Saturday, December 14, 2024



 ఒకప్పుడు శ్రీకాళహస్తి రాజు మీదకు పొరుగు దేశపురాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చాడు. కాళహస్తి రాజు మొదట్లో కలవరపడినా తరువాత తమ కులదైవమైన "జ్ఞానప్రసూనాంబ"ను తలుచుకొని కొద్ది సైన్యంతోనే శత్రువులను ఎదిరించాడు.

శత్రురాజు ఈ యుద్ధంలో మొట్టమొదటి సారిగా తుపాకులను ఉపయోగించాడు. అందరూ కాళహస్తి రాజు ఓడిపోతున్నాడు అనుకున్నారు. తుపాకుల ముందు మామూలు ఆయుధాలు నిలుస్తాయా?

ఆశ్చర్యంగా కాళహస్తి రాజు విజయం పొందాడు. 

ఆ రోజు రాత్రి కాళహస్తి రాజు కలలో జ్ఞానప్రసూనాంబ కనబడి తనకు ఒక చీర పెట్టమని అడిగింది. 

రాజు ఆశ్చర్యపడుతూ -
'అమ్మా! నీకు చీరలు లేకపోవడం ఏమిటి?" అని అడిగాడు.

దేవీ తుళ్లిపడినా తన పమిటి చెంగును చూపుతూ, బిడ్డా! తుపాకీ గుళ్ల వల్ల ఇట్లా అయ్యింది...తుపాకీ గుళ్లు నీకు, నీ సైన్యానికి తగలకుండా నా చెంగు అడ్డం పెట్టాను... అని అన్నది. 

కాళహస్తి రాజు ఉలిక్కిపడి లేచాడు...
ఆనందభాష్పాలు చెక్కిళ్లపై రాలుతున్నాయి. తన విజయరహస్యంలోని రహస్యం అవగతం అయ్యింది. తన తల్లి జగజ్జనని జ్ఞానప్రసూనాంబ తుపాకీగుళ్ళను తనపై తీసుకొని విజయాన్ని అనుగ్రహించింది.
ఎంత కరుణ...!! అని పొంగిపోయాడు.

మర్నాడు రాజు జ్ఞానప్రసూనాంబను బంగారు చీరతో అలంకరింపజేశాడు.

(ఈ కథ శ్రీకాళహస్తి ఆలయంలో ఒక శాసనంలో భద్రపరిచి ఉంది)

ప్రతి శుక్రవారం జ్ఞానప్రసూనాంబకు బంగారు చీరను అలంకరింప చేస్తారు.

ఇక్కడి స్త్రీలు బంగారుచీరలో ఉన్న
అమ్మవారిని దర్శించడానికి ఉత్సాహపడతారు.

ఆ బంగారు చీరలో మరింత తేజోమంతమై విరాజిల్లుతుంటుంది అమ్మవారు.

అందువల్ల స్థానికులు శుక్రవారం తప్పక శివాలయం వెళ్లి జ్ఞానప్రసూనాంబను కనులారా దర్శించి తన్మయులవుతుంటారు.

No comments:

Post a Comment