Saturday, December 14, 2024

 దత్తావతారం విశిష్టమైనది.శ్రీ మహావిష్ణువు యొక్క21అవతారమూలలో అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు, బ్రహ్మ కుమారుడు అత్రి, కర్దమ మహర్షి తనయ అనసూయ. అత్రి మహాముని పితౄణము నుండి విముక్తి చెందుటకై తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. వారిని చూసి వారి ముగ్గురి అంశతో తనకో కుమారుడు కావాలని కోరుకుంటాడు.

త్రిమూర్తుల అంశతో అనసూయ,అత్రి దంపతులు దత్తాత్రేయుణ్ణి తనయడుగా పొందుతారు. ఓసారి లక్ష్మి,సరస్వతి,పార్వతిదేవిలు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షింపదలచి తమ భర్తలు ముగ్గురిని ప్రేరేపించగా వారు అభ్యాగతులుగా వెళ్ళి తమకు నగ్నంగా వడ్డించమన్నారు. మహాపతివ్రతైన అనసూయ వారిని పసిబిడ్డలుగా చేసి పాలిచ్చి పెంచసాగింది. దాంతో త్రిమూర్తులు ఆమెకు బిడ్డలయ్యారు.

అత్రి మహామునికి ఇచ్చిన వరాన్ని దత్తాత్రేయుడిగా మారి నిజం చేసారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దత్తాత్రేయుడు ఎందరికో గురుస్వరూపుడై, ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యా మంత్రాన్ని ఉపదేశించాడు, అదే పరశురామతంత్రం కుమారస్వామి కూడా దత్తాత్రేయుని శిష్యుడే. ఈయన ప్రహ్లాదునికి జ్ఞానప్రదాత. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని శిష్యుడు.సిద్ధనాగార్జునునికి రసధాతు విద్యలను బోధించిందీ ఈ స్వామే. యదువునకు యోగమార్గమును తెలియజేసింది దత్తాత్రేయులవారే. జ్ఞానేశ్వరుడు, ఏకనాధుడు వీరందరూ దత్తోపాసకులే. దత్తునివలన లభ్యం కానిది ఏమిలేదు.

మూడు శిరస్సులతో, ఆరు భుజాలతో, శంఖం, చక్రం, ఢమరుకం, త్రిశూలం, మాల, కమండలములను ధరించి నాలుగు కుక్కలతో, కామధేనువుతో ఒప్పారే దివ్యమంగళస్వరూపుడీయన. ఈయన మూడు శిరస్సులు సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులకు సంకేతం కనుక దత్తాత్రేయుడు హరిహరహిరణ్య గర్భస్వరూపుడని తెలుస్తుంది.
నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు సంకేతం కాబట్టి దత్తాత్రేయులవారు సకలవేదస్వరూపుడుగా భావిస్తున్నాం. 

ఇక కామధేనువు ఇది మనస్సుకు మాయకు సంకేతం. సంకల్ప వికల్పాలకు, సుఖదుఃఖాలకు కారణమైన మాయను తన యోగబలంతో కామధేనువుగా మర్చి తన వద్ద వుంచుకున్న మాయాతీతుడు దత్తాత్రేయుడు.

దక్షిణ భారతదేశంలో అవతరించిన శ్రీపాదశ్రీవల్లభులు, శ్రీనృసింహసరస్వతి దత్తాత్రేయుని అవతారములే. స్మరిస్తే చాలు సంతోషంతో ప్రత్యక్షమయ్యే స్వామి, త్వరగా ప్రసన్నమయ్యే స్వామి దత్తుడని ఉపాసకులు చెబుతారు. పూజ, స్తోత్రం, మంత్రం, జపం, కవచం, పంజరస్తోత్రం, దత్తహృదయం, సహస్రనామం, ఇలా ఎన్నో ఉపాసనాభేదములు దత్త సాక్షాత్కారనికి వున్నాయి.

శ్రీపాదశ్రీవల్లభులు మొదటి అవతారంకాగా, రెండవ అవతారం శ్రీనృసింహసరస్వతి. మహారాష్ట్రలోని గాణ్గాపురంలోని వీరి పాదములున్నాయి. తెలంగాణాలో మాణిక్యప్రభువుల సంస్థానముంది. బెంగుళూరు దగ్గర దాదాపహాడ్ లో దత్తాత్రేయుల శ్రీపాదములున్నాయి.

మాహూర్, గిరివార్, కరంజ, ఔదంబర్, నరసింహవాడి, గాణ్గాపురము, కురుపురము, వారణాశి, భట్టగాము, పిఠాపురం, శ్రీశైలం ఇవన్నీ దత్తాక్షేత్రములు.

 మాహూర్, గిరివార్, కరంజ, ఔదంబర్, నరసింహవాడి, గాణ్గాపురము, కురుపురము, వారణాశి, భట్టగాము, పిఠాపురం, శ్రీశైలం ఇవన్నీ దత్తాక్షేత్రములు.ఈ ప్రదేశాలు అన్నీ స్వామి వారికి ఆవాసములు.

దత్త జయంతి శుభాకాంక్షలు🙏

No comments:

Post a Comment