వైరస్ కు కూడా సీక్వెల్స్ ఉంటాయి .
కరోనా - 1 ..
కరోనా -2 ..
ఈ రెండు ... పాండెమిక్ దశలు .
అటు పై కరోనా - ౩ అంటే ఓమిక్రాన్ వచ్చింది .
మనం లెక్క వేసుకోలేదు కానీ... ఇప్పటికి కరోనా 4 , 5 , 6 వచ్చి పోయి ఉంటాయి . ఇది ఎండెమిక్ దశ .
రెండు దాటితే.. పాండెమిక్ ... ఎండెమిక్ అయిపోతుంది .
పాండెమిక్ కు... ఎండెమిక్ కు తేడా తెలుసుకోవడం అవసరం .
వైరస్ తొలిసారిగా పుట్టినప్పుడు { కరోనా విషయం లో పుట్టించినప్పుడు అని వాడాలి } అది పాండెమిక్ అయ్యే అవకాశముంది .
గాలి ద్వారా వ్యాపించేది.. అంటే శ్వాసకోస సంక్రమణ . సహజంగానే వేగంగా విస్తరిస్తుంది .
వైరస్ ను చంపే మందు ఇప్పటి వరకు రాలేదు .
భవిషత్తు లో రావడం అంత ఈజీ కాదు .
వైరస్ వేగంగా సంతానోత్పత్తి చేయకుండా... ఇతర కణాలకు చొరబడకుండా చేసే మందులు మాత్రం వచ్చాయి .
కాబట్టి అది వందేళ్ల నాటి స్పానిష్ ఫ్లూ కావొచ్చు . మొన్నటి కరోనా కావొచ్చు .
వైరస్ ను చంపింది మనుషుల శరీరంలోని ఇమ్మ్యూనిటి వ్యవస్థే .
అదే సోలో హీరో .
వ్యక్తి ఇమ్మ్యూనిటి... బాహుబలి లా బలీయంగా ఉంటే... కనీసం మాదిరిగా ఉంటే.. వైరస్ చచ్చి ఊరుకుంటుంది. ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉన్న వారు పండెమిక్ దశలో మరణిస్తారు .
పండెమిక్ దశలో వైరస్ ఇంచు మించు జనాభా మొత్తానికి సోకుతుంది . { ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించే కరోనా లాంటివి } కనీసం ఎనభై శాతానికి సోకినప్పుడు హెర్డ్ ఇమ్మ్యూనిటి వస్తుంది .
వైరస్ సోకినప్పుడు... ఇమ్మ్యూనిటి కనీసం ఒక స్థాయిలో ఉన్నవారు బతుకుతారు అని చెప్పుకొన్నాము కదా .
వీరి ఇమ్మ్యూనిటి వైరస్ తో పోరాడి విజయం సాధించింది .
ఇమ్మ్యూనిటీ కి సెల్ఫీ పిచ్చి .
అదే మానవాళిని కాపాడేది .
మనకైతే సెల్ఫీ పిచ్చి... ఇటీవలి కాలం లో వచ్చింది .
మన ఇమ్మ్యూనిటీ కి అనాదిగా ఉంది.
వైరస్ అంటే శత్రువు కదా . శత్రువు ను చంపుతున్నప్పుడు అది సెల్ఫీ తీసుకొని భద్ర పర్చుకుంటుంది .
సెల్ఫీ అంటే సెల్ఫీ కాదు లెండి .
సైన్స్ విషయాలు మీకు ఆసక్తి కరంగా సులభంగా అర్థం అయ్యేందుకు ఆలా చెప్పాను.
ఇమ్మ్యూనిటి కి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది . ఇమ్మ్యూనిటి లోని మెమరీ - బి సెల్స్ , మెమరీ- టి సెల్స్ వైరస్ ను గుర్తు పెట్టుకొంటాయి .
దీన్నే ...టి సెల్స్ రక్షణ... అని అని నేను కరోనా కాలంలో పుంఖానుపుంఖాలుగా రాసాను .
ఒక్కసారి వైరస్/బాక్టీరియా సోకితే టి సెల్స్ రక్షణ వచ్చేస్తుంది .
టి సెల్స్ ఆ రోగకారక జీవిని గుర్తుపెట్టుకొని ఇంకో సారి సోకితే టక్కున చంపేస్తాయి .
అంటే వైరస్, బాక్టీరియా లాంటి రోగకారక జీవులకు ఒకే ఒక ఛాన్స్. అప్పుడే దాని బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ .
సీక్వెల్ తీసి రెండో సారి మూడో సారి సోకితే ప్లాప్ అయ్యే అవకాశం ఎక్కువ
అందుకే పాండెమిక్ దశ దాటితే వచ్చేది ఎండెమిక్ దశ .
పాండెమిక్ లో ఒకటా? రెండా?
ఎన్ని వేవ్ లు ?
అనేది మొదటి దశలో వ్యాధి ఎంత మందికి సోకింది? అనే దాని పై ఆధారపడుతుంది . కరోనా మొదటి వేవ్ లో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ... పాకిస్థాన్ ... హైదరాబాద్ పాతబస్తీ లాంటి చోట్ల ఎక్కువ మందికి సోకడం .. హెర్డ్ ఇమ్మ్యూనిటి రావడం జరిగిపోయింది . ఇక్కడ తొలి దశలోనే ఎక్కువ నష్టం జరిగింది .
రెండో దశ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు . అదే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొన్న చోట్ల హెర్డ్ ఇమ్మ్యూనిటీ రాక రెండో దశ అరివీర భయంకరం అయ్యింది .
ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే ముందుగా పాండెమిక్ దశ .
అటు పై ఎండెమిక్ దశ .
ఎండెమిక్ దశ అంటే వైరస్ పోదు .
వైరస్ పోతుంది అనుకోవడం మన అమాయకత్వం .
పండెమిక్ దశ తరువాత అది మన మధ్య స్థిరపడిపోతుంది .
మన శరీరాల్లో అప్పటికే దానికి సంభందించిన సహజ ఇమ్మ్యూనిటి ఉంటుంది .
అదేనండి టి సెల్స్ రక్షణ .
దానితో వైరస్ తోక ముడిస్తుంది .
మరీ బలహీనమయిన ఇమ్మ్యూనిటి వ్యవస్థ వున్నవారిని తప్పించి అది సీక్వెల్ లో ఎవరినీ ఏమీ చేయలేదు ..
అంటే వారి ఇమ్మ్యూనిటీ ఇటీవల బాగా బలహీనం అయి ఉంటే టి సెల్స్ రక్షణ కూడా ఏమీ చేయలేదు . అలాంటి వారే ఎండెమిక్ దశలో కూడా చనిపోతారు .
HMPV - దీన్ని గుర్తించింది 2001 . దానికి కనీసం యాభై ఏళ్ళ ముందు నుంచి ఇది ఉందని శాస్త్రవేత్తల అంచనా.
ఇది గాలి ద్వారా సోకే వైరస్ .
మన దేశం లో జనాభా, జనసాంద్రత ఎక్కువ .
ఇన్నాళ్లు ఇది చాప వేసుకొని పడుకొని ఉంటుందా ?
అప్పట్లో సరిగా రికార్డు చేయలేదు కానీ ఇది ఏనాడో ... అంటే మన తాత గారి కాలం లోనే పాండెమిక్ దశ దాటి ఎండెమిక్ అయిపోయుంటుంది ?
2 తరువాత... 1 ఎలా వస్తుంది పుష్పా?
HMPV ఇప్పుడు పండెమిక్ కాబోతుంది అని ప్రచారం .
ఎండెమిక్ అయ్యింది... పండెమిక్ ఎలా అవుతుంది ?
ఇది మనందరికీ ఏనాడో సోకి ఉంటుంది .
ఒకటి కాదు... అనేక సార్లు సోకివుంటుంది .
దీనికి సంభందించిన టి సెల్స్ రక్షణ మనకు ఉంది .
ఇంకో మాట .
హీరో గారు పిల్లి గడ్డం పెట్టుకొని వస్తే... విలన్ గుర్తించలేడు... . ఇది సినిమాల్లో .
కానీ ఇది నిజజీవితం . ఇక్కడ ఉన్నది బాహుబలి ఇమ్మ్యూనిటి హీరో .
వైరస్ ఎన్ని వేషాలు వేసినా.. అంటే ఎన్ని మ్యుటేషన్ లు పొందినా బి సెల్స్, టి సెల్స్ టక్కున పట్టేస్తాయి .
ఇది ఖాయం .
కాబట్టి HMPV పండెమిక్ కాబోదు .
టెస్ట్ లు చేస్తే కేవలం నాలుగు నగరాల్లో కాదు. ఊరువాడా దీని ఆనవాళ్లు కనిపిస్తాయి .
ఇప్పుడు .. ఆ మాటకొస్తే ఎప్పుడూ... కావలసింది బలమైన ఇమ్మ్యూనిటి వ్యవస్థ .
అదే శ్రీరామ రక్ష.
1 . భయానికి ... స్ట్రెస్ కు దూరంగా ఉండండి.
ఇవి ఇమ్మ్యూనిటి ని చంపేస్తాయి .
టీవీ గొట్టాలముందు కూర్చుని" కరోనా చంపేస్తుంది" అని భయపడిన వారిలో చాలా మంది నేడు మన మధ్య లేరు .
అదే తప్పు చెయ్యొద్దు .
2 . డి విటమిన్ కీలకం . కనీసం అరగంట ఎండలో నడవండి . సాయంకాలం లేదా పొద్దున్న వాకింగ్ .
వీలు కాకపోతే డి విటమిన్ టాబ్లెట్ .
3 . వ్యాయామం తప్పని సరి . జిం లేదా యోగ . కనీసం నడక . సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కాదు . వేగంగా నుదుట చెమట పట్టేలా నడవాలి . లేదా కనీసం ఇంటి పని.. వంటపని చెయ్యండి .
4 . సి విటమిన్ కోసం .. నిమ్మ నారింజ . జింక్ కోసం మూడు నాలుగు ఎండు ద్రాక్ష లేదా గుమ్మడి విత్తనాలు . ప్రోటీన్ కోసం చికెన్, ఎగ్... శాఖాహారులు పన్నీర్ , పుట్టగొడుగులు
.పురుషులు నాలుగు.. స్రీలు మూడు లీటర్ ల నీరు .
5 . కనీసం ఏడు గంటల నిద్ర .
6 తెల్లనం తగ్గించండి . మైదా వద్దు . రాగులు జొన్నలు దంపుడు బియ్యం . ఆదీ పరిమితంగా . ఆకుకూరలు కాయగూరలు సమృద్ధిగా .
ముక్కు దిబ్బడ , ముక్కునుంచి చీమిడి కారడం , దగ్గు , గొంతు నొప్పి 102 డిగ్రీ ల దాక జ్వరం , తలనొప్పి నీరసం . ఇవి HMPV మైల్డ్ లక్షణాలు .
దగ్గు బాగా పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టం అయినప్పుడు... 102 దాటిన జ్వరం... కండరాల నొప్పలు... పెదాలు, వేళ్ళు నీలంగా మారడం... వాంతి ... పైకి లేవలేనంత నీరసం .. ఇవి వ్యాధి బాగా ముదురుతోంది అని చెప్పే లక్షణాలు .
ఇలాంటి స్థితి లో డాక్టర్ ను సంప్రదించడం అవసరం .
ఈ అవసరం బహుశా వెయ్యిలో ఒకరికి ఏర్పడొచ్చు .
సర్వే జనా సుఖినోభవంతు !
No comments:
Post a Comment