*రహస్య గృహం* - అద్భుత కథ.
డా.ఎం.హరికిషన్-కర్నూల్-94410 32212
**************************
ఒక రాజు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. చుట్టుపక్కల ఉన్న అనేక రాజ్యాల మీద దాడిచేసి దొరికిందల్లా దోచుకునేవాడు. "అలా సంపాదించిన సొమ్ము ఎవరైనా దోచుకుపోతే ఎలా" అనే భయం మొదలైంది. దాంతో ఆ సొమ్మంతా పెట్టి అత్యంత ఖరీదైన కొన్ని వజ్రాలు కొన్నాడు. భూమి లోపల ఒక రహస్య గది నిర్మించి, దానికి దారి తనకు తప్ప ఎవరికీ తెలియకుండా ఏర్పాటు చేయించి, అందులో దాచాలి అనుకున్నాడు.
రాజ్యంలో భవనాలను అద్భుతంగా కట్టే ఒక శిల్పిని పిలిపించాడు. విషయం వివరించి "నాకు నాలుగు నెలల్లో అటువంటి అద్భుతమైన గదిని నిర్మించాలి. అంతవరకు నువ్వు ఈ రాజభవనం దాటిపోకూడదు. విషయం ఎవరికీ తెలియకూడదు. నీవు ఊహించనంత ధనం నీకు కానుకగా ఇస్తా. నువ్వు ఈ రోజు నుండి బైటికి పోవడానికి వీలు లేదు" అన్నాడు.
రాజు మాటకు ఎదురు చెబితే ఏమవుతుందో ఆ శిల్పికి బాగా తెలుసు. దాంతో ఏమీ చేయలేక 'సరే' అన్నాడు. తరువాత రోజు పక్క రాజ్యానికి చెందిన కొంతమంది కూలీలను కళ్ళకు గంతలు కట్టి తీసుకొని వచ్చి రాజభవనంలో వదిలారు. వాళ్లకు తాము ఎక్కడి నుంచి వచ్చామో, ఏమి చేస్తున్నామో, ఎవరి కోసం పని చేస్తున్నామో అస్సలు తెలియదు.
శిల్పి నాలుగు నెలల్లో రాజభవనం కింద ఎవరికి కనపడని విధంగా ఒక అద్భుతమైన గృహాన్ని నిర్మించాడు. దాని లోపలికి పోయే ద్వారాన్ని రాజు అంతఃపురంలో ఒక నిలువెత్తు అద్దం వెనుక ఏర్పాటు చేశాడు. మీట నొక్కగానే అద్దం పక్కకు జరిగి కిందికి వెళ్లడానికి మెట్లు కనపడేలా తయారుచేశాడు.
అదే సమయంలో శిల్పి ఇంకో ద్వారాన్ని కూడా తయారు చేశాడు. ఎవరైనా శత్రువులు దాడి చేసినప్పుడు పొరపాటున ఓడిపోయే పరిస్థితి వస్తే, లోపలి నుంచి వజ్రాలు తీసుకొని పారిపోయేలా ఆ ద్వారం పనికి వస్తుంది. ఒక ద్వారం రాజు అంతఃపురంలోనికి చేరితే ఇంకొక ద్వారం రాజభవనం వెనుక వున్న తోటలోనికి దారితీస్తుంది. మొదట మొదటి ద్వారం గురించి చెప్పి రాజు బహుమతిని అందించాక రెండో ద్వారం గురించి చెబితే రాజు సంతోషించి మరింత బహుమతి ఇస్తాడని భావించాడు.
అనుకున్నట్టుగానే మొదట రాజుకు అంతఃపురం లోని ద్వారం చూపించాడు. రాజు దానిని చూసి చాలా సంతోషపడ్డాడు. తన దగ్గర ఉన్న వజ్రాలన్నీ భూగర్భంలోని రహస్య ప్రదేశానికి తరలించాడు. ఆ తరువాత వేరే రాజ్యాల నుండి పిలుచుకొని వచ్చిన కూలీలకంతా ధనాన్ని ఇచ్చి కళ్ళకు గంతలు కట్టి వారి వారి రాజ్యాలలో వదిలివేయమని పంపించాడు.
"మహారాజా మీరు చెప్పినట్లే నాలుగు నెలల్లో ఈ రహస్య గృహాన్ని పూర్తి చేశాను. ఇక నాకు ఇవ్వవలసిన ధనాన్ని ఇస్తే మా ఇంటికి చేరుకుంటాను. పెళ్ళాం పిల్లల్ని చూడక చాలా రోజులైంది" అన్నాడు వినయంగా.
మహారాజు చిరునవ్వు నవ్వి "ఓ శిల్పీ! ఈ రహస్య గృహం గురించి నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కాబట్టి నిన్ను చంపేస్తే ఈ రహస్యం నా ఒక్కనికి మాత్రమే తెలుస్తుంది. ఏమీ అనుకోకు ఇది తప్పదు" అంటూ కత్తి తీశాడు.
శిల్పి అదిరిపడ్డాడు. రాజు కాళ్ళ మీద పడి "మహారాజా... మీకోసం అడిగినవన్నీ చేశాను. కనీసం నాకు ఒక్క రోజైనా బతికే అవకాశం ఇవ్వండి. నాకిష్టమైన ఆహారం తిని, మనసారా దేవుని ప్రార్థించి, చివరిసారిగా నా పెళ్ళాం బిడ్డల్ని చూసుకొని చనిపోతాను" అన్నాడు దీనంగా కళ్ళనీళ్ళతో.
రాజు కాసేపు ఆలోచించి "సరే ఉదయమే నీకు ఉరి. అంతవరకు చెరసాలలో ఉండు. నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను" అంటూ సైనికులను పిలిచి "కావలసిన ఆహారాన్నంతా తెప్పించండి. పెళ్ళాం బిడ్డలను పిలిపించి దూరం నుంచి చూపించండి. ఎవరితోనూ మాట్లాడనివ్వకండి" అని ఆజ్ఞాపించాడు.
సైనికులు 'సరే' అని తీసుకుపోయి కారాగారంలో వేశారు. ఆహార పదార్థాలు అన్నీ తెప్పించారు. పెళ్ళాం బిడ్డలను పిలిపించారు. దూరం నుంచే వాళ్ళను చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఒక సైనికున్ని పిలిచి "నేను చనిపోతే నా భార్యాపిల్లలు అనాథలవుతారు. ఇదిగో ఈ ఉంగరాన్ని వాళ్ళకి ఇవ్వు. ఇందులో చాలా ఖరీదైన వజ్రం ఉంది. దాన్ని అమ్ముకొని హాయిగా బ్రతకమను" అన్నాడు.
ఆ సైనికుడు కరిగిపోయి 'సరే' అని ఆ ఉంగరం తీసుకొని పోయి భార్యాపిల్లలకు అందించాడు.
కానీ అది మామూలు ఉంగరం కాదు. ఉంగరం పైన ఉన్న రాయిని కదిలిస్తే అందులో చిన్న అర ఉంటుంది. అందులో రహస్య గృహానికి రెండవ వైపు వున్న ద్వారం గురించి, చదివిన వెంటనే ఏం చేయాలో వివరంగా రాసిన చిన్న చీటీ ఉంది. ఆ ఉంగరం గురించి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు.
తర్వాత రోజు ఉదయాన్నే రాజు వచ్చాడు. "మహారాజా... నన్ను చంపేముందు మీ రహస్య గృహంలో వజ్రాలు ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. ఎందుకైనా మంచిది" అన్నాడు చిరునవ్వుతో శిల్పి.
ఆ నవ్వు చూసి రాజు అదిరిపడ్డాడు. అనుమానం పెరిగింది. వేగంగా పోయి చూస్తే ఇంకేముంది అంతా మాయం. రాజు అదిరిపడి కోపంగా పిచ్చివానిలా అరుచుకుంటూ వచ్చి కత్తి తీశాడు చంపడానికి.
"రాజా... తొందరపడి నన్ను చంపితే ఆ వజ్రాలు ఇక ఎప్పటికీ మీకు దొరకవు. నన్ను ప్రాణాలతో పక్కనే ఉన్న మీ శత్రురాజ్యంలో వదిలితే, ఆ సైనికునితో వజ్రాలు ఇచ్చి పంపుతాను. ఆ తరువాత మీ ఇష్టం" అన్నాడు.
"నువ్వు చెప్పేది నిజమే అని నమ్మేదెలా. మోసం చేస్తే" అన్నాడు మహారాజా.
"మోసం చేయడానికి నేను మీలా నమ్మకద్రోహిని కాదు. నిజాయితీగా సొంత సంపాదన మీద బ్రతికే శిల్పిని. నన్ను నమ్మడం తప్ప మీకు ఇంకో దారి లేదు" అన్నాడు.
రాజు ఏమీ చేయలేక ఆ శిల్పిని వదిలి వేశాడు. ఒక సైన్యాధికారిని తోడు ఇచ్చి పంపాడు. పక్క రాజ్యాన్ని చేరుకున్నాక పెళ్ళాం బిడ్డలను కలిశాడు.
శిల్పి కారాగారంలో పెళ్ళాం బిడ్డలు చూడడానికి వచ్చినప్పుడు ఒక ఉంగరం ఇచ్చి పంపాడు కదా... అందులో వున్న విషయం చదివిన వెంటనే కొడుకు రహస్యంగా రెండవ మార్గం నుంచి లోపలికి వచ్చి అక్కడున్న వజ్రాలన్నీ తీసుకొని వెంటనే ఊరు వదిలి పక్క రాజ్యానికి చేరుకున్నాడు.
శిల్పి ఆ సైన్యాధికారికి ఆ వజ్రాలతో పాటు ఇచ్చి ఒక చిన్న చీటీ ఇచ్చి రాజుకు అందజేయమన్నాడు. అందులో "రాజా... మీ సొమ్మంతా తిరిగి మీకు అందిస్తున్నాను. కానీ కష్టపడి ఆ భూ గృహాన్ని కట్టించినందుకు కూలీగా ఒక వజ్రాన్ని, మీరు నన్ను మోసం చేసినందుకు ప్రతిఫలంగా ఇంకొక వజ్రాన్ని తీసుకుంటున్నాను" అని ఉంది.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment