*Vedantha panchadasi* ఆవిర్భావ తిరోభావ శక్తిమత్త్వేన హేతునా ౹
ఆరంభ పరిణామాది చోద్యానాం నాత్ర సంభవః ౹౹186౹౹
186. ఈశ్వరుడు ప్రత్యక్షము అంతర్థానము చేయు మాయాశక్తి గలవాడు.ఈ కారణము చేత
"సృష్టి ప్రారంభమైనది,
సృష్టి పరిణమించినది"మొదలైన వాదములు ఇచ్చట సంభవములు కావు.
వ్యాఖ్య:- సృష్టివాదములు మూడు విధములు.నైయాయికుల ఆరంభవాదమున పరమాణువుల కలయికలతో సృష్టి ఆరంభమగును.
సాంఖ్యుల పరిణామవాదమున అవ్యక్తమైన ప్రకృతి పరిణామము నొందుచు ఈ వ్యక్తమైన జగత్తు నేర్పడును.
ఈ రెండూ జగత్తు వాస్తవమని స్వీకరించును.
వేదాంతుల వివర్తవాదమున సృష్టి అనునది అవ్యక్తమగు బ్రహ్మముపై భ్రమాత్మకమగు ఒక ఆరోపము మాత్రమే.
ఈశ్వరునుకి ప్రారంభము లేదు, ఈశ్వరుడు అద్వితీయుడై అభిన్నుడై ఉండుట వలన.
రెండు వేరు వేరు వస్తువులు కలిసిన కదా ఆరంభము!
ఈశ్వరుడు పరిణామి కాడు,
అవయవములు లేకపోవుట వలన,
భాగముల వృద్ధిక్షయాదుల వలన కదా పరిణామ మను వికారము సంభవము!
కనుక వాస్తవముగ ఏ వికారమూ లేక,వికారమున్నట్లు కన్పించే వివర్తముననే ఈశ్వరుడు ఉండును.
అచేతనానాం హేతుః స్యాజ్జాడ్యాంశేనేశ్వరస్తథా ౹
చిదాభాసాంశతస్త్వేష జీవానాం కారణం భవేత్ ౹౹187౹౹
187. మాయయందలి తమస్సు ద్వారా ఈశ్వరుడు అచేతన వస్తువులకు కారణమగుచున్నాడు.చైతన్య ప్రతిఫలనము ద్వారా జీవులకు ఈశ్వరుడు కారణమగుచున్నాడు.
తమః ప్రధానః క్షేత్రాణాం చిత్ర్పధానశ్చిదాత్మనామ్ ౹
పరః కారణతామేతి భావనా జ్ఞాన కర్మభిః ౹౹188౹౹
188. కాని,పరమాత్మయే తన తమః ప్రధానమైన అంశముచే శరీరములకూ,చిత్ర్పధానమైన అంశముచే జీవులకూ కారణము. ఆయా సంస్కారములు జ్ఞానము కర్మలను అనుసరించి ఆయా శరీరములు జీవులు పరమాత్మ నుండే ఏర్పడును. వ్యాఖ్య:- శుద్ధ బ్రహ్మము అసంగము,అక్రియము.అది సృష్టి చేయదు.అది చతుష్పాత్తు అనగా పరిపూర్ణము.అందువలన మాయా విష్టుడయిన ఈశ్వరుడు అవసరం. ఆయనయే జగత్కర్త.
మాయ శుద్ధ చైతన్యము నాశ్రయించిన పాదమాత్ర ప్రమాణమయినది.
శుద్ధ చైతన్యము జీవ-ఈశ్వర భేదము లేనిది.
మాయ - అనాది.దీని ప్రభావము వలననే జీవ-ఈశ్వర భేదం సిద్ధించింది.
పురుష సూక్తంలో కూడా,ఈ ప్రపంచంలో ఉన్నదంతా పురుషుడు మాత్రమేననీ రెండవదేదీ లేదనీ స్పష్టంగా వ్రాయబడింది.
పురుషసూక్తంలో భగవంతుని విశ్వరూపం కవిత్వ ధోరణిలో వివరింపబడినది.ఈ సూక్తం ఋగ్వేదంలో ఉంది.
"సర్వం పురుష ఏవ"-
"పురుష ఏవ ఇదం సర్వం"-
ఉన్నదంతా పురుషుడే.ఈ సర్వమూ పురుషుడే అయి వున్నాడు---అని పురుషసూక్తం నిశ్చయంగా చెప్తోంది.
వేదాలలోని ఉపనిషద్ విభాగంలో మాత్రమే కాక,కర్మకాండ విభాగంలో కూడా ఉన్నదంతా పరమాత్మ మహిమేననీ ఆయన మాత్రమే ఉన్నాడనీ నిర్దేశించే స్తుతులను కర్మకాండ ననుసరించే వారందరూ విధిగా నేర్చుకోవాలి.
వ్యక్తమయ్యే ప్రతి విషయమూ, అవ్యక్తమూ,చరాచరములూ, ప్రాణులూ,జడములూ,
పరిమితము,అపరిమితమ,నాశనమయ్యేవీ,నాశనము లేనివీ అన్నీకూడా పురుషుడు మాత్రమే.
ఆ పరమాయ్మయే తన తమః ప్రధానమైన అంశముచే శరీరములకు,
చిత్ర్పధానమైన అంశముచే జీవలకూ కారణభూతుడవుచున్నాడు.
ఆయా సంస్కారములు జ్ఞానము కర్మలను అనుసరించి ఆయా శరీరములు జీవులు పరమాత్మ నుండే ఏర్పడును.
అఖండబ్రహ్మము మాత్రమే ఉన్నదను సత్యమును మరచి అసత్యము,అస్తిత్వరహితమునగు అజ్ఞానమున్నదని దృఢముగా నమ్ముట గొప్ప ఆశ్చర్యము కాదా?
అజ్ఞానమువలననే ఎండమావివంటి భ్రమలుండును.
ద్వైతదర్శనమునకు
ఏకైకమూలమగు
మానసిక పరిమితి(అజ్ఞానము)ని పరిత్యజించి సంపూర్ణముగా అపరిమితుడుగా ఉండవలయును.
జ్ఞానదృష్టికి అపరిచ్ఛిన్నచైతన్యమే ఉండునుగానీ వేరేదియు ఉండదు.
"అజ్ఞానివి కావద్దు"
"జ్ఞానివికమ్ము"
No comments:
Post a Comment