Saturday, January 4, 2025

 *తెలివిలో నిన్ను కొట్టే వాడెవడు - ఇటలీ దేశ జానపద కథ*
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒక ఊరిలో ఒక రాజు వుండేటోడు. ఆయన ఒకసారి మారువేషంలో దేశాటనకు బైలుదేరాడు. అక్కడక్కడ జనాలను పలుకరిస్తా, వింతలు విశేషాలు తెలుసుకుంటా, రాజ్యంలో ప్రజలు తన పాలన గురించి ఏమనుకుంటావున్నారో కనుక్కుంటా, తప్పొప్పులు బేరీజు వేసుకుంటా పోసాగాడు.
అట్లా పోతావుంటే ఒక రైతు పొలంలో దున్నుతా కనబన్నాడు. అతని మొహం చిరునవ్వుతో వెలిగి పోతావుంది. రాజు ఆ రైతును పలకరించి "ఏం నాయనా... పని చేసీ చేసీ అలసిపోయినట్టున్నావు. అయినా సంతృప్తిగా వున్నావు. నీవు చేసే పనికి, పెట్టిన పెట్టుబడికి, వస్తున్న రాబడికి గిట్టుబాటవుతుందా... ఎంత సంపాదిస్తావు రోజుకి" అని అడిగాడు.
దానికా రైతు చిరునవ్వుతో “మా మహారాజు ముందుచూపుతో ఇక్కడ పెద్ద చెరువు తవ్వించడంతో సుర్రున మండే ఎండాకాలంలో కూడా పచ్చని పంటలు పండుతా వున్నాయి. ఖర్చులు, పెట్టుబడులు అన్నీ పోను సగటున రోజుకి నాలుగు వరహాలు సంపాదిస్తాను" అని చెప్పాడు.
“శభాష్... మరి ఆ నాలుగు వరహాలు ఏం చేస్తావు" అన్నాడు రాజు.
దానికా రైతు నవ్వి “మీ మొహం చూస్తే బాగా చదువుకొన్నట్లే కనబడుతుంది. జవాబు పామరులకు చెప్పినట్లు చెప్పాల్నా. పండితులకి చెప్పినట్లు చెప్పాల్నా" అన్నాడు సరదాగా.
ఎన్నో విద్యలు తెలిసిన రాజు గంభీరంగా మొహం పెట్టి “పండితులకి చెప్పినట్లే చెప్పు" అన్నాడు. దానికా రైతు “ఏముంది స్వామీ... మొదటి వరహాతో సంతృప్తిగా అన్నం తింటాను. రెండవ వరహాను అప్పుగా ఇస్తాను. మూడవ వరహాతో అప్పు తీరుస్తాను. నాలుగవ వరహా బావిలో పాడేస్తాను" అన్నాడు.
రాజుకు ఎంత ఆలోచించినా ఒక్క ముక్కా అర్థం కాలేదు. దాంతో “మహానుభావా... నువ్వు పేరుకు రైతువైనా మహా మేధావిలా వున్నావు. ఈ చిక్కుముడిని విప్పే శక్తి నాకు లేదు. ఒక పండితునికి చెప్పినట్లు గాక పామరునికి చెప్పినట్లు అర్థమయ్యేలా వివరించు" అన్నాడు.
దానికి అతను చిరునవ్వు నవ్వి "మొదటి వరహాతో నేనూ, నా పెళ్ళాము కడుపునిండా అన్నం తింటాము. రెండవ వరహా నా పిల్లల కోసం ఉపయోగిస్తాను. వాళ్ళకు మంచి భోజనం, బట్టలు, చదువు ప్రేమగా అందిస్తాను. రేప్పొద్దున మేము ముసలివాళ్ళమయి, పనిచేసే శక్తి కోల్పోయాక వాళ్ళే కదా మాకు తిండి పెట్టి చూసుకునేది. ఇప్పుడు ఇచ్చిన అప్పు అప్పుడు తీరుతుంది. మూడవ వరహాను మా అమ్మానాన్నల కోసం ఖర్చు పెడతాను. నన్ను పెంచి పెద్దచేసి ప్రయోజకున్ని చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఖర్చు పెట్టారు. ఆ అప్పు ఇప్పుడు నేను తీరుస్తున్నాను. ఇక నాలుగవ వరహా దానధర్మాల కోసం ఖర్చు పెడతాను. దాని వల్ల ఈ జన్మలో ఎలాంటి ఫలితాన్ని ఆశించను. తిరిగి రావాలని కోరుకోను. భక్తితో భగవంతునికి సేవ చేసినట్లు భావిస్తాను. అందుకే నాలుగవ వరహా బావిలో పాడేస్తాను అని చెప్పాను" అన్నాడు.
రాజు ఆ జవాబు విని చాలా సంబరపడ్డాడు. మెడలోని విలువైన రత్నాల హారాన్ని తీసి అతనికి కానుకగా ఇచ్చి "నేను ఎవరో నీకింతవరకు చెప్పలేదు గదా... నేనీ దేశానికి రాజును. నువ్వు మరలా నా మొహాన్ని వందసార్లు చూసేంతవరకు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పగూడదు. ఇది నా ఆజ్ఞ. చెబితే ఆ తరువాత రోజు నీ తల కోట గుమ్మానికి వేలాడబడుతుంది. జాగ్రత్త" అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు.
తరువాత రోజు నగర ప్రముఖులతో సభ ఏర్పాటు చేశాడు. అనేకమంది పండితులను, తెలివైన వారిని, ప్రముఖులను, గురువులను పిలిపించాడు. నిండుసభలో అందరూ వింటా వుండగా “నిన్న నేను ఒక తెలివైన వ్యక్తిని కలిశాను. అతడు రోజుకి నాలుగు వరహాలు సంపాదిస్తాడు. అందులో మొదటి వరహాతో తాను తింటాడు. రెండవ వరహాను అప్పుగా ఇస్తాడు. మూడవ వరహాతో అప్పు తీరుస్తాడు. నాలుగవ వరహాను బావిలో పడేస్తాడు. ఈ మాటలకు సరియైన అర్థం ఎవరైతే వివరించగలుగుతారో వారికి వేయి బంగారు వరహాలు కానుకగా ఇస్తాను" అని ప్రకటించాడు. సభలోని వారందరూ కిందామీదాపడి తెగ ఆలోచించారు. తలలు బద్దలు కొట్టుకున్నారు. ఒకరితో ఒకరు శాస్త్ర చర్చలు చేశారు. కానీ ఎంత ఆలోచించినా ఎవరికీ ఒక్కముక్కా అర్థం కాలేదు. దాంతో అందరూ తెల్లమొహాలు వేసుకొని తల దించుకున్నారు. రాజు వాళ్ళకు వారం సమయం ఇచ్చి సభ ముగించాడు.
మంత్రి ఆలోచనలో పడ్డాడు. రాజు నగర సంచారానికి పోయినప్పుడు రాజుకు ఎటువంటి ఆపద జరగకుండా చూడడానికి పదిమంది వీరులైన గూఢచారులు రహస్యంగా అనుసరిస్తుంటారు. వారిని పిలిపించాడు. ముందురోజు రాజు ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే విషయాలన్నీ సేకరించాడు. రాజు ఒక రైతుతో మాట్లాడి రత్నాల హారాన్ని బహుమానంగా ఇవ్వడం కనుక్కున్నాడు. వెంటనే గుర్రమ్మీద ఆ రైతు ఇంటికి వెళ్ళి విషయాన్ని వివరించి జవాబు కావాలన్నాడు.
దానికి ఆ రైతు “అయ్యా... మహారాజు మొహాన్ని వందసార్లు చూసేంతవరకు నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పగూడదని రాజు ఆజ్ఞ వేశారు. మాట తప్పితే తల ఎగిరిపోతుంది" అన్నాడు. మంత్రి ఆలోచనలో పడ్డాడు. సమస్య నుంచి ఎలా బయట పడాలో తోచలేదు. ఉపాయం చెప్పమని ఆ రైతునే ప్రాధేయపడ్డాడు. రైతు కాసేపు ఆలోచించి మంత్రికి ఏం చేయాలో చెప్పాడు. వెంటనే మంత్రి రాజ్యంలో అందరికన్నా పేరున్న కంసాలిని పిలిపించాడు. నూరు బంగారు వరహాల మీద మహారాజు మొహాన్ని, కొంచంగూడా తేడా లేకుండా అచ్చు గుద్దినట్లు తయారు చేయమన్నాడు. అతడు అలాగే నాలుగు రోజుల్లో వంద వరహాలు రాజు బొమ్మతో తయారు చేసి ఇచ్చాడు. వాటిని తీసుకొని మంత్రి ఆ రైతు ఇంటికి వెళ్ళాడు. “ఇదిగో నీవు చెప్పినట్లే రాజు
మొహం ముద్రించిన వంద వరహాలు" అంటూ బంగారు నాణేలు కుప్ప పోశాడు. రైతు చిరునవ్వు నవ్వి వంద వరహాలు ఒకొక్కటే కళ్ళకు అద్దుకొని విషయం వివరించాడు.
తరువాత రోజు మంత్రి నిండు సభలో అందరిముందు "రైతు తనకు ఏదైతే చెప్పాడో... అవే మాటలు పొల్లుపోకుండా అప్పజెప్పాడు. అది విని సభలోని వారందరూ సంబరంగా చప్పట్ల మీద చప్పట్లు కొట్టారు. రాజు "శభాష్ మంత్రి... మొత్తానికి జవాబు కనుక్కున్నావ్. నీకు సమాధానం చెప్పింది ఆ రైతే గదా" అన్నాడు.
మంత్రి అవునంటూ తలూపాడు. రాజు కోపంగా సైనికాధికారికి సైగ చేశాడు. వెంటనే అతను పోయి ఆ రైతును పట్టుకొని వచ్చి రాజు ముందు నిలిపాడు.
రాజు ఎర్రబడిన కళ్ళతో కోపంగా ఆ రైతు వంక చూసి “రాజ్యాన్ని పాలించే రాజు మాటంటేనే నీకు లెక్క లేదా, లేక ప్రాణాల మీద ఆశ లేదా. ఇచ్చిన మాట తప్పితే ఏం జరుగుతుందో నీకు తెలుసు గదా" అన్నాడు.
రైతు వినయంగా రాజుకు నమస్కరించి “మహారాజా మన్నించాలి. నేను మాట తప్పలేదు. మీరు ఆజ్ఞాపించినట్లుగానే మీ మొహం నూరుసార్లు చూసింతరువాతనే నేను మహామంత్రికి రహస్యాన్ని వివరించాను" అంటూ రాజు బొమ్మ వున్న వంద వరహాలను తీసి రాజు ముందు వుంచాడు.
వాటిని చూసి రాజు ఆ రైతు తెలివికి ఆశ్చర్యపోయి “శభాష్... తెలివితేటల్లో నిన్ను కొట్టేవాడు ఈ లోకంలో ఎవడూ వుండడు. నీలాంటివాడు మా రాజ్యంలో వుండడం మా రాజ్యానికే గర్వకారణం" అంటూ మరో వంద వరహాలు కానుకగా ఇచ్చి పంపించాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment