Saturday, January 11, 2025

 చూపున్న మాట 
ఫ్యాటీ లివర్‌తో మధుమేహం, గుండె జబ్బులు
ప్రఖ్యాత హెపటాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ శివకుమార్‌ సరిన్‌
‘ఓన్‌ యువర్‌ బాడీ’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ జీవీ రావు, బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, రచయిత డాక్టర్‌ శివకుమార్‌ సరిన్‌

ఈనాడు, హైదరాబాద్‌: మధుమేహం, గుండె జబ్బులకు కాలేయ కొవ్వు(ఫ్యాటీ లివర్‌) సమస్య ఒక కారణమని ప్రఖ్యాత జీర్ణకోశ, కాలేయ వ్యాధి నిపుణులు(హెపటాలజిస్ట్‌), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌(ఐఎల్‌బీఎస్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శివకుమార్‌ సరిన్‌ అన్నారు. జనాభాలో 30 శాతం మంది ఫ్యాటీ లివర్‌ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీన్ని నియంత్రించడం ద్వారా మధుమేహం, గుండె వ్యాధులకు దూరంగా ఉండవచ్చనన్నారు. ఫ్యాటీ లివర్‌ సమస్య దీర్ఘకాలంలో కాలేయ సిరోసిస్‌కు, వైఫల్యానికి దారితీస్తుందన్నారు. మెడ వెనుక నల్లని గీత మాదిరిగా ఏర్పడితే.. ఇన్సులిన్‌ నిరోధకతకు సూచిక అని, మున్ముందు మధుమేహం, గుండె వ్యాధులు రావడానికి దాన్ని గుర్తుగా భావించాలని సూచించారు. సరిన్‌ రాసిన ‘ఓన్‌ యువర్‌ బాడీ’ పుస్తకాన్ని గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో గురువారం ఆవిష్కరించారు. ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, సైయెంట్‌ సంస్థ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ జీవీ రావు పాల్గొన్నారు. అనంతరం ‘ఓన్‌ యువర్‌ బాడీ’ పుస్తకంపై రచయిత డాక్టర్‌ సరిన్, డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి చర్చించారు. సమతుల ఆహారం తీసుకోవడం, నిత్యం గంటపాటు చమట పట్టేలా వ్యాయామం చేయడం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల కాలేయ కొవ్వు సమస్య ఉత్పన్నం కాదని డాక్టర్‌ సరిన్‌ అన్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర జన్యు సంబంధ వ్యాధులుంటే.. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకున్న తర్వాతే పిల్లలను కనే విషయంపై ఆలోచించాలన్నారు. ప్రతి ఆదివారం సినిమాలు, షికార్లు, ఫ్యామిలీ హెల్త్‌ ప్రోగ్రాం నిర్వహించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన అలవాట్లపై చర్చించుకొని కుటుంబ సభ్యులకు స్కోరింగ్‌ ఇవ్వాలన్నారు. అధిక స్కోరింగ్‌ సాధించిన పిల్లలను అభినందించాలన్నారు. ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాటీ లివర్‌ సమస్యపై ఏఐజీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల వద్ద ప్యాకెట్, జంక్‌ ఫుడ్స్‌ విక్రయించకుండా నిషేధం విధించాలన్నారు. డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ శరీర ఆరోగ్యానికి తామే బాధ్యులమని గుర్తించాలన్నారు.

No comments:

Post a Comment