Wednesday, December 25, 2024

 *విచారణ - శరణాగతి*
______

మనిషికి యెన్నటికీ వదలని అయోమయం ఒకటి ఉన్నది.

మనిషి జీవితాన్ని శాసించి నడిపేది-
1.విధియా?(అతీతశక్తియా?)
లేక
2.మతియా?(పురుషప్రయత్నమా?)
అనేది.

* * *

విధి-మతి రెండూ "రెండు పొట్టేళ్ల పోరాటం లాంటిది" అన్నది యోగవాశిష్ఠము.

బలమైనది గెలుస్తుంది...
బలహీనమైనది పడిపోతుంది...

విధికి తలవంచితే జీవితంలో ఓటమి తప్పదు.

విధి అనేది గతంలో తాను చేసిన పురుషప్రయత్నం యొక్క ఫలితమే.

కాబట్టి విధిని జయించడానికి పురుషప్రయత్నం తప్పనిసరి అని వాదించేవాళ్లు కర్మయోగులు అయినారు.
ఉదా. బుద్ధుడు, గాంధీ...

* * *

ఆ విధిని భగవంతుని శక్తిగా గ్రహించి, 
పురుషప్రయత్నం కూడా ఆ విధి ఆడించే నాటకంలో భాగమేనని, 
జరిగేది  జరుగుతుంది, జరగనిది జరగదు అని,
ఈ జగన్నాటకానికి కర్త ఈశ్వరుడని,  
వానికి శరణుజొచ్చి, 
మౌనంగా(కర్తృత్వభావన లేకుండా)ఉంటూ 
అన్నిటికీ సిద్ధపడి ఉండే వాళ్లు జ్ఞానయోగులు అయినారు.
ఉదా.రమణులు, సద్గురు సుబ్రహ్మణ్యులు...

* * *

పరిపూర్ణంగా పురుషప్రయత్నం(ఆత్మవిచారణ) చేసినా

పరిపూర్ణంగా దైవానికి శరణాగతి చెందినా

ఫలితం ఒక్కటే...."ఉండేది ఒక్కటే" అని తెలియడం.

* * *

ఘర్షణ యెప్పుడు వస్తోందంటే, 

కొన్నిటికి పురుషప్రయత్నం అని, 
కొన్నిటికి దైవసంకల్పం అని అనటం మూలాన.

'జరిగితే నా మాయ, జరక్కపోతే దేవుని మాయ' అన్నరీతిన ఉండడం వలన.

రెండు పడవలలో కాళ్లు పెట్టి ప్రయాణం చేయడం వలన.

* * *

పరిపూర్ణమైన పురుషప్రయత్నంతో బుద్ధుడు నిర్వాణపదం చేరాడు.

"అప్పా! నీ ఆజ్ఞ మేరకు వచ్చాను...." అని అరుణాచలేశ్వరునికి  పరిపూర్ణంగా శరణాగతి చెంది రమణుడు పరమపదం చేరాడు.

* * *

విధిమతుల మూలవివేకం లేనివారే వాదించుకుంటూ ఉంటారు...

రెంటికీ ఏకమూలమైన ఆత్మను చేరుకున్నవారికి అవి తొలగిపోతాయి. తరువాత ఏ వాదమూ ఉండదు.

* * *

బట్టను గమనిస్తారేగాని, మూలపదార్థమైన ప్రత్తిని గమనించరు

సినిమాలో లీనమౌతారేగాని, బొమ్మల వెనుక తెరను గమనించరు.

పుస్తకంలో ఉన్న అక్షరాలపై ధ్యాసేగాని, అక్షరాలకు ఆధారంగా ఉన్న తెల్లకాగితాన్ని గమనించరు.

రూపాలను, వస్తువులను చూస్తాడేగాని
దాని వెనుక ఉన్న చైతన్యాన్ని గమనించరు.

* * * 

తాను వ్యక్తిగా ఉన్నంతవరకు, తాను వ్యష్టిభావంలో ఉన్నంతవరకు ఈ విధి-మతుల వివాదం ఉండనే ఉంటుంది.

వ్యక్తిత్వనష్టి రెండువిధాలుగా జరుగుతుంది-

1. నేను యొక్క మూలానికెళ్లడం.
2.దైవానికి శరణాగతి చెందడం

ఈ రెండింటిలో ఏదో ఒక మార్గంలోకెళ్లి భగవంతుణ్ణి దర్శించాలి.

భగవంతుణ్ణి దర్శించిన తర్వాత వ్యక్తిత్వం నిలుపుకోవడం అసాధ్యం.

ద్రష్టా, దృశ్యమూ ఏకమై, 'సత్' అవుతారు.

గ్రహించేవాడు, గ్రహింపు, గ్రహించబడేది ఇవేవీ విడివిడిగా ఉండవు.

అన్నీ ఏకమై పరమశివుడే అవుతారు.

* * *
తాను సకలాన్ని చూస్తున్నాడు.
కానీ చూసే తనను చూడలేకున్నాడు.
తనను చూడడమే దైవాన్ని చూడడం.

అంతేగాని తనకు వెలిగా ఏదో రూపంలో కనబడేది కాదు దైవదర్శనం అంటే.

తనకు వెలిగా కనబడే ఎంత గొప్ప దృశ్యమైనా, దేవుడైనా అదంతా నీ మానసిక దర్శనమే.

అంటే స్వప్నంలో తోచే రూపాల్లాంటివే.

స్వప్నప్రపంచం నీ మనో వైచిత్ర్యమే కదా!

అలాంటిదే ఈ మెలకువలో కనబడే యావత్తు దృశ్యం కూడా.

చూచేవానికన్నా 'దైవం' మరొకరు లేరు.
చూడబడేదానికన్నా 'మాయ' మరొకటి లేదు.
అంటారు గురుదేవులు.

ఈ ఒక్కమాట గుర్తులో ఉంచుకుంటే....
నిన్ను ఏ దృశ్యమూ ఇబ్బంది పెట్టదు.
(నీ తనువు కూడా దృశ్యంలో భాగమే)

ఈ తనువు నీవు కాదు, ఈ తనువు అనేది దృశ్యంలో నీకు అతి దగ్గరగా ఉన్న ఓ భాగం మాత్రమే.

రైలులో తనతో చాలా మంది ప్రయాణిస్తుంటారు.
కానీ తన ప్రక్కనే కూర్చొని ఉన్న తోటి ప్రయాణికునితోనే పరిచయం పెంచుకుంటాం. అతని స్టేషన్ రాగానే దిగివెళ్లిపోయేటప్పుడు బాధపడతాం.

అలాంటి పరిచయమే తనకు తన తనువుతో ఉండేది.
ఉన్నంతకాలం ఉండి, దాని సమయం  రాగానే అది తనను విడిచిపెట్టేస్తుంది. 

కానీ 'తాను' సదా ఉంటాడు.

ఆ సదా ఉన్న 'ద్రష్ట' యే 'నేను'(దైవం).

దైవం లేక తానూ(వ్యక్తి) లేడు, జగత్తూ లేదు.

ఆ ద్రష్టలో నుంచి ప్రసరించే దృశ్యమంతా(ప్రపంచమంతా) మాయ.

కాబట్టి అహమిక మూలానికెళ్లి హృదయపీఠంపై నిలిస్తే   ఆత్మసామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తివి నీవే అవుతావు.        

No comments:

Post a Comment