విశ్వాత్మ ఛానల్ పాఠకులకు
. శుభాభినందనలు 🙏
13-జూలై -2024
చలాచల బోధ .......,.,
. బుద్ధి అంటే వివేకము, విచక్షణా జ్ఞానము.బుద్ధితోనే శ్రవణం,వస్తు నిశ్చయ జ్ఞానం.ఏకాగ్రత అంటే బుద్ధి పరిథిలోనికి వెళ్ళి, మనస్సు యొక్క అడ్డు తాత్కాలికంగా తొలగించుకోవటము.ఇటువంటి ఏకాగ్రతతో వినడాన్ని శ్రవణం అని అంటారు.ఇటువంటి ఏకాగ్రతతోనే ధ్యానము చేయవలెను.ఇటువంటి ఏకాగ్రతతో విచారణ చేయాలి.తాత్కాలికంగా మనస్సును పనిచేయకుండా ఆపివేసి విచారణ చేసి,వస్తు నిశ్చయ జ్ఞానమును సంపాదించిన పిదప లక్ష్యం తెలియబడుతుంది.ఒకసారి ఆ లక్ష్యం తెలిస్తే నిధి సంపాదించినంత ఆనందం కలుగుతుంది.ఇక ఆ లక్ష్య సాధనకు ఏదైనా సరే త్యాగం చేస్తాము.
ఈ పరిస్థితిలోనే ఆత్మానాత్మ విచారణ చేయాలి.దాని వలన మనలో ఆత్మ ఏదో ఆత్మ కానిదేదో విషయంగా తెలుస్తుంది.ఆత్మ కానిదంతా అనాత్మ అనబడుతుంది.
ఆత్మ అంటే చైతన్యము లేక చిత్.అనాత్మ అంటే చిత్ కానిది.చిత్ కానిదంటే తనంతట తాను కదలనిది,చలించనిది,స్పందించనిది.చిత్ అనగా తనలో తోచిన సృష్టిలో వ్యాపించియున్నది.
చిత్ లో తోచిన సృష్టి జడము.వ్యాపకమైయున్న చిత్తే చైతన్యమనబడును.సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి వ్యాపకము కానటువంటి చైతన్యము చిత్ లేక చిత్ఘనము అనబడును.సృష్టి మిథ్య గనుక చిద్ఘనమే ఉన్నదున్నట్లున్నది.మనము సృష్టిలో భాగమై ఆ సృష్టిలోనే ఉన్నాము.ఇపుడు మనలో చైతన్యము ఎక్కడ ఉన్నది? సృష్టిలో భాగమైన జడమెక్కడ ఉన్నది?మనలో పరిమితమైయున్నట్లు అనిపించే చైతన్యమునే ఆత్మ అంటారు.నిజానికి చైతన్యము అఖఃడము,అవిభాజ్యము.మిథ్యా సృష్టిలో పరిచ్ఛిన్నమైనట్లు అనిపిస్తుంది.ఈ చైతన్యము సృష్టిలో భాగమైన దేశ కాల పదార్థములలో పరిచ్ఛిన్నమైనట్లు అనిపించినా సృష్టి మిథ్య గనుక నిజానికి చైతన్యము పరిచ్ఛిన్నము కాలేదు.కావున చైతన్యము సృష్టికి పూర్వం దేశకాల అపరిచ్ఛిన్నము.కేవల చిత్ ను చిన్మాత్ర అంటారు.లేక చిద్రూపము అని అంటారు.
మనకు చిత్ జడములు,ఆత్మ అనాత్మలను కొంత వరకే తెలిసింది.మరింత లోతుగా, వివరంగా తెలుసుకుందాము.
సశేషం.
🙏 ----------విజ్ఞాన స్వరూప్
🙏
No comments:
Post a Comment