@ ఎంపిక @
Two roads
diverged in a wood,
and I—
I took the one
less traveled by,
And that
has made all the difference.
అంటాడు రాబిట్ ఫ్రాస్ట్
కళ్ళెదుట
రెండు దారులు
ఒకటే ....
ఎంచుకోగలను నేను
గుంపులు పయనించని దారిని ఎంచుకున్నాను
అదిగో ....
అదే మార్చింది జీవితం
******
ఎంపిక
అతి ప్రధానమైన సమస్య
ఆర్థిక శాస్త్రం లోనూ...
జీవ శాస్త్రంలోనూ కూడా
పరిసరాలలో
సర్దుబాటు చేసుకోగల జీవులనే
ఎంపిక చేసుకుంటుంది ప్రకృతి
బలమైనవీ తెలివైనవీ కూడా అంతరించిపోతాయి....
ద్రవ్యం పరిమితం ...
అవసరాలు అపరిమితం ....
అలాంటప్పుడు అత్యవసరమైన వాటినే
గుర్తించి ఎంపిక చేసుకోవాలంటుంది ఆర్థిక శాస్త్రం
మిగిలిన వాటిని వృథా ఖర్చుగానే పరిగణించమంటుంది
*********
ఇప్పుడు ...
ఈ చర్చ అంతా ఎందుకూ అంటే
విత్తం ...
పరిమితం.
జ్ఞానం అపరిమితం
కాలమూ బహు స్వల్పం.
చదవాల్సిందీ తెలుసుకోవాల్సిందీ అనంతం ...
కాబట్టి...
ఎంపిక ఒక కీలకమైన అంశం
చదువరికీ...
ఎటువంటి పుస్తకాలు చదవాలి
అసలు ఏ ఏ పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి
ఒక అవగాహన ఉండాలి
లేకపోతే ....
ధనమూ... సమయమూ...
కడకూ జీవితమూ వృథా వృథా ....
*********
ఏంటీ ...
ఒక పుస్తకం చదివి ఉండక పోతేనే
జీవితం వృథానా... అంటారా
అవును ... వృథానే ....
ఒక పుస్తకం... లేదా జీవితంలో సంభవించే ఒకానొక ఘటన.... మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది తెలుసా....
*********
శారీరకంగా దుర్భలుడూ
మానసికంగా బిడియస్తుడూ
నలుగురిలో కలవక ఏకాంతాన్ని ఇష్టపడేవాడూ
అయిన గాంథీ....
ఒక వేళ
సత్య హరిశ్చంద్ర నాటకాన్ని
చూసి ఉండకపోతే
ఒక వేళ
ఓ అర్థ రాత్రి
ఫస్ట్ క్లాస్ కోచ్ నుండి
అతనిని మెడ బట్టి గెంటి ఉండకపోతే
ఒక వేళ
దక్షిణాఫ్రికాలో
భారతీయుల దుస్థితిని
అతను కాంచి ఉండకపోతే
ఏమై ఉండేది చెప్పండి...
************
ప్రపంచాన్నీ
దాని దృక్పథాన్ని
మలచినా.... మలుపు తిప్పినా
కారల్ మార్క్స్.... అంబేద్కర్.....
జ్యోతిబా..... పెరియార్.... లెనిన్....
వంటి మహనీయులందరూ మంచి చదువరులే తెలుసా
ఒకానొక...
లేదా కొన్ని పుస్తకాల చేతా
ఒకానొక ... లేదా కొన్ని సంఘటనల చేతా
వాళ్ళంతా ప్రభావితులైన వాళ్ళే తెలుసా
*********
చివరిగా ఒక మాట
మనం ఎటు వైపు నిలబడాలి.
మనం ఎవరి పక్షం వహించాలి.
అసలు మనం ఎలా జీవించాలి.
అన్నది కూడా ఒక ఎంపికే
సత్యం వైపా
లేక అసత్యం వైపా ....
మానవత్వం వైపా
లేక మతం వైపా ....
మూఢత్వం వైపా
లేక శాస్త్రీయత వైపా ....
ఉన్మాదుల వైపా
లేక సంయమనం వైపా ...
కపటం వంచన వైపా
లేక స్నేహం ప్రేమా సుహృద్భావం వైపా ....
పురోగమనం వైపా
లేక తిరోగమనం వైపా ....
ఎంపిక ఎటువైపు
అన్నది కూడా ఐచ్చికమే సుమా ....
స్వార్థంతో బతికామన్న వేదనతో కాక
అర్థవంతంగా జీవించామన్న ఆత్మతృప్తితో...
అనంత శూన్యంలోకి లయమైపోవాలి మనం.
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment