Sunday, December 15, 2024

****ఆప్తవాక్యాలు(ఆత్మజ్ఞానమనేది.....)

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

44. నాయమాత్మా బలహీనేన లభ్యః

ఈ ఆత్మ బలహీనునిచే లభ్యము కాదు(ఉపనిషద్వాక్యం)

ఆత్మావిష్కరణమే జీవిత పరమార్థమని వేదమతం. శాశ్వతమైన ఈ ఆధ్యాత్మిక
జ్ఞానం బలహీనునికి లభించదు అని ఘోషించింది వేదహృదయం. దైహిక దారుఢ్యం,మానసిక స్థైర్యం- ఈ రెండూ ఆధ్యాత్మిక సాధనకి అవసరం.

కానీ అన్ని బలాలూ పుష్టిగా ఉన్నంత కాలం కేవలం భోగానుభవానికి జీవితాన్ని వెచ్చిస్తాం. తద్వారా మన ఇంద్రియశక్తులు, మానసికశక్తులు క్షీణిస్తాయి. ఇక ఆ తదుపరి ఏ సాధన చేయగలం! పట్టుమని అయిదు నిమిషాలు ధ్యానం చేద్దామంటే
కీళ్లూ, కాళ్లు నొప్పులతో కూర్చోగలమా! ఏ గ్రంథాన్ని చదివినా అవగాహన చేసుకోగలమా! ధారణలో ఉంచుకోగలమా! ఏ ధర్మాన్నైనా అమలు పరచగలమా!

ఆత్మజ్ఞానపూర్వకమైన కర్మాచరణమే అసలైన జీవితం. ఈ సత్యాన్ని గమనించని వ్యక్తికి జీవితం చివరి అంచుకి చేరుకున్నా శాంతి లభించదు.

దేహమే శాశ్వతమనుకొని, ఇంద్రియాలను తృప్తి పరుస్తూ కాలం గడిపేవారికి సత్యం, ధర్మం లాంటి మాటలు కూడా రుచించవు. 'ఆత్మ' వైపు దృష్టి మరల్చి సాధన చేసేవానికి, దానికోసం శక్తిని వినియోగించే వానికి అనంతమైన ఆత్మశక్తి జాగృతమవుతుంది. ఆ చైతన్యంతో జీవితం పటిష్టమై చక్కని ఆయువుని, శాంతికరమైన తృప్తికరమైన అనుభూతిని పొందగలుగుతుంది.

మానసిక దౌర్బల్యం కూడా అధ్యాత్మవిద్యకు అవరోధం. అందుకే శ్రీకృష్ణపరమాత్మ 'క్షుద్రం హృదయ దౌర్బల్యం' అని హెచ్చరించాడు. బాహ్యమైన ఏ పరివర్తనమూ
మన హృదయాన్ని చలింపనివ్వని స్థితికి తెచ్చే యోగసాధనను మన ప్రాచీనులు ఆవిష్కరించారు. తద్వారా బుద్ధీంద్రియాలు పటుత్వాన్ని సాధించడం ప్రథమ ప్రయోజనమై, క్రమంగా ఆత్మతత్త్వాన్ని ఆవిష్కరించుకోవడం ప్రధానసిద్ధిగా ఒక చక్కని క్రమాన్ని ఏర్పరచారు. ఈ పద్ధతిని జీవితవిధానంగా మలచుకున్న మన సనాతనధర్మం,
క్రమంగా భోగలాలసనే పరమార్థమనుకునే ఆలోచనా విధానంలో చిక్కుకుని ఆత్మశక్తుల్ని నిద్రాణం చేసుకుంటోంది.

దంతంబుల్ పడనప్పుడే, తనువునన్ ఆరూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన జరింపనప్పుడే కురుల్వెల్వెల్ల కానప్పుడే
చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా! (ధూర్జటి)

అని ఆధ్యాత్మికసాధనకు శారీరకబలం ఉన్న స్థితిలోనే పూనుకోవాలని బహుపరాకులు పలికారు. నచికేతుడు, శుకుడు, ప్రహ్లాదాదులు ఇందుకు ఉదాహరణలు. అసలు
నిగ్రహ సంపన్నమైన యోగశక్తితో శుష్కత్వమూ, క్షీణత్వమూ లేని శక్తిమంతమైన వార్ధక్యాన్ని గడిపి పూర్ణాయుష్షును సాధించారు మన పూర్వీకులు. వారు వార్ధక్యాన్ని
ఒక జీవిత చరమావస్థగా పేర్కొన్నారు. వార్ధక్యం అంటే క్షీణత్వమూ, జర - కాదు.అది వయోవస్థ మాత్రమే కావాలి. అంతేకానీ రోగగ్రస్తమైన అనుభవస్థితి కారాదు.దానికి బాల్యం నుండే సక్రమ నిగ్రహ యోగజీవన విధానం కావాలి. అది దేహబుద్ధులను పటిష్టం చేస్తుంది. తద్వారా ఆత్మస్వరూపాన్ని అవగాహన
చేసుకొనేందుకు అవసరమైన ధారణ, ప్రజ్ఞ, తపస్సు మొదలైనవి నిరాఘాటంగా సాగుతాయి.

☘️ ఆత్మజ్ఞానమనేది జీవితానికి అతీతమైన విషయం కాదు. జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడమే ఆత్మజ్ఞానం. అది కలిగిన జీవితమే అసలైన శాంతిని సాధించగలదు.☘️

ఆ దిశగా మానవుని మేధను నడిపి సార్థకమైన జీవితాన్ని సాధించే విధంగా మలచిన మన సనాతన జీవనవిధానాన్ని చాటిచెప్పవలసిన తరుణం ఇది.      

No comments:

Post a Comment