*శంబల -14*
💮
రచన : శ్రీ శార్వరి
*మరో ప్రస్థానం - 3*
"ఎందుకు లామా, నీ సొదతో నా మెదడు తినేస్తావు" అనుకున్నాను.
ఆయన నా మనస్సురొద గ్రహించి చప్పున అన్నాడు. “సొద కాదు శార్వరీ! ఎంత తపస్సు చేసినా మీ వాళ్లకు స్వర్గ సుఖాలపై మోజు. అప్సరసల మీద ఆశ చావదు. మనిషి చచ్చినా ఆశ చావదు. అలాంటి వారికి శంబల అందని స్వర్గం. శూన్యంపై యోగం చేసే వారికి అరచేతిలో వైకుంఠం. శంబల దృష్టిలో మనం పడాలంటే మాస్టర్ స్మరణ చేయాలి. మాస్టరు అంటే పరమ గురువు. శంబల లో ఉండే పరమ గురువులు అందరూ మాస్టర్లే. ఆత్మనే మహా గురువుగా ధ్యానిస్తే సరి! మనసు నిర్మలం కానిది ఆత్మ ధ్యానం కుదరదు, మరచిపోరు.
నీకు 'ఢాకిని' సహాయం ఉంది. శంబల అంటే ఒక తపోలోకం అనుకో. నిన్ను అక్కడకి చేర్చేది ఢాకిని.”
“లామాజీ! మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే డాకినీలు స్పిరిట్స్ అయినా మంచి బుద్ధిగల వారని నాకు అనిపిస్తారు. మరణం తర్వాత జీవితం కొనసాగిస్తే అవి స్పిరిట్స్ అవుతాయి. అంటే ఆత్మలనే కదా అర్థం. హిందూ పురాణాలలో ఢాకినీల పాత్ర వేరు. వీరూ వారూ ధర్మ రక్షకులు, మార్గ దర్శకులు అనిపిస్తుంది. అవి దయ్యాలు, భూతాలు కాదు. మళ్లీ జన్మకు రాని దివ్యాత్మలు అంతేనా?"
"అంటే దేవతలా?”
లామా నవ్వాడు నా అజ్ఞానానికి తన అజ్ఞానానికి నాకూ నవ్వొచ్చింది.
"లేదు స్వామీ! ఒక్కో మతంలో ఒక్కో పేరు ఉంటుంది. మానవతను రక్షించే పరాశక్తులు అనుకుందాం. మనిషిని సన్మార్గంలో నడిపే శక్తులు అవి. ప్రతి మతంలో భగవచ్ఛక్తి అనుభవాలు ఉంటాయి. ఒకదానికొకటి కలవ్వు, ప్రేమ ఒక్కటే - అన్ని మతాలలో సమాన ధర్మం. అన్నింటి మూల ప్రకృతి ఒకటే. మౌలిక శక్తి ఒకటే. ఆ శక్తి మానవులకు, దేవతలకు మూలమైన శక్తి.”
"అంటే. మీరు పూర్తి బౌద్ధులు కాదా లామా?"
"మా విశ్వాసాలకు మూలం ధర్మం. అది బౌద్ధ ధర్మం. అన్ని విశ్వాసాలను గౌరవిస్తాం. గౌరవించడంలో తప్పు లేదుగా. అయితే సంప్రదాయాలు, ఆచారాలు మారుతుంటాయి. ఒక మతంలోనే కాలాన్ని బట్టి పద్ధతులు మారుతుంటాయి. శంబల గురువులు అన్ని మతాలను గౌరవిస్తారు. అదే 'కాలచక్ర' విధానం.”
నాకు ఆశ్చర్యంగా ఉంది. లామా వైపు ప్రశ్నార్ధకంగా చూచాను.
లామా అన్నారు "అన్నీ ఆచరించలేం కదా!"
“ఇప్పుడు ప్రపంచానికి కావలసింది మతం కాదు. మత్తు కాదు. చైతన్యం. మంత్రాలు, తంత్రాలు కాదు. అన్ని మతాలలో ప్రేయర్ కి పవర్ ఉంటుంది. అది ప్రపంచాన్ని రక్షిస్తుంది. మరొక ముఖ్య విషయం. ఢాకినీ అంటే దయ్యం భూతం కాదు. భయపడకండి. అది నీ నేస్తం."
"ఢాకినీ మనకెందుకు సాయం చేయాలి? అది చెప్పండి చాలు?"
అంత సూటిగా అడిగేసరికి ఆయనకు చికాకు కలిగింది. కళ్లు చిట్లించాడు.
"బాబూ, ఆ ప్రశ్నకు సమాధానం, నా జీవితం అంతా వెతుకుతూనే ఉన్నాను. ఇంతవరకు సమాధానం దొరకలేదు. నేను సమాధాన పడలేదు. నీకు శంబల రహస్యం తెలిస్తే ఢాకినీ రహస్యం తెలుస్తుంది.”
"అంటే మీ ఉద్దేశం ఆ డాకిని నా వెంట ఉండి నాకు సహాయం చేస్తుందని. నేను ఆ సహాయం వద్దనుకుంటే.”
"మీ స్నేహితుడు చాలా తెలిసినవాడే! కానీ ఏం ఉపయోగం. తన తెలివి తేటలు తనే ఉపయోగించుకోలేడు. దేని పైన పూర్తి విశ్వాసం ఉంచడు.”
"అతను ఢాకినీ అంటారా?” అడిగాను భయంగా. నా వెంటపడి నన్ను గైడ్ చేస్తున్నాడంటే అది ఢాకినీ చేయవలసిన పని కదా. భార్గవలో ఢాకినీ స్పిరిట్ ప్రవేశించలేదు గదా!"
"లామా! ప్రేయర్ అంటే?"
"తెలిసి అడిగే వారికి చెప్పకూడనిది. నమ్మకం లేని వారికి అసలు చెప్ప కూడనిది!"
"అంటే నాకు చెప్పకూడదంటారా?”
ఈనాడు అందరికీ సెల్ఫ్ హెల్ప్ ప్రేయర్. మనిషికి శక్తి ప్రేయర్ - మంత్రాలు, మహిమలు కాదు. తంత్రాలు,కుతంత్రాలు కాదు. ప్రేమ ప్రేయర్ కి ఆధారం. ప్రేయర్ వల్ల విజన్ పెరుగుతుంది. Canvas పెద్దవుతుంది. శంబల గురువుల దృక్పధం మారుతోందనిపిస్తోంది. లోకం లోని కొందరి Touch లోకి రావాలను కుంటున్నారు. ఇదివరకు ఆ దృక్పధం ఉండేది కాదు. ఇప్పుడు వారిలో విశ్వ ప్రేమ జనీనత పెరిగింది. వారి ప్రయోగ ఫలాలు లోకానికంతా అందాలని ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. అందులో భాగంగానే మిమ్మల్ని పిలిపించారను కుంటా.”
"అయ్యా! మేం చచ్చి శంబలకి చేరాలంటారా? అంత అవసరమా?"
"బ్రతికి ఉండి ఏదైనా చేయడంలో తృప్తి ఉంటుంది. ఆత్మలతో ఎంత చేసినా ఎవరికి తెలుస్తుంది?"
"ఆత్మ తృప్తి ఉండదా?”
"మనిషి బ్రతికి ఉంటేగదా లామాజీ ఆత్మకు గుర్తింపు, విలువ. శరీరాన్ని ఆశ్రయించిన 'ఆత్మ' చేసే పనికే విలువ. ఇంతమంది మహర్షులు చనిపోయిన తర్వాత ఏం చేశారో ఎవరికి తెలుసు? నిజానికి వారికీ తెలియదు. వారి ఆత్మలకు తెలుసునంటారా? ఆత్మలకు తెలిస్తే మనకేం ప్రయోజనం?"
ఆయనతో వాదించి ప్రయోజనం లేదు. నాకు ఉన్నమతి పోయేట్టుంది.
"ఇంక వెడదాం గురూజీ. అన్నాడు భార్గవ", నా ఇబ్బంది పసిగట్టి.
*కైలాస దర్శనం*
🗻
లామా రిగ్లెన్ మాటలు నాకు నచ్చాయి. ఆయనలో అభ్యుదయ దృష్టి ఉంది. సహనం ఉంది. అభ్యుదయం తొంగి చూచింది. బాగా చదువుకున్నవాడు. లోతులు చూచినవాడు.అక్కడికి నాలుగైదు మైళ్ల దూరంలో ఒక ప్రాచీన బౌద్ధ మఠం ఉందని, అక్కడ ఒక గొప్ప లామా ఉన్నాడని ఆయనే చెప్పాడు. తానే కారు ఏర్పాటు చేశాడు. ఒకరిని తోడిచ్చి పంపాడు. రిగ్లెన్ కి నచ్చాడంటే, అతని అభిమానం పొందాడంటే ఖచ్చితంగా, ఆ లామా సమర్థుడై ఉంటాడు. అక్కడ నుండి నైరుతి దిశగా హైవే మీద ప్రయాణం. కొండదారులు కనుక ప్రయాణం వేగంగా లేదు. టెంగ్రీ దాటి ఎవరెస్టు సమీపానికి వచ్చాం.
కారు డ్రయివర్ ని అడిగాను "ఆ లామా మంచివాడేనా బాబూ! నీకు తెలుసు గదూ.”
డ్రయివర్ వివరాలు చెప్పాడు. ఆయన పేరు హన్? థాయ్ ల్యాండ్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడుట. లామా లాగా ఉండడు. ఒక యోగిలా జీవిస్తాడు. బాగా చదువుకున్నవాడు. ఆయన వద్దకు విదేశీయులు తరచుగా వస్తుంటారు. మధ్యలో ఎక్కడ ఊళ్లు లేవు. మనుషులు తగల్లేదు. నిర్మానుష్యం.
కారు నెమ్మదిగా పోతోంది. లామా రిగ్లెన్ నాలో ఏవో ఎనర్జీ సెంటర్లు ఉన్నాయన్నా డు. వాటిని ఉద్దీప్తం చేయాలి. ఎట్లా? ప్రేయర్ లో పది అంతస్థులట. మెట్లు మెట్లు ఎక్కి పైకి రావాలన్నాడు. నాకు ఆ విషయం తెలియదు. ఏదో యోగం చేయడం, లేచిపోవడం తెలుసు. తృప్తిగా ధ్యానం చేసుకుంటాను. ఎనర్జీ సెంటర్సు పట్టించుకోలేదు ఎప్పుడూ. మనకు గంటలు గంటలు సమాధిలో ఉండడం గొప్ప. నిర్వికల్ప సమాధి మరీ గొప్ప. ఎన్ని నెలలు నిర్వికల్ప సమాధిలో ఉండగలిగితే అంత ఎక్కువగా మనకి అభిమానులు, భక్తులు పెరుగుతారు. ప్రచారం జరుగుతుంది. ప్రేయర్ లో స్తబ్ధత పనికి రాదంటాడు రిగ్లెన్. ఎరుకలో ఉంటేనే చైతన్యం. కాన్షస్ నెస్ ఉండాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కి, పైకి రావాలంటాడు.
అందరికీ తెలుసు. తమలో ఏదో శక్తి ఉంటుందని, అది ఏమిటో ఎవరికీ తెలియదు. దానిని పట్టుకోవడం తెలియదు. ఉపయోగించడం తెలియదు. దానిని కనిపెట్టి పైకి లాగాలి. అది జ్ఞానం.
ఆయన ప్రేమగా చెప్పాడు “నీలో ఆ శక్తి పుష్కలంగా ఉంది శార్వరీ. ప్రేయర్లో నీకే తెలుస్తుంది".
ఎవరైనా ఎన్నని నేర్చుకోగలరు? ఎంత కాలమని నేర్చుకుంటూ ఉంటారు. జ్ఞానానికి అంతం ఉండదు. ఎంత నేర్చినా, ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. నేర్చుకోకపోయినా హృదయం లోంచి పైకి ఉబికి వచ్చేది అసలైన జ్ఞానం.
ఎవరెస్టు పర్వతం సమీపంలోకి వచ్చాం. అక్కడ 'రాంగ్పూ' మఠం ఉంది. అది మఠం కాదు, లామాసరి కాదు. అది చక్కని ఆశ్రమం. పర్వతాలు కోటగోడల్లా అమరాయి. సహజమైన ప్రకృతి సౌందర్యం. ఆశ్రమం దాపుల్లోకి వచ్చే సరికి ఒక వృద్ధ లామా వచ్చి మాకు స్వాగతం చెప్పాడు. అరవై, డెబ్బయ్ ఏళ్ల వయసువాడు. పండుటాకులా ఉన్నాడు. వంగిన నడుం అయినా ముప్పయ్ ఏళ్ల వాడి ఉత్సాహం అతనిలో. డ్రయివర్ ఆయన్ని పలకరించాడు టిబెట్ భాషలో.
"వీళ్లు ఇండియా నుండి వచ్చారు. లామా రిగ్లెన్ గెస్టులు. ఆయనే పంపారు.” హమ్మయ్య! ఒక పనైపోయింది.
డ్రయివర్ చెప్పే మాటల్లో ఇండియా, గురు, శంబల తప్ప వేరే ఏమీ అర్ధం కాలేదు. టిబెట్ లో మాట్లాడుకున్నారు. 'హన్' చాలా మర్యాదగా, గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించాడు. Very Polite Fellow. మేం శంబల పని మీద వచ్చామని గ్రహించాడు. గదిలో చైనా బటర్ టీ తాగిన తర్వాత కబుర్లు మొదలుపెట్టాడు. టైం వృధా కాకుండా తనే విషయానికి వచ్చాడు.
🪷
*సశేషం*
No comments:
Post a Comment