Saturday, December 14, 2024

 భ్రమరాంబికా దేవాలయం ( శ్రీశైలం ) స్థలపురాణం..........!!
సతీదేవి ఖండితాంగాలలో మెడ భాగముఈ 
శ్రీశైల క్షేత్రమునందు పడినది. అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి ఈ బ్రమరాంబ శక్తిపీఠము. శ్రీశైలంలో భ్రమరాంబికా అవతరణ గురించి ఒక పురాణ కథ వున్నది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు వుండేవాడట. అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొని ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏమిటి అంటే స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఏ ఆయుధాలు తనను సంహరించలేకుండా వుండడమే ఆ వరం. దానితో అరుణాసురుడు, మానవులను, దేవతలను బాగా హింసించాడు. అప్పుడు దేవతలంతా సమస్య పరిష్కారానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థిస్తారు. 'అంబ యజ్ఞం' చేయమని వారికి త్రిమూర్తులు సూచిస్తారు. దేవతలు ఆ యజ్ఞాన్ని చేస్తూ వుండగా కోట్లాది భ్రమరాలు (తూనీగలు) అరుణాసురుడిని కుట్టి చంపేస్తాయి. అప్పుడు దేవతలు సంతోషించి యజ్ఞంలోనుండి ఉద్భవించిన భ్రమరాంబా అమ్మవారిని ప్రజల సంరక్షణార్థం, భూలోకంలోనే వుండమని ప్రార్థిస్తే ఆమె శ్రీశైలంలో నివాసం ఏర్పరచుకుందట.

శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం వెనుక ఎత్తైన ప్రదేశంలో భ్రమరాంబికా దేవాలయం వున్నది. ఈ దేవాలయం బయట కుడి వైపు భాగంలో చెవిని గోడకు ఆనిస్తే భ్రమరగీతం విఐపిస్తుంది.
ఈ భ్రమరగీతం భ్రమరాంబికా దేవి ఇక్కడ ఆసీనురాలైవుందని తెలియజేస్తుంది. గర్భగుడిలో వన్న భ్రమరాంబ ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది.ఎనిమిది చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో కనపడుతుంది. మహిషాసురమర్దిని రూపంలో భ్రమరాంబ దర్శనమిస్తుంది. ఉత్సవాలల్లో వూరేగించే దేవి సౌమ్య స్వరూపిణి. అందమయిన అలంకరణతో ఈ విగ్రహాన్ని వూరేగిస్తారు.గర్భగుడిలో బ్రాహ్మణ పూజారులు దేవికి పూజలు చేస్తారు. గర్భగుడిలోని విగ్రహానికి సందర్శకులు పూజచేయడాన్ని అనుమతించరు. గర్భగుడి ప్రవేశద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రానికి, కమల పీఠానికి కుంకుమపూజ చేస్తారు. ఇక్కడ వున్న కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబికా దేవి తపస్సు చేసిందట...

ఆలయ చరిత్ర

నల్లమల లోతట్టు ప్రాంతం అయినా భౌరాపూర్‌ చెరువు దగ్గర వెలసిన భ్రమరాంబ అమ్మవారికి చాళుక్యులు, రెడ్డిరాజులు మరియు విష్ణుకుండినుల పాలనలో ఈ దేవాలయం నిర్మించబడిందని చరిత్ర చెప్తున్నది. ఆదివాసీల సోదరి అయిన భ్రమరాంబికను పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం వలన చెంచు గిరిజనులు ఈశ్వరుడిని బావగా పిలుచుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వంనుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కల్యాణంచేసే పద్ధతి నేటికీ కొనసాగుతోంది,

 ఓం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామియే  నమః

No comments:

Post a Comment