Vedantha panchadasi:
ఏతస్య వా అక్షరస్య ప్రశాసన ఇతి శ్రుతిః ౹
అన్తః ప్రవిష్టః శాస్తాయం జనానా మితి చ శ్రుతిః ౹౹181౹౹
181. అక్షరుడగు ఈశ్వరుని శాసనముచే సూర్యుడు గ్రహములు సంచరించునని ఒక శ్రుతి చెప్పును. జనులు శరీరములందు ప్రవేశించి ఈశ్వరుడు వారిని శాసించునని మరొక శ్రుతియనును.
బృహదారణ్యక ఉప:3.8.9
తైత్తిరీయ ఆరణ్యకము 3.11.
జగద్యోనిర్భవేదేష ప్రభవాప్యయకృత్త్వతః ౹
ఆవిర్భావ తిరోభావా వుత్పత్తిప్రలయౌ మతౌ ౹౹182౹౹
182. జగత్తును సృష్టించి లయింపజేయును గనుక ఈశ్వరుడు జగత్కారణుడు అనబడుచున్నాడు.
ఆవిర్భావమే సృష్టి, తిరోభావమే (కనిపించక పోవుట)ప్రళయము.
మాండూక్య ఉప.6;
నృసింహ ఉత్తరతాపనీయ ఉప.1;
నృసింహ పూర్వతాపనీయ
ఉప.4.1;
శ్వేతాశ్వర ఉప.5.5, 5.1 వ్యాఖ్య:- జగత్ర్పళయ సమయమున,ఇపుడు స్పష్టముగా కనిపించిన ఈ ప్రపంచము ఎక్కడకు పోవును?
గొడ్రాలి కొడుకు ఎక్కడ నుండి వచ్చును,ఎక్కడికి పోవును?
గొడ్రాలి కొడుకునకు ఎప్పుడును అస్తిత్వము లేదు.అదే విధముగా ఈ ప్రపంచమునకు ప్రపంచముగా ఎప్పుడును అస్తిత్వము లేదు.
ప్రపంచపు ఉనికి సత్యమని భావించుట వలననే ఈ సామ్యము కలవర పెట్టును.
దీనిని ఆలో చింపుము,
బంగారు కంకణమునందు కంకణత్వమున్నదా,అది కేవలము బంగారము కాదా?
శూన్యత్వముతో సంబంధము లేకుండా ఆకాశమనబడు విషయమున్నదా?
అదే విధముగా అఖండమయిన బ్రహ్మముతో సంబంధము లేకుండా ప్రపంచమను"వస్తువు"లేదు.
చల్లదనము మంచుగడ్డనుండి విడదీయరానిదిగా ఉన్నట్లే ప్రపంచమనబడునది కూడ బ్రహ్మమునుండి విడదీయరానిదే.
ఎండమావిలోని నీరు పుట్టదు,నశింపదు.అట్లే ఈ ప్రపంచము అఖండతత్త్వము నుండి వెలువడలేదు,ఇది ఎక్కడకు పోవుట లేదు.
పూర్ణము(అనంతము)నుండి పూర్ణము ఆవిర్భవించును,అదియు పూర్ణముగానే ఉండును.కావున విశ్వము గూడ ఆ అనంతము వంటిదే.
మనస్సునుండి ఆలోచనలను ఇంధనమును ఉపసంహరించుట వలన వ్యక్తి భావన నశించినపుడు ఉన్నదే అనంతము.
నిద్ర కానీ జడము కానీ కానిది అనంతము.
పూర్వజగత్ర్పళయము జరిగినపుడు,పూర్వమున్నట్లు అగుపించినదంతయు అదృశ్యమయినది.అపుడు
"అనంతము"మాత్రమే ఉన్నది,
అది శూన్యత్వముగానీ రూపముగానీ కాదు.దృష్టిగానీ దృశ్యముగానీ కాదు,అది ఉన్నదనిగానీ లేదనిగానీ ఎవ్వడును చెప్పజాలకపోయెను.
దానికి చెవులుగానీ,కనులుగానీ, నాలుకగానీ లేవు.అయినను అది వినును,చూచును,తినును.దానికి కారణము లేదు.
ప్రజ్ఞా(ఆలోచనా)రహితదశలో అనంతము వలన జ్ఞానము,జ్ఞాత,జ్ఞేయము ఏకముగా నుండును.
స్రష్ట లేడు,అయినను తరంగములకు జలము కారణమయినట్లే అది ప్రతి విషయమునకును కారణము.
ఈ అనంతమయిన
"శాశ్వత జ్యోతి" అందరి హృదయములో నున్నది.
ఆవిర్భావయతి స్వస్మిన్విలీనం సకలం జగత్ ౹
ప్రాణికర్మవశాదేష పటో యద్వత్ర్పసారితః ౹౹183౹౹
183. సకలజగత్తు ఈశ్వరుని యందు వాసనారూపమున లీనమై ఉండును.దానినే ఈశ్వరుడు ఆయా ప్రాణుల పూర్వకర్మను అనుసరించి సృష్టించును,అనగా వ్యక్తమగునట్లు చేయును.సృష్టి అనగా చుట్టియుంచిన పటమున విప్పి చూపినట్లే.
పునస్తిరోభావయతి స్వాత్మన్యేవాఖిలం జగత్ ౹
ప్రాణికర్మక్షయవశా త్సంకోచిత
పటో యథా ౹౹184౹౹
184. ప్రాణుల కర్మ అంతా తీరిన పిదప మరల ఈ అఖిల విశ్వమును తనయందే లీనము చేసికొనును.ప్రళయమనగా విప్పియుంచిన పటమును మరల చుట్ట చుట్టినట్లే.
రాత్రిఘస్రౌ సుప్తిబోధావున్నీలన నిమీలనే ౹
తూష్ణీంభావమనోరాజ్యే ఇవ సృష్టిలయావిమౌ ౹౹185౹౹
185. జగత్తు యొక్క సృష్టి ప్రళయములను
పగలు,రాత్రులతోను జాగృతి,సుషుప్తులతోను
కన్నులు తెరచుట, మూసికొనుటల తోను
మనస్సు ఊహా ప్రపంచములను కల్పించుట,
నిశ్చలముగ ఉండుట లతోను పోల్చవచ్చును.
వ్యాఖ్య:- ఆ ప్రజాపతి ఈ సమస్త జగత్తును సృజించి రక్షించెను.
ఎట్లనగా,నా చేత సృజింపబడిన ఈ జగత్తు నాకు వేరుకానిదగుట వలన నేనే అగుచున్నాను.ఈ ప్రకారము ప్రజాపతి జగత్తు తానెనని చెప్పెను.అందు వలననే సృష్టి జరుగుచున్నది.
ఈ శరీర భేదజాతమంతయు శరీరోత్పత్తికంటె పూర్వము ఆత్మ స్వరూపముగానే ఉండెను.
సకల జగత్తు ఆ ప్రజాపతి యందు వాసనారూపమున లీనమై ఉండి ఆయా ప్రాణుల పూర్వకర్మను అనుసరించి సృష్టించును,అనగా వ్యక్తమగునట్లు చేయును.
అగ్నీష్టోమాత్మకమయిన జగత్తును ఆత్మస్వరూపముగా జూచువాడు ఏదోషమును అంటక ప్రజాపతి స్వరూపుడగుచున్నాడు.
ఈ సృష్టి అతిశయమైనది.అట్టి అతిశయమగు ప్రజాపతి యొక్క సృష్టిని ఆత్మ స్వరూపమైన దానినిగా తెలిసికొనువాడు ఆ ప్రజాపతి సంబంధమైన సమస్త సృష్టి యందు ప్రజాపతి వలెనే సృష్టికర్త యగుచున్నాడు.
సాలెపురుగు దేహమునుండి తంతువులు బయటకు వచ్చి మరలా లోపలికి తీసుకొను విధముగానే, ప్రాణుల కర్మ అంతా తీరిన పిదప మరల ఈ అఖిల విశ్వమును ఆ పరమాత్మలోనే లీనము చేసికొనును.
సృష్టి అనగా చూట్టియుంచిన పటమును విప్పి చూపినట్లే, ప్రళయమనగా విప్పియుంచిన పటమును మరల చుట్ట చుట్టినట్లే.
బ్రహ్మవేత్తకాని పురుషుడు, ఉపాసన చేయబడెడి యీ దైవము
ఉపాసించెడి నాకంటె వేరుగా నున్నానని భావించును.అట్టి వాడు పరబ్రహ్మ తత్త్వమును తెలిసికొనలేడు.
జ్ఞానియైన పురుషుడు ఈ వర్తమాన కాలము నందు
సర్వస్వ రూపముగా ఆపరమాత్మ స్వరూపమునే చూచుచు నేను మనువు నయితిని, సూర్యుడనయితిని అని భావించి సర్వస్వరూపమును పొందెను.
అతడు సమస్తమును అగుచున్నాడు.ఆ పరబ్రహ్మవేత్త దేవతలకును ఆత్మస్వరూపముగా అగుచున్నాడు.
ఈ సృష్టి,ప్రళయములను జ్ఞాని,అజ్ఞానులతో పోల్చవచ్చును.
ఇంకను పగలు రాత్రులతోను,
జాగృతి సుషుప్తులతోను,
కన్నులు తెరుచుట మూసికొనుటలతోను,
మనస్సు ఊహా ప్రపంచములను కల్పించుట నిల్చలముగ ఉండుట లతో పోల్చవచ్చును.
ఆ పరమాత్మ సర్వదా జ్ఞానఖర్మల విధి ప్రకారము సృజించుట వలన సమస్తమున ఆ పురుషుడే దేవాత్మ భావము పొంది సర్వ దేవతా స్వరూపుడగు చున్నాడు. మోక్షమును పొందుచున్నాడు.
అట్టి పురుషుడు
సర్వదాముక్తుడై పరమాత్మగానే ప్రకాశించుచున్నాడు.
No comments:
Post a Comment