కొంచెం సమయం తీసుకుని నిర్ణయించుకుందాం అనుకున్నారు..
లతా వాళ్ళతోటే ఆర్యా వెళ్ళాడు..లతా వాళ్ళు లిఫ్టులో వెళితే ఆర్య కౌసుధి మెట్లు దిగుతుంటే ఆర్య అడిగాడు అమ్మని ఏమన్నావు అని..కౌసుధి దాచకుండా అన్నీ చెప్పేసింది..
సారీ కౌసుధి నాకు సమయం కావాలి నిర్ణయం తీసుకోవటానికి..అమ్మ స్వతహాగా సున్నితమనస్కురాలు, తొందరపడి ఒకళ్ళని హర్ట్ చెయ్యదు, తనని ఎవరన్నా ఏదన్నా అంటే బాధపడుతుంది..నీ పిచ్చికోపం తిట్లు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు..అయినా నీ కల్మషం లేని మనస్సు నాకు అర్ధమై నీకు దగ్గరయ్యాను, కానీ అమ్మతో నీ ప్రయాణం మంచి అడుగుతో మొదలవ్వాలనుకున్నాను, కానీ ఆల్రెడీ తప్పటడుగులు పడ్డాయి..నాకు మనసుకి కష్టంగా ఉంది..కొంతసమయం ముందువరకూ నా ప్రపంచంలో నువ్వే నా సగభాగం అనుకున్నాను..ఇప్పుడు కొన్ని అడుగులు నువ్వు నాకు దూరం అయ్యావు..సారీ నిన్ను బాధపెట్టాలని ఇదంతా చెప్పట్లేదు...రెండురకాలుగా అంటే మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఏమీ సమస్యలేనట్టుగా నేను మాట్లాడలేను..అర్ధం చేసుకో అని కౌసుధి వైపు చూసాడు..ఆర్య కళ్ళల్లో నీళ్ళున్నాయి, అవి ప్రియురాలి కోసమో తల్లి కోసమో ఇద్దరికోసం చెరిన్ని ఏమో..కౌసుధి మాత్రం సన్నటి చిరునవ్వుతో ఇది నేను ఊహించా అన్నట్టు చూస్తోంది..సరే అన్నట్టు తలూపింది..అంతే రయ్యిమని ఇంక అక్కడ ఉండలేనట్టు మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయాడు ఆర్య...
ఊ నా కోడలు కళ్ళు భలే ఉన్నాయిరోయ్, నువ్వు నాతో అంటుండేవాడివి అ హీరోయిన్ కళ్ళు పెద్దవి, బావున్నాయి కదా అని ..ఇప్పుడు నిజంగా నీకు నచ్చినట్టే పెద్దకళ్ళు, నీ రియల్ హీరోయిన్ వి అంది వింధ్య..
ఆర్య కామ్ గా తన గదిలోకి వెళ్ళిపోయాడు..
ఇంక నాలుగురోజుల్లో తను వెళ్ళిపోతుంది అని పార్టీ ఇస్తోంది టీం అందరికీ కౌసుధి.. పార్టీ ప్లేస్, టైం చెబుతోంది..ఆర్య పట్టించుకోవట్లేదు ..ఆర్యా నువ్వు టైం కి వచ్చేస్తావుగా అంది కౌసుధి..నేను పార్టీకి రాను సారీ అన్నాడు ఆర్య..అరే అదేంటి అంది కౌసుధి..
ఆర్యా ఈ రోజు నన్ను నీ కారులో తీసుకెళతావా..నాకు తలనొప్పిగా ఉంది స్కూటీ డ్రైవ్ చేయలేను అడిగింది కౌసుధి..కారులో వెళుతున్నారు ఇద్దరూ..ఆర్యా ఆంటీకి నేను మళ్ళీ సారీ చెప్తాను, నాకు అత్తమ్మ అంటే చాలా గౌరవం ఉంది, ఆ రోజు చిరాకులో ఉన్నాను, వాగేసాను, తప్పే కానీ ఆ రోజు పరిచయం లేని మనిషితో మాట్లాడిన మాటలవి, ఆంటీని తెలిసి నేను అనను, అవమానించను, నన్ను నమ్ము ప్లీజ్, నీ కళ్ళతోనే ఎంతో ప్రేమ చూపించేవాడివి నువ్వు, అత్తమ్మ ఇంటికి రమ్మని పిలిచినతరువాత మధ్యలో ఆ నాలుగురోజుల్లో మనం ఎన్ని మాట్లాడుకున్నాము, ఆ మాటల్లో నీ ప్రేమను తెలుసుకున్నాను, మన భవిష్యత్తుని ఎంత అందంగా చూపించావు..అని మాట్లాడుతూ మనసు బరువెక్కి మౌనంగా ఉంది...ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరి తో ఒకరు ఉన్న, అక్కడ ,అప్పుడు ,తామిద్దరం మాత్రమే ఉన్న ఆ సమయపు అనుభూతిని మనసులో నింపుకుంటున్నారు...
ఆర్యా, అత్తమ్మ, నువ్వూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇంతకంటే చెప్పాలంటే నాకు నా ఆత్మాభిమానం హెచ్చరిస్తోంది ఇంక చాలు అని అంది కొంచెం బాధగా..ఆర్యకి కళ్ళల్లో నీళ్ళు నిండాయి...మళ్ళీ కాసేపు మౌనం తరువాత నోరు విప్పి మాట్లాడాడు ఆర్య..కౌసుధి మనం ఫోన్లోను సొషల్ నెట్‌వర్క్‌లోనూ టచ్ లోనే ఉంటాం కదా..చూద్దాం సమయం ఎలా మనని తీర్చిదిద్దుతుందో అన్నాడు నమ్మకాన్ని ఇస్తూ కౌసుధికి...
పొద్దున్న ఆర్య లేచి హాలులోకి వచ్చేటప్పటికి ఏవో మాటలు వినిపిస్తున్నాయి...హాలు పక్కన దేవునిగదిలో కౌసుధి చిరు ఆకుపచ్చ రంగు పట్టుచీరకి ముదురు ఆకుపచ్చ జరీ అంచుతో నిండుగా పీటమీద కూర్చుని ఉంది..కౌసుధి చేతికి కొత్తగా చేయించిన బంగారుగాజుల డబ్బా అందించి వేసుకో పిల్లా అంది వింధ్య నవ్వుతూ..ఏరా నా కోడలుపిల్ల ఆకుపచ్చరంగు చీర లో భలే ఉందికదా నువ్వు చూపు కూడా తిప్పుకోలేనంతగా అంది వింధ్య అల్లరిగా నవ్వుతూ కొడుకుని ఆట పట్టిస్తూ..లతా యష్ నారాయణ భళ్ళున నవ్వేసారు..కౌసుధి మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది..అత్తమ్మా అని వింధ్యని అల్లుకుపోయింది..నా బంగారు అని కోడలి నుదిటిన ముద్దుపెట్టింది వింధ్య...కళ్ళు తెరిచిన ఆర్యకి అదంతా తెల్లవారుఝామున వచ్చిన కల అని అర్ధమవ్వటానికి ఓ నిముషం పట్టింది...లేచి కూర్చుని ఎదురుగా నవ్వుతూ ఉన్న సాయిబాబా ఫొటో చూసి దణ్ణం పెట్టుకున్నాడు, ఇంత మంచి కల నిజం అయ్యేలా చెయ్యమని..
మూడేళ్ళకి కౌసుధి పెద్దచదువులు పూర్తి చేసుకుని భారతదేశం తిరిగొచ్చి తానే సొంతంగా ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ తెరిచింది..ఆర్యా చాలా పాటలపోటీల్లో పాల్గొని ప్రైజులు తెచ్చుకుని మంచిపేరు సంపాదించుకుని తనకంటూ యూ ట్యూబ్ స్టార్ గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు..కౌసుధి కంపెనీలో బాధ్యతలన్నీ తనే చూసుకుంటున్నాడు...ఇన్నేళ్ళల్లో "గొడవ అనే చిన్నవిషయం పెళ్ళి అనే పెద్దబంధం నిర్ణయించటం లో ముఖ్యపాత్ర పోషించటం చాలా తప్పని... వింధ్య ఆర్యకి నచ్చచెప్పింది...మనసుకి నచ్చేవారు దొరకటం కష్టం దొరికినవారిని చిన్నచిన్నకారణాలతో దూరం చేసుకోకూడదని ఆర్యని తన సందేహాలనుంచీ బయటకు తెచ్చింది..
రెండు భిన్నమైన సంఘటనలు కలిపి చూడటం తప్పని... చెప్పింది వింధ్య..ఫేస్బుక్ చాటింగ్ ఫోన్ చాటింగ్ వల్ల వింధ్య కౌసుధి చాలా మంచి స్నేహితులు అయ్యారు..ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారు..ఇప్పుడు వారి ఒకప్పటి గొడవ వారిద్దరికీ గుర్తొచ్చినప్పుడల్లా హాయిగా నవ్వేసుకునే ఓ మధుర జ్ఞాపకం...
ఇద్దరు మూర్ఖుల మధ్య చిన్నమాట అయినా పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది..ఇద్దరు వివేకం ఉన్నవారిమధ్య పెద్దగొడవైనా స్నేహంగా చిగురించగలదు...బంధంగా మారగలదు అని వింధ్య కౌసుధి నిరూపించారు..ఇద్దరినీ సమానంగా అర్ధం చేసుకున్న ఆర్య కూడా ఎంతకాలమైనా సహనంగా ఓపికపట్టి ఇద్దరికీ బలమయ్యాడు...బంధాలను ధృఢపరిచాడు..
తులసీభాను.
సేకరణ 🌹
No comments:
Post a Comment