*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🛸🍁🛸🍁🛸🍁🛸🍁
*శాంతం స్వర్గతుల్యం*
*మనిషి కొండంత విలువను పోగొట్టేది గోరంత కోపం. కోపం వచ్చిన మనిషి విచక్షణను కోల్పోయి పశువుగా మారతాడు. కోపాన్ని జయించిన మనిషి గోవిందుడు. జనం అతణ్ని మెచ్చుతారు. అతడి సాంగత్యాన్ని ఇష్టపడతారు. సప్త రుషుల్లో విశ్వామిత్రుడు, జమదగ్ని ఉగ్రస్వభావులు. కశ్యప, అత్రి, భరద్వాజ, గౌతమ, వసిష్ఠులు సాధుపుంగవులు. మునుల్లో దుర్వాసుడు ముక్కోపి. పుడమిపై పాపభారం పెరిగి, పుణ్యాత్ములు హింసపడుతుంటే భగవంతుడికీ కోపం వస్తుంది. పర్యవసానమే- అవతారాలతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నెరపడం. శాంతం మనిషి ముఖాన్ని, రూపాన్ని ఉద్దీపింపజేస్తుంది. ధ్యానంలో ఉన్న బుద్ధభగవానుడి ప్రశాంత వదన దర్శనం మానవుడిలోని కోపాన్ని నశింపజేస్తుంది. నవరసాల్లో వీరం, భయానకం, బీభత్సం, రౌద్రాలకు కారణం కోపమే!*
*తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. కోపం మనిషిని ఏకాకిని చేస్తుంది. పనులకు విఘాతం కలిగిస్తుంది. సమాజ జీవి అయిన మనిషికి పదిమంది శ్రేయోభిలాషులుంటేనే సంఘజీవనం సంతోషదాయకం అవుతుంది. పరిస్థితులన్నీ ఎప్పడూ ఒక్కలాగా ఉండవు. ఒక్కోసారి అనుకోని విధంగా, ఆయా విపత్కర సమయాలు మనిషి కోపానికి హేతువులవుతాయి. అలాంటప్పుడే సంయమనం పాటించి, మనసును నియంత్రించుకోవాలని మానసిక శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తికి అహంకారంతో కోపం వస్తే, అధమ స్థాయి వ్యక్తి కోపానికి ఏమీ చేయలేని నిస్సహాయత కారణమవుతుంది. స్థాయీభేదాలన్నది ఈ శరీరానికే, ఆత్మకు అంటవు అన్న పురాణ వచనాలు మనిషిలోని ఈశ్వరుణ్ని పరిచయం చేస్తూ, సమానత్వ భావనల్ని అంకురింపజేస్తాయి. అందరిలో తనను చూసుకునే వ్యక్తిలో కోపానికి ఆస్కారం ఉండదు.*
*ప్రకృతికి కోపం వస్తే, అది అన్ని క్రోధాలకన్నా భయంకరమైనది అంటాడు చాణక్యుడు. అదెంతటి నిజమో సోదాహరణంగా రుజువవుతూనే ఉంది!కార్యార్థి సామ, దాన, భేద], దండోపాయాలతో కార్య సాఫల్యత పొందాలి. కార్యసాధకుడికి కోపం ఉండకూడదు. నొప్పింపక, తానొవ్వక, సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఫలితం సాధించాలి. సంధి ప్రయత్నాల కోసం శత్రుశిబిరాలకు వెళ్ళడమంటే, పులిగుహలోకి అడుగుపెట్టడంతో సమానం. అక్కడ కవ్వింపులు, వెక్కిరింపులు, కయ్యానికి కాలుదువ్వడం అత్యంత సహజం. దూతలుగా వెళ్ళేవారిలో సదా శాంతి, సామరస్యభావాలు తొణికిసలాడాలి. ఇళ్లలో నవ్వుతూ శాంత స్వభావాన్ని వ్యక్తం చేసే సభ్యుల ఛాయాచిత్రాలు ఉంటాయే తప్ప, కోపాన్ని ప్రతిఫలించేవి ఉండవు కదా!*
*శాంతం మిఠాయి అయితే, కోపం కారంలాంటిది. సాధారణంగా ఎవరైనా మిఠాయిని ఇష్టపడినట్టుగా కారాన్ని కోరుకోరు. శుభవార్తలను సంతోషంగా పంచుకోవడానికి మిఠాయినే ఎంచుకుంటారు. శాంతం లేక సౌఖ్యం లేదు అన్నది త్యాగరాజ కృతి. మనసులో కోపం ఉన్న మనిషికి సుఖం, శాంతి ఉండవు. కోపాన్ని అదిమి ఉంచడానికే నవ్వుతూ బతకాలంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. కోపం నరక సదృశం, శాంతం స్వర్గతుల్యం అన్నది ఆధ్యాత్మిక ఉపదేశం. ప్రశాంత చిత్తమే మోక్షపథం కనుక మనిషి, ఇతర జీవుల్ని ఈ విషయంలో అధిగమించాలి. ఉత్తమంగా నిలవాలి!*
🍁🛸🍁 🛸🍁🛸 🍁🛸🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴
No comments:
Post a Comment