Sunday, January 19, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


76. యత్తే రూపం కల్యాణతమమ్

నీ రూపం ఏది కలదో అత్యంత శుభకరమైనది (ఈశావాస్యోపనిషత్)

నామ రూపాలలో వ్యక్తమయ్యే పరమేశ్వరుని ఈ(పై) ఉపనిషన్మంత్రం ప్రస్తుతిస్తోంది.భగవంతుని నామం, రూపం భక్తులను అనుగ్రహించడానికై స్వీకరించినవి. అందుకే అవి కళ్యాణతమాలు(అత్యంతశుభాలు). ఆ నామం స్మరించినా, ఆ రూపాన్ని
ధ్యానించినా శుభంకరం. 'నామ్నామకారి బహుధా నిజసర్వశక్తిః తత్రార్పితా..' అని చైతన్యమహాప్రభుని మాట. "భగవాన్! నువ్వు అనేక నామాలను ఏర్పరచి, వాటిలో నీ సర్వశక్తులను నింపి ఉంచావు." ఈశ్వరశక్తి నిండియుండడం చేత నామాలన్నీ
మంత్రాలయ్యాయి. మననం చేసేవారిని కాపాడేది మంత్రం. అందుకే నామమే మంత్రం. ఆ నామశక్తిని రూపింపజేసేది రూపం(ప్రకటించుట).

భావాన్ని ప్రకటించితే రూపం.
భగవంతుడు తన అనంత కళ్యాణగుణాలను రూపం
ద్వారా ప్రకటించుతాడు. ఈ అర్థంలో 'రూపు' శబ్దానికి 'ఆకారం' అనే కాక 'లీల' అని కూడా గ్రహించవచ్చు. భగవంతుని కృత్యాలు (ప్రకటనలు) లీలలు. అవి మన కల్యాణం కోసమే గానీ తన ప్రయోజనం కోసం కావు.

'తయా నస్తనువా శస్త్రమయా గిరిశన్త!'
'యాతే రుద్ర తనూరఘోరా పాపకాశినీ' - వంటి రుద్రనమకమంత్రాలు.

పరమేశ్వరుని రూపాన్ని 'శన్తమము' (అత్యంత సుఖ, శుభ, శాంతమయము) 'అఘోర’
(ప్రశాంతము) అపాపకాశినీ (దోషరహితమై, జ్ఞానాన్ని ప్రకాశింపజేయునది) అనే
మూడు విశేషాలను తెలియజేసింది. శివకేశవ దేవ్యాది దేవతారూపాలన్నీ ఈ లక్షణాలతో ఉన్నవే.

భగవంతుని రూపాలన్నీ మనం కల్పించుకున్నవి కావు. ఋషులు తపస్సుతో దర్శించినవి. వారికి దర్శనం - మనకు ధ్యానం. వారికి విజ్ఞానం - మనకు విశ్వాసం.
వారు దర్శించి వర్ణించినవే ధ్యానశ్లోకాలుగా మనకు లభ్యమౌతున్నాయి.

ఏకాగ్రంగా ఆ రూపాన్ని హృదయంలో తలచుకున్నవారికి ఈశ్వర చైతన్యం వారి ప్రాణశక్తిలో సన్నిహితమై ఉండి, సర్వదా శుభాలను సమకూర్చుతుంది. అందులో సందేహం లేదు. ఆ రూపాన్ని మనలో సన్నిహితం చేసేది నామస్మరణ. ఒక నామం
అనగానే ఒక రూపం స్ఫురిస్తుంది. రెండూ కళ్యాణకరాలే. ఈ నామరూపవిద్య విగ్రహాలుగా, కీర్తనలుగా, స్తోత్రాలుగా మనకు లభ్యమౌతోంది. 

నామ జప, స్తోత్ర పఠనాలతో దేవతాస్వరూపం స్ఫుటంగా ఆవిష్కృతమై సాధకుని
ఇహపరసిద్ధులకు హేతువౌతుంది.

భగవంతుడు ధరించిన నృసింహ, వామన, రామ, కృష్ణాది అవతార స్వరూపాలు సైతం పాంచభౌతికాలుగా గోచరించినా అవి 'అప్రాకృతదివ్యతనువులు'. ప్రకృతి
వికారాలు లేనివి.

'సర్వే నిత్యాః శాశ్వతాశ్చ దేహాస్తస్యపరాత్మనః।
హానోపాదానరహితాః నైవప్రకృతిజాః క్వచిత్||
సర్వైః సర్వగుణైః పూర్ణాః సర్వావగుణవర్జితా|
పరమానందసందోహాః జ్ఞానమాత్రాశ్చ కేవలాః ॥
- అని శివపురాణ వచనం.

 పరమాత్ముని సాకార సగుణ రూపాలన్నీ నిత్యములు,
శాశ్వతములు; హాని, నాశనం లేనివి. ప్రకృతికి లొంగినవి కావు. ప్రకృతిని
లొంగదీసుకున్నవి(ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా - భగవద్గీత).
సర్వసద్గుణములతో కూడినవి. ఏ మాత్రపు అవగుణాలూ లేనివి. సర్వసుమంగళ సంపూర్ణములు. అవి చిన్మయవిగ్రహాలు.పూర్ణానందమయాలు.

'దివ్యమంగళవిగ్రహం', 'సచ్చిదానంద విగ్రహం' - అనే మాటలు దేవతా రూపాలను ఉద్దేశించి పలకడంలో ఆంతర్యమిదే. వేదం పలికిన 'కళ్యాణతమం' అనే వచనం
ఇంత లోతైన భావాలను వ్యక్తం చేస్తోంది.

'చందురు వర్ణుని అందచందములహృదయారవిందముల జూచి బ్రహ్మానంద మనుభవించువారు ఎందరో మహానుభావులు' అని పలికిన త్యాగయ్య, 'నీ సొగసు,నీ దినుసు, నీ మనసు వేరు... లావణ్య రామ!' అంటూ భగవద్రూపాలు
పాంచభౌతికాలకు అతీతాలన్న విషయాన్ని వ్యక్తం చేశారు. ఆ సౌందర్యం ప్రాపంచిక వికారాలకు అందనిది. ‘జన్మ కర్మ చ మే దివ్యం...' అని శ్రీకృష్ణుని వచనం. 'సొగసు
చూడతరమా' అంటూ ఆ దివ్య రూప సాక్షాత్కారం కోసం భక్తులు తపించినదందుకే! 

No comments:

Post a Comment