Friday, December 20, 2024

 *🌹4వ అధ్యాయము🌹*

*జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము*

*నాలుగవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, తను ఉపదేశించే ఈ జ్ఞానంపై, దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియచేయటం ద్వారా, అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పానని, ఆ తరువాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడింది అని కృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును, తన ప్రియ మిత్రుడు, భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తన కళ్ళెదురుగా ఉన్న శ్రీ కృష్ణుడు, ఎన్నో యుగాల క్రితం సూర్య భగవానునికి ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా, శ్రీ కృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు.* 

*భగవంతుడు సనాతనుడు, పుట్టుకలేని వాడు అయినా, తన యోగమాయా శక్తిచే, ధర్మాన్ని పరిరక్షించటానికి, ఈ భూలోకం లోకి దిగివస్తాడని చెప్తాడు. కానీ, ఆయన జన్మ, కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కళంకితం కావు. ఈ రహస్యం తెలిసినవారు, దృఢవిశ్వాసంతో భక్తిలో నిమగ్నమౌతారు, మరియు ఆయనను పొందిన తరువాత, ఈ లోకంలో తిరిగి జన్మనెత్తరు. తదుపరి, ఈ అధ్యాయం, కర్మల స్వభావాన్ని విశదీకరిస్తుంది మరియు - కర్మ, అకర్మ, మరియు వికర్మ అనబడే మూడు సూత్రాలను వివరిస్తుంది. ఏంతో నిమగ్నమైన పనులలో ఉన్నా, కర్మ యోగులు,  ఏవిధంగా అకర్మ స్థితిలో ఉంటారో, తద్వారా ఎలా కర్మ బంధాలలో చిక్కుకోరో ఇది వివరిస్తుంది. ఈ విజ్ఞానంతో ప్రాచీన మునులు - జయాపజయాలతో సంబంధం లేకుండా, సుఖ-దుఃఖాలను ఒకేలాగ పరిగణిస్తూ, కేవలం ఒక యజ్ఞం లాగా భగవంతుని ప్రీతి కోసం తమ పనులను/కర్మలను ఆచరించేవారు.* 

*యజ్ఞం అనేది అనేక రకాలుగా ఉంటుంది, అందులో చాలా రకాలు ఇక్కడ చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణచేయబడ్డప్పుడు దాని అవశేషం అమృతంలా అవుతుంది. అలాంటి అమృతం స్వీకరించినప్పుడు, కర్తలు మలిన శుద్ధి చేయబడుతారు. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరైన దృక్పథంతో, సరైన జ్ఞానంతో చెయ్యబడాలి. ఈ జ్ఞానమనే నావ సహాయంతో ఘోర పాపాత్ములు కూడా లౌకిక దుఃఖ సాగరాన్ని దాటవచ్చు. పరమ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా, ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అర్జునుడి గురువుగా, అతన్ని జ్ఞానమనే ఖడ్గం తీసుకుని తన హృదయంలో జనించిన సందేహాలని ముక్కలుగా ఖండించి, లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమంటున్నాడు, శ్రీ కృష్ణుడు.*

*🌺||కృష్ణం వందే జగద్గురుమ్||🌺*
🌸🌹🌸 🙏🕉️🙏 🌸🌹🌸

No comments:

Post a Comment