కాఫీ విత్ మధు ☕️
వరంగల్ ఆర్.ఈ.సి లో ఇంజనీరింగ్ పూర్తయి ఇంటికి వెళ్ళగానే అమ్మకి సర్టిఫికెట్ చూపించాను.
ఆమె ముఖం వెలిగిపోయింది.
ఆ రోజు భోజనం చేస్తూ ఉండగా ఆమె చేతులు చూస్తే ఏదో తేడా కనబడింది. "గాజులేవి?" అని అడిగాను.
"అవన్నీ నీకెందుకు? భోంచెయ్యి" అంది.
భోజనం అయ్యాక మా నాన్న ఎదురుగా కూర్చున్నాను.
"ఇప్పుడేం చేస్తావ్?" అన్నాడు.
"పీజీ చెయ్యడానికి అమెరికా వెళదాం అనుకుంటున్నాను" అన్నాను.
ఆయన నా ముఖంలోకి సూటిగా చూశాడు.
రెండు మూడు నిముషాల తరువాత "నీ దగ్గర దాచేదేముందిరా?
పోయిన ఏడాది వర్షాభావం వలన పంట పది బస్తాలు కూడా రాలేదు. నిజం చెప్పాలంటే కొన్ని నెలలు నీ ఖర్చులకి డబ్బు పంపడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము" అన్నారు.
అమ్మ గాజులు ఏమయ్యాయో అర్థమయింది.
"అక్కకివ్వాల్సిన వాటా ఇచ్చేశాను. నీకివ్వాల్సినదంతా నీ చదువు మీద ఖర్చు పెట్టేశాను.
తమ్ముడికేమో చదువు అబ్బలేదు. వాడు వ్యవసాయమే చెయ్యాలి.
ఉన్న పొలం మీద భవిష్యత్తులో నేను, అమ్మ, తమ్ముడి కుటుంబం మొత్తం అంతా ఆ కాస్త పొలం మీదే
బతకాలి.
ఇప్పుడు నిన్ను నేను అమెరికా పంపలేనురా. నువ్వు ఉద్యోగం చూసుకుంటే మంచిది” నాన్న చెప్తున్నాడు.
ఆకాశం బ్రద్దలవలేదు. ఉప్పెనలు రాలేదు.
పరిస్థితి పూర్తిగా అర్థమై౦ది. నేను డిజప్పాయింట్ కాలేదని చెప్పను కానీ ఆ క్షణం ప్రాక్టికల్‌గా ఆలోచించాను.
ఇన్ని సమస్యల మధ్య నా తల్లిదండ్రులు నన్ను ఇక్కడి దాకా చదివించడమే పెద్ద సాహసం..!
ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించు కున్నాను.
అప్పట్లో ఇంటర్నెట్ లేదు. పేపర్లో ఉద్యోగాల ప్రకటనలు చూసి దరఖాస్తు చేసుకోవడమే.
రోజూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వెయ్యమని పేపర్ వాడికి చెప్పాను.
ఆ రాత్రి మా అమ్మతో, “నేను ఉద్యోగం చూసుకుంటాను" అని చెప్పాను.
ఆమె ముఖంలో ఏదో తెలియని రిలీఫ్ కనిపించింది.
“అమ్మా... ఉద్యోగం చేసి నీ గాజులు తాకట్టు నుంచి నేను విడిపిస్తాను" అన్నాను ఏదో సినిమాలో హీరోలా.
ఆమె నవ్వి "అవి నీ కోసం వరంగల్ వెళ్ళాయి లేరా. అంతే. వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. హాయిగా నిద్రపో" అంది.
బోంబే లో యునింపెక్స్ ఫౌండ్రీ మా అన్నగారింటికి చాలా దూరం.
ఉదయం నాలుగున్నరకే లేచి, పరేల్ నుండి దాదర్, దాదర్ నుంచి కళ్యాణ్, కళ్యాణ్ నుంచి టిట్వాలా మూడు రైళ్లు మారి, అక్కణ్నుంచి ఓ కిలోమీటరు నడిచి ఏడున్నరకల్లా మా ఫ్యాక్టరీకి చేరుకునే వాణ్ని.
రాత్రి ఇంటికి వచ్చేసరికి తొమ్మిదయ్యేది. వెళ్లి రావడం చాలా కష్టంగా అనిపించేది కానీ, అక్కడ పని చెయ్యడం వలన వివిధ ఫర్నెస్‌లు ఎలా పని చేస్తాయో ఒక అవగాహన వచ్చింది.
భవిష్యత్తులో ఇది నాకు చాలా ఉపయోగ పడింది.
సెప్టెంబర్ నెలలో జీతం వచ్చింది. 400 రూపాయలు.
నేను చేసిన మొట్ట మొదటి పని పోస్ట్-ఆఫీస్‌కి వెళ్లి, అమ్మ గాజులు విడిపించడం కోసం ఇంటికి మని-ఆర్డర్ చేయటం…!
కొంతమందికి ఇది చాలా సాధారణమైన విషయంగా కనిపిస్తూ ఉండవచ్చు...
'ఏముంది ఇందులో?’ అనిపిస్తూ ఉండి ఉండవచ్చు.
నాకెందుకో ఇది చాలా సంతోషకరమైన అనుభూతిగా అనిపించింది. ఏదో గెలిచిన ఫీలింగ్.
మొదటి సంపాదన..! మొదటి సద్వినియోగమైన సంపాదన..!
లోకల్ ట్రైన్లో ఇంటికి వెళ్తూ అదే రసానుభూతిలో చాలా సేపు ఉండిపోయాను.
“నువ్వు ఏదైనా గెలుపు సాధించినప్పుడు, వెంటనే మరో పనిలోకి వెళ్ళకు. కొంచెం ఆగు. నీ గెలుపుని కాస్త ఆస్వాదించు. ఆనందించు. గెలుపుని రొటీన్ చేసుకోకు” అంటాడు ఒక రచయిత.
చాలా చిన్న కొటేషన్. కానీ అద్భుతమైన కొటేషన్.
గెలుపుని ఎంత ఆనందిస్తే జీవితం పట్ల మనకి అది అంత కుతూహలాన్ని పెంచుతుంది.
మన మీద మనకు నమ్మకాన్నీ, పనుల మీద విశ్వాసాన్నీ కలిగిస్తుంది.
మనలో శక్తినీ, పని పట్ల కమిట్‌మెంట్‌నీ పెంచుతుంది.
ఈ రోజు నా వార్షిక టర్నోవర్ పదమూడు వేల కోట్లు.
అయినా నా మనసులో ఈ అనుభవం ఇంకా సజీవంగా కదులుతూనే ఉంటుంది.
నిన్న రిలీజైన ఈ పుస్తకం ధర: 240. (పోస్టల్ చార్జీలు అదనం).
ఈ రోజు (5.12.24) సాయంత్రం 6 గంటల వరకూ 180 (25% discount) కి With my autograph లభిస్తుంది.
పుస్తకం కావలసిన వారు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
https://payments.cashfree.com/forms/amoeba
ఈ ఒక రోజు అమ్మకం పైకం అభయం ఫౌండషన్ కు వెళ్తుంది.
యండమూరి 🎶
No comments:
Post a Comment