Thursday, December 26, 2024

 *మీకు 55 దాటాయా? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయా!!* 
*(నేటి బుధవారం స్పెషల్ స్టోరీ)*
  ఇంకేం ఒకసారి 
శ్రీ. ప్రభాకర్ జైని గారి సర్దుకున్నారా చదవండి. 
ఎక్కడ చదవాలీ? అనే కదా!! గూగుల్ కొట్టండమ్మా దొరికిపోతుంది...

       కిచెన్? ఒక్కసారి చూడండి. ఎన్ని ఎక్స్ట్రా గిన్నెలు, డబ్బాలు, కంచాలు, క్యారేజులు, క్యాన్లు, ఇత్తడివి, రాగివి, కంచువి, దేముడి సామాన్లు, ప్లాస్టిక్, గాజు, టప్పర్వేర్, ఇంకో వేర్, ఆ వేర్, ఈ వేర్. 

   పిల్లల పెళ్ళిళ్ళకీ, వ్రతాలు, నోములకీ, ఆఖరికి మనవల బాలసారె, అన్నప్రాసనల ఇరవై, ముఫైమందికి కూడా బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ క్యాటరింగ్. 
మంచినీళ్ళు, నెయ్యి, తినే విస్తరి, తాగేందుకు ప్లాస్టిక్ గాజులూ అన్నీ ఆ ప్యాకేజ్ లోనే. మరి మనకి అన్ని కంచాలు ఎందుకుటా? మిగిలినవి ఫుడ్ తీసుకోవడానికి మన దగ్గర రెగ్యులర్ గా వాడే బొచ్చెలు బోలెడు. 

  ఒకసారి , నిచ్చెన వేసుకుని పైన ర్యాక్ లో ఉన్న సామాన్లు దింపండి. ఏం చేస్తారండీ ఆ ఇత్తడి సామాను? మనం పోతే, ఒక్కసారి ఊహించుకోండి. అవన్నీ ఓ కూలివాడికిచ్చి దింపించి, పట్టుకుపోండి ఎవరికి కావాల్సినవి వాళ్ళు అంటారు మన పిల్లలు. అంతేనా!! లేదంటే వాళ్ళింటికి తీసుకువెళతారంటారా? వాళ్ళిల్లు ఏమైనా ఖాళీ గా ఉంటుందంటారా? 

 వాళ్ళ విసుగు, చిరాకు చూపులు ఓ సారి ఊహించుకోండి. "ఇవన్నీ దాచుకుంది, వెళ్ళేటప్పుడు పట్టుకెళదామనుకుందేమో " అని ఒక ఇల్లాలు గొణుక్కుంటోందేమో కదా!! ఔనా? 

  అంతకన్నా, కాస్త ఫైనాన్షియల్ గా ఉన్నవాళ్ళు ఏదో ఒక అనాధ శరణాలయం కి గానీ, గుడికి కానీ ఇచ్చేయండి.

     అక్కడ ఎవడు తినేస్తాడో, అసలు వాళ్ళకి అందుతుందో లేదో, ఇవన్నీ ఆలోచించకండి!! మీరు ఒక అనాధ శరణాలయానికి ఇచ్చేసారు. అక్కడితో మీ పనయిపోయింది. అంతే అనుకుని ప్రశాంతంగా ఉండండి. ఆ చెత్త ఆలోచించే బదులు 'నామజపం' చేసుకోండి.అంతే కానీ కాంప్లికేట్ చేసుకోకండి. 

  అలాగే ,మధ్య తరగతి వారయితే, అమ్మేయండి. ఆ డబ్బులు ఉంచుకోండి. "ఛారిటీ బిగెన్స్ ఎట్ హోమ్." మన బిల్డింగ్ లోకి వచ్చే పనిమనుషులకి  ,హౌస్ కీపింగ్, వాచ్మాన్, సెక్యూరిటీ ఇలా అందరికీ పంచేయండి. మినిమమ్ వస్తువులు ఉంచుకోండి. 

      దేముడి మందిరం తెగ నింపేయకండి. దేముళ్ళని కూడా తీసుకువెళ్ళకుండా ఆ కొడుకు అమ్మి పారేసాడు అన్న అపప్రధ మీ కొడుకుకి రానీయకండి. ఎందుకంటే ఆ కొడుకుకి మీరే ఆల్రెడీ దేముడిని ఇచ్చారు. ఇంకా "యాత్రలకి వెళ్ళినపుడు పాత్రలు తీసుకురావాలన్న" నానుడి  మీకు నచ్చింది కాబట్టి, మీరు పట్టుకొచ్చిన పాత్రలతో చాలా మంది మందిరాలని నింపేసారన్నది  కూడా ఓ సారి గుర్తు చేసుకోండి. 

    ఇక బీరువా, చీరలు,
 చీరలు అసలుఅసలు మీకు చీరలు ఎన్ని కావాలి? ఓ 30, పోనీ ఓ 50, అవి ఉంచుకోండి. పదేళ్ళ క్రితం కొన్న చీరలు తీసేయండి పట్టు తో సహా!! బీరువాలో ఉన్నా చీకిపోతాయి, పిగిలిపోతాయి.ఏం బాధ పడొద్దు త్వరలోనే మీ బీరువా నిండిపోతుంది. నాది ప్రామిస్. ఈ మధ్య చూసాను పెట్టీకోట్స్ ... తీసేయండమ్మా!! లోపలివే కదా అనీ మరీ అరిగించేయకండి.కొన్ని చీరలు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి మీ చుట్టాలలో పిలకాయలకే ఇచ్చేయండి. రిచీ రిచ్ అని గోల పెట్టేవారికి కాదు. ఎవరికి ఇవ్వాలో మీకు తెలుసు. 

 ఇక లాకర్, చిన్నా చితకా వాడని వెండి సామానూ, కాయిన్స్ తీసేసి ఓ వెండి కంచం గా కానీ, పూజ ప్లేట్ గా కానీ మార్చేయండి. పంచుకోవడం ఈజీ. లేదంటే గంధం గిన్ని 10 తులాలంటే, కుంకుమ భరిణె 10తులాల 10 మిల్లీ గ్రాములుందని కూడా గొడవలొస్తాయి. ఇక ఓ 4 రకాల  ముక్కు పుడకలు, ఓ పది రకాల చెవుల దిద్దులు , శ్రావణమాసం పిల్ల కాసులు వీటన్నిటినీ కూడా సర్దేయండి. 70 లు వచ్చాక ఒకే రకమైన చెవుల దిద్దులు , ముక్కుపుడకలు, మాటీలు, ఉంగరాలు అవీ మీకు నచ్చినట్లుగా చేయించుకుని పెట్టేసుకోండి. తీస్తూ ఉంటే ఎక్కడో శీల పడిపోయినా కూడా ఉండే సాధింపులు తగ్గుతాయి.

   ఇక, కప్ బోర్డ్స్... రిటర్న్ గిఫ్ట్ గా వచ్చిన రకరకాల సామాన్లు. ఉంచుకుని ఏం చేస్తారూ? అనాధాశ్రమాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలకి సారె గా ఇవ్వండి.కొంతమందికి ఎవరేనా మనకిచ్చినది ,తిరిగి ఇంకొకరికి ఇవ్వకూడదన్న కాన్సెప్ట్ అవసరమా?  ఆలోచించండి .

 షాల్స్, వాడని దుప్పట్లు ఒక పెద్ద బ్యాగ్ లో వేసుకుని కార్ లో పెట్టుకోండి. పేవ్మెంట్స్ మీద ఉన్నవారికి ఇచ్చేయండి. 

    తీసుకుంటారా, వాడతారా, ఏం చేస్తారు? అమ్మేసుకుంటారేమో, మనం ఇస్తాం కానీ వాళ్ళకి విశ్వాసం లేదూ ఇలాంటివన్నీ ఆలోచించకండి. ఇచ్చిన పుణ్యం కూడా పోతుంది. 

  తిరిగి ఏమీ ఆశించకుండా చేసిన దానాలకే పుణ్యం వస్తుంది.ఆశించి చేసేవి ఏవీ ఫలితాన్ని ఇవ్వవు. గుర్తుపెట్టుకోండి. 

  ఇల్లు, మనసు, బుర్రా కూడా  ఎంత ఖాళీ చేసుకుంటే అంత మంచిది. ఒకసారి ఆ హాయి ని అనుభవించి చూడండి. ప్రాణం, మనసు, ఒళ్ళు ఫ్రీ అయిపోయిన భావన అనుభవించాలే కానీ, ఎవరో చెబితే మాత్రం తెలీదు.

మీ పిల్లలకి కావాల్సిన వస్తువులే ఉంచండి. వారిని ఇబ్బంది పెట్టకండి. మన కోసం అప్పటికప్పుడు పరుగులు పెట్టుకుని వస్తారు. మనం ఇంకా ఉంటే , వాళ్ళ ఉద్యోగం, వేరే ఊర్లో ఉన్న భార్య/భర్త  ఉద్యోగం, పిల్లలు,చదువులుతో,మన ఆరోగ్యపరిస్థితి జాలి కన్నా బాధ్యత ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి కూడా అటువంటిదే మరి. వాళ్ళనీ ఏమీ అనుకోవడానికి లేదు. 

      బిజీ ఉరుకుల, పరుగుల జీవితాలు. మీ ఇన్స్యూరెన్స్ ఫైల్స్, హెల్త్ ఫైల్స్ అన్నీ జాగ్రత్త చేయండి. మందుల బాక్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ సర్ది ఉంచుకోండి. 

    ఇక పోయాక ,పిల్లలు వస్తే కనుక అయోమయం ,అంధకారం లో ఉంటారు పిల్లలు. అందరూ సలహాలు ఇచ్చేవారే!! ఏం చేయాలో తోచక బిక్కు బిక్కు మంటారు అందుకే, మీరే చెప్పి  ఉంచండి ఏం చేయాలో, ఎలా చేయాలో!! 

     ఆ పన్నెండురోజులూ అయ్యాక, వాళ్ళకి ఉద్యోగ హడావుడిలే!! అందుకే మీ సామాను ఈజీగా క్లియరాఫ్ చేసుకునే వీలు కల్పించండి. పిల్లలకి విసుగు తెప్పించకండి. అఖర్లేని సెంటిమెంట్లు పెట్టకండి.

      భాగస్వాముల్లో  ఒకరు పోతే ఇంకొకరు ఎప్పుడూ లేని ఎమోషన్స్ చూపి విసిగిస్తారు. మనిషే శాశ్వతం కాకపోయిన తర్వాత, ఇంక దేనికి విలువ ఇవ్వాలో మీరే విజ్ఞత గా నిర్ణయం చేయండి. 

     ఫొటోలు కూడా మీరు అలా వెళ్ళగానే, ఇలా డస్ట్బిన్ లోకి వెళతాయి. వాళ్ళేం చేసుకుంటారు? ఇంటి ఓనర్స్ గడియారం, క్యేలెండర్ కోసం కూడా మేకు కొట్టవద్దనే రోజుల్లో ఉన్నాం అని గుర్తుపెట్టుకోండి. 

    మీ అభిలాషలన్నీ మీ పిల్లల మీద రుద్దకండి. 

మరో ముఖ్యమైన మాట. మీరు ఆడపిల్లలకి ఇవ్వాలనుకున్నవి మీ చేతులమీదుగానే ఇచ్చేసుకోండి. వాళ్ళు అన్నదమ్ములని అడిగి, వాళ్ళు ఇవ్వక, పిల్లలు బయటపడి ,కొట్టుకుని, తిట్టుకునే వరకూ విషయం రచ్చకెక్కించకండి. మీ సంపాదన మీ ఇష్టం అది స్పష్టంగా కోడళ్ళకి/ అల్లుళ్ళకీ తెలియచెప్పండి. అఖర్లేని మొహమాటాలు పెట్టుకోకండి.

    సర్దడం మొదలుపెట్టండి ఈ రోజునుండే !! చాలా టైముంది అని మాత్రం అనుకోకండి. ఉందా? హాయిగా ఫ్రీ బర్డ్ లా ఉండండి. జీవితాన్ని మీకు నచ్చినట్లు ఎంజాయ్  చేయండి.ఇప్పటివరకూ పట్టుక్కూర్చున్న బాధ్యతలను వదిలేయండి. కాస్త కఠినంగానే ఉండండి. ఏం ఫర్వాలేదు. రోజు రోజూ , పూట పూటా ఎంజాయ్ చేయండి. 

 హ్యాపీగా ప్రయాణానికి సిద్ధం కండి. మంచి మంచి అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. మనసా వాచా హృదయం లోంచి ఒక మంచి మాట  మాట్లాడండి. కోపాలు, తాపాలు పూర్తిగా మర్చిపోండి. అది వాళ్ళ సంస్కారం అనుకోండి. చిన్నవాళ్ళని పైకి రావాలని మనసారా దీవించండి తప్పితే దెప్పకండి. 

    మీరు వెళ్ళిపోయాక కూడా  , మిమ్మల్ని కనీసం ఒకరో, ఇద్దరో ఆదర్శంగా తీసుకోవాలని, మీ మరణానంతరం ఇల్లు గొడవలతో, చికాకులతో కాకుండా ప్రశాంతంగా ఉండేలా చేసే బాధ్యత కూడా మీదే సుమీ !!

  లాస్ట్ బట్ నాట్ లీస్ట్ "నేత్రదానం" గురించి ఆలోచించండి. మీ వల్ల ఇద్దరు అంధులకి చూపు వస్తుంది.   

No comments:

Post a Comment