☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
83. ధీనామవిత్ర్యవతు
బుద్ధులను రక్షించు దేవి (మనలను) రక్షించు గాక(ఋగ్వేదం)
సరస్వతీసూక్తంలోని మంత్రమిది. వాక్
బుద్ధి జ్ఞానాలకు అధిష్ఠాత్రి అయిన శక్తి
సరస్వతీదేవి. ఈ తల్లి వలననే బుద్ధిశక్తులు పనిచేస్తాయి. ప్రేరణ, ఆలోచన, స్ఫురణ,నిర్ణయం...ఇవన్నీ బుద్ధిపనులు. వీటి వలననే జీవితగమనం నిర్దేశింపబడుతుంది.
అందుకే బుద్ధి తిన్నగా ఉంటే అన్నీ తిన్నగా ఉంటాయంటారు.
ధారణ, ప్రతిభ, మేధ, ప్రజ్ఞ, స్మృతి, కల్పన, విద్య.... మొదలైన బౌద్ధిక శక్తుల విశిష్టత మనకు తెలిసినదే.
( వేదవిజ్ఞానం ప్రకారం ఒకే పరాశక్తి(జగదంబిక) తన పలుశక్తులను ప్రకటించేటప్పుడు పలువిధాల ఆకృతులను ధరించింది. సరస్వతిగా, లక్ష్మిగా,దుర్గగా, అన్నపూర్ణగా, శాకంభరిగా ఈ చైతన్యరూపిణిని ఋషులు
ప్రస్తుతించారు. మనలోని ప్రాణశక్తియే సరస్వతి అని శ్రుతివాక్యం.)
ఈ బుద్ధిని రక్షించే ఈశ్వర చైతన్యాన్ని మనం సరస్వతీదేవిగా ఆరాధిస్తున్నాం.విద్యల తల్లి కృప సర్వజీవులకు అవసరం. బుద్ధులను పాలించే ఆ తల్లినే 'ధియో
యోనః ప్రచోదయాత్' అని వేదమాతగా అంజలించి, 'బుద్ధిం యానః ప్రచోదయాత్' అని ప్రస్తుతించారు ఋషులు.
సరస్వతీ ఆరాధనకు ప్రాధాన్యమిచ్చిన దేశం మనది. భారతి-భారత-
భారతీయత...ఇవన్నీ జ్ఞాన ప్రాముఖ్యాన్ని చెప్పే శబ్దాలు. శారదాదేవి కృప వలన అసురీశక్తుల బుద్ధులు స్తంభించబడి, లోకక్షేమాన్ని ఆశించే ధార్మికుల బుద్ధులు
వికసించి, లోకహితాలోచనలు ప్రేరేపింపబడాలని ప్రార్థిద్దాం.
మంచి ఆలోచన, విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోగలగడం, సత్కర్మలకు తగిన ప్రేరణ, సంకల్పం, ఆచరణకు అనువైన విజ్ఞానం-ఇవన్నీ బుద్ధికి ఉండవలసిన సులక్షణాలు. వీటిని కలిగించేది భారతీదేవి అనుగ్రహమే.
ఈ జగదంబిక కృపవల్లనే మహర్షులు, వ్యాస వాల్మీకి కాళిదాసాదులు, త్యాగరాజాది వాగ్గేయకారకులు - వారు తరించి, మనలను తరింపజేశారు.
విశ్వమంతా శబ్దబ్రహ్మగా వ్యాపించిన ఈ జగదంబిక అన్నప్రదాయినిగా, అన్నశక్తి సంభరితురాలుగా వేదసూక్తాలలో సాక్షాత్కరిస్తోంది.
'వాజినీవతీ' అని వేదం సరస్వతిని నుతించింది.
'అన్నములు కల తల్లి', 'వాజేభిః' - ఆ అన్నము(ఐశ్వర్యము)లతో మనలను
రక్షించాలని కీర్తిస్తూ...ఐశ్వర్యార్జనకు, వినియోగానికి కావలసిన జ్ఞానం బుద్ధ్యాధారం కనుక ఆ బుద్ధిని జగదంబ రక్షించాలని వేదం సంభావించింది.
శబ్దబ్రహ్మస్వరూపిణి అయిన ఈ తల్లి కృప లేకుంటే జగతి స్తబ్ధమై, జడీభూతమై ఉంటుంది. విశ్వరచన చేసే విశ్వేశ్వరుని విజ్ఞానమంతా ఒక రూపు కడితే ఆమెయే సరస్వతి.
ప్రకాశమయమైన జ్ఞానాకృతి కనుక 'భారతి'. అక్షరరూపిణిగా, స్వరస్వరూపిణిగా ఆరాధింపబడే నాదమయి ఈ తల్లి. ప్రసరించే, ప్రవహించే లక్షణం గలది కనుక
'సరస్వతి'. చైతన్యలక్షణమే ప్రసరణ. ఇదే చైతన్యలహరి.
వేదవిజ్ఞానం ప్రకారం ఒకే పరాశక్తి (జగదంబిక) తన పలుశక్తులను ప్రకటించేటప్పుడు పలువిధాల ఆకృతులను ధరించింది. సరస్వతిగా, లక్ష్మిగా, దుర్గగా, అన్నపూర్ణగా,
శాకంభరిగా ఈ చైతన్యరూపిణిని ఋషులు ప్రస్తుతించారు. మనలోని ప్రాణశక్తియేసరస్వతి అని శ్రుతివాక్యం.
'ప్రాణశక్తిః సరస్వతీ'. మనలోని అంతః స్రవంతిగా ఉన్న చైతన్యమే ఈ తల్లి
స్వరూపం. సరస్వతీ ఆరాధనకు ప్రాధాన్యమిచ్చిన దేశం మనది.
దేశవాసుల, పాలకుల, మేధావుల బుద్దులు పెడత్రోవ పట్టకుండా, బుద్ధులను కాపాడే ఆ జగదంబ అనుగ్రహించుగాక!
No comments:
Post a Comment