Friday, January 10, 2025

 విజేతల గొంతు 
బలంగా గర్వంగా అతిశయంగా  ఉంటుంది

వాళ్ల కథలు 
వినిపించడానికీ రాయడానికీ 
కవులూ కథకులూ బారులు తీరి ఉంటారు

గాయకులు వందిమాగదులు
బాజా భజంత్రీలు సర్వదా విజేతల వెంట సిద్ధం

పరాజితుల గొంతు 
బలహీనంగా ఉంటుంది
దుఃఖంతో పెనుగులాడుతూ ఉంటుంది

వాళ్ళ కథలు 
ఎవ్వరూ రాయరు 
వాళ్లే రాసుకోవాలి మరి


అమిష్ త్రిపాఠి కి 
పూర్తిగా భిన్నమైన రచయిత
ఆనంద నీలకంఠ 

ఇతిహాసాలను 
పరాజితుల కోణం నుంచి 
వ్యాఖ్యానించాడాయన

***********

యుద్ధభూమిలో 
నిస్సహాయుడై పడి ఉండి
ఎలుకలు తన కండరాలను నమ్ములుతుండగా ...
మృత్యువు తన దేహం పై పురుగులా పారాడుతుండగా ....

రావణుని నోట తన కథను 
'అసురుడు' గా చెప్పించాడాయన

రామాయణం కొత్త కాదు మనకు 
రావణుని నోట వినటమే కొత్త. 

అహంకారం గర్వం 
సమస్త దుర్గుణాలు మూర్తీభవించిన దుర్యోధనుడు ....

అని లోకమంతా భావించే 
సుయోధనుని అంతరంగాన్ని
 'అజేయుడు' గా 'కలియుగారంభం' గా ఆవిష్కరించాడాయన 

మహాభారతం 
కొత్త కాదు మనకు 
పంచమ వేదాన్ని పరాజితుల ఇతిహాసంగా వినటమే కొత్త

********

వాల్మీకి అయినా 
వేద వ్యాసుడే అయినా
 
మచ్చ లేనివారీగా 
చిత్రించలేదు తమ కథా నాయకులను

మూర్తిభవించిన దుర్మార్గులుగా 
పోత పోయలేదు తమ ప్రతి నాయకులను 

మానవ మాతృలుగానే
సకల మానసిక వికారాలచే
పీడింపబడే వారిగానే చిత్రించారు ఇరువురిని 

వారి చేతిలో 
ఆయా పాత్రలు ఆట బొమ్మలు మాత్రమే ...

ఆ యుగపు ధర్మమే 
అసలైన కథానాయకుడు 
రామాయణ మహాభారత ఇతిహాసాలలో

***********

ఆధునిక 
యుగ ధర్మపు వెలుగులో ...

ప్రాచీన 
యుగ ధర్మానికి 
ఆకరాలైన రామాయణ మహా భారతాలను 

పరాజితుల 
దృష్టి కోణంలో నుంచి
వ్యాఖ్యానించటమే .....

అదీ....
అత్యంత సహజంగానూ 
వాస్తవికంగానూ తార్కికంగా నూ
వ్యాఖ్యానించడమే...

ఆనంద నీలకంఠ చేసిన పని 

- రత్నాజేయ్ (పెద్దాపురం)

No comments:

Post a Comment