*అరుంధతి*
అరుంధతి పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన రోజునే గరిటె చేతికిచ్చి వంటగది అప్పగించింది అత్తగారైన సుందరమ్మ.
వంట వండి వడ్డించడం కష్టమనిపించలేదు...పుట్టింట్లో సవతి తల్లి పెంపకంలో పెరిగిన ఆమెకు.
పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన అరుంధతి నానమ్మ సంరక్షణలో రెండు సంవత్సరాలు పెరిగింది. తర్వాత సవతి తల్లి జగదాంబ ఆ బాధ్యత స్వీకరించింది.
మారుటి తల్లి అనగానే సహజంగా...మనకు కథల్లోను... సినిమాల్లోను...చూపించే విధంగానే ఉంటారు... ఏ కొద్దిమందో తప్పించి. అయితే జగదాంబ మంచితనం
అనే ముసుగులో అరుంధతిపై అక్కసు తీర్చుకునేది.
భార్య పోయి పైగా పిల్లకూడ ఉన్న గంగాధరాన్ని పెళ్ళిచేసుకోను అని అరిచి గోలపెట్టిన...తలవంచక తప్పలేదు. ఆర్థిక ఇబ్బందులు అలాంటివి. పౌరోహిత్యం తప్ప వేరే ఆధారం లేని నరసింహమూర్తి ముగ్గురు కూతుళ్ళలో జగదాంబ పెద్దది.
ఇంట్లో అత్తగారు, మొగుడు, ఇరుగు పొరుగువారికి తనపై చెడ్డ అభిప్రాయం కలగకూడదని భావించి పిల్లను కొట్టి తిట్టి హింసించలేదు. అక్కడికి అరుంధతి అదృష్టవంతురాలనే చెప్పవచ్చు.
జగదాంబకు కొడుకు పుట్టాక ఇక పిల్లలు అక్కర్లేదు... అనుకుని గంగాధరం వేసెక్టమీ చేయించుకున్నాడు. ఆ విషయం తర్వాత తెలిసి...ఆమె అరుంధతిపై మరింత
కక్ష పెట్టుకుంది.
అరుంధతిని మున్సిపల్ స్కూలులోను తన కొడుకును ఇంగ్లీషు మీడియం కాన్వెంట్ లోను వేయించింది.
అరుంధతికి ఊహ తెలిసినప్పటినుంచి జడవేసుకుని పూవులు పెట్టుకోవాలని సరదా పడేది. కాని తనంతట తను జడవేసుకోవడం వచ్చేవరకూ జుట్టు కట్ చేయించేసేది జగదాంబ.
సెవెన్తు అయి...ఎయిత్ కొచ్చాక జుట్టు పెంచుకోనిచ్చింది. పువ్వులు అంటే ఆపిల్ల కిష్టమని తెలిసి కొనడం మానేసింది. తనుకూడ పెట్టుకోవడం మానేసింది. పువ్వులనే కాదు కట్టుకునే బట్టయినా తినేతిండయినా సరే...
తన ఇష్టప్రకారమే చేసేది.
తండ్రి దగ్గర పెద్దగా చనువు లేదు ఆమెకు. ఇక నాయనమ్మ
ఎప్పుడూ తీర్థయాత్రలంటూ తిరిగేది. ఇంట్లో ఉన్న కొద్దిరోజులు పూజలు మడి ఆచారం జపం అంటూ ఉండే ఆమెతో కూడ చనువు లేదు.
తమ్ముణ్ని కూడ తనతో ఆడుకోనిచ్చేదికాదు జగదాంబ.
ఇంట్లో ఒంటరితనం అలవాటయిన ఆమె...స్కూలులో
ఎవరితోను కలవలేకపోయేది.
టెన్త్ అయ్యాక...జగదాంబ తన ఒంట్లో బాగోడం లేదని డాక్టరు రెస్ట్ అవసరమన్నారని చెప్పి... ఆమె చదువు మానిపించి పనిలో సాయం చేయమంది.సాయం అందే
కాని... పనంతా అరుంధతి చేతే చేయించేది.
గంగాధరానికి ఊరి రాజకీయాలు కావాలి గాని ఇంట్లో
ఏం జరుగుతోంది...పట్టించుకొనేవాడు కాదు.
అయిదు వసంతాలు గడిచాయి. అరుంధతి నానమ్మ కాలంచేసింది.
ఆవిడ పోయినప్పుడు పరామర్శకు వచ్చినవాళ్ళలో సుందరమ్మ ఒకతె. జగదాంబకు వరసకు పిన్ని అవుతుంది. అరుంధతిని చూసి తన కొడుక్కి చేసుకుంటానంది. ఇద్దరు మాట్లాడుకుని సంబంధం
ఖాయం చేసుకున్నారు.
సంవత్సరం తిరగకుండా సింపుల్ గా...
పెళ్లిచేసి పంపించేసింది
పెళ్లిలో అయినా పూవులు పెట్టుకునే సరదా తీరలేదు అరుంధతికి. పెళ్లికూతురుకు పూలజడ ఆర్డరివ్వడం విని తనకోరిక తీరుతోందని ఆనందిస్తోన్న ఆమె ఆశ నిరాశే అయ్యింది. గౌరీ పూజకు టైమయిపోయిందని కూర్చోపెట్టేసారు.
సాయంకాలం తేవలసిన పూలజడ రాత్రి ఎనిమిదయినా తేకపోవడానికి కారణం జగదాంబేనని... ఆర్డరిచ్చినట్లు
ఫోన్లో మాట్లాడడం వట్టినాటకమేనని... ఎలాతెలుస్తుంది...అరుంధతికే కాదు ఎవరికైనానూ...
పూలజడరాలేదు సరికదా కనీసం పూలమాలైనా తలలో తురుముదామంటే మిగిలితేగా... అప్పటికే అందరకూ పంచేయడంతో.
ఆవిధంగా పూవులు పెట్టుకోవాలనే
సరదా పుట్టింట్లో తీరలేదు.
ఇక అత్తింట్లో కూడ పువ్వులు పెట్టుకునే భాగ్యానికి నోచుకోలేదని వారంరోజులయేసరికి తెలిసొచ్చింది.
సాయంత్రం మొగుడు ఇంటికొచ్చేటప్పుడు పూవులు కొనితెమ్మని అడిగిన ఆమెకు అమ్మతో చెప్పు అన్న అతని మాటలవలన... ఈ జన్మకు తన కోరిక తీరదని అర్థమయిందామెకు.
అత్తగారు ప్రతిరోజూ ఉదయం పూజకోసమని వీధిలో కొచ్చే పూవులు, పూలదండలు తీసుకొని పటాలకు దండలు వేయడమే తప్పించి చిన్నముక్కయినా తుంచి తలలో పెట్టకోమని ఈవారం రోజుల్లో ఒక్కరోజయినా అనలేదు.
బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన అతనికి తల్లే ప్రపంచమయింది. ఆమె ఎంతంటే అంతే తప్ప తనకంటూ
ఓ వ్యక్తిత్వం లేదాయె...
అయిదు సంవత్సరాల్లో ఇద్దరు మొగపిల్లలకు తల్లయింది.
శంకరం, విష్ణుమూర్తి అనే పేర్లు అత్తగారు పెట్టినవే. ఇంటి పని... పిల్లల ఆలన పాలన...చదువులు...వీటితో రోజంతా సరిపోయేది. పెద్దబ్బాయి చదవవగానే కర్నాటకలో జాబ్ వచ్చి వెళ్లేడు. అక్కడే తనకిష్టమయిన అమ్మాయి కావ్యను స్నేహితుల సమక్షంలో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు
నానమ్మ పెత్తనం, అమ్మ అణుకువ, తండ్రి ఉదాసీనత జ్ఞానం వచ్చిన దగ్గరనుంచి గమనిస్తున్న అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. తల్లంటే చాలా ఇష్టం అతనికి.
ఈ సంగతులన్నీ పెళ్లికి ముందే కావ్యకు చెప్పాడు.
ఎవరి కష్టసుఖాలతోను ఇష్టాయిష్టాలతోను సంబంధం లేని కాలం ముందుకు సాగింది. చిన్నకొడుక్కు కూడ జాబ్ రావడం...తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లిచేసుకోవడం... సుందరమ్మ కాలు నోరు పడిపోయి పక్షవాతం వచ్చి మంచంలో చేరడం...
అయిదు పదులు దాటిన అరుంధతి పళ్ళెంలోని కనకాంబరాలు మల్లెలు కలిపి మాలకడుతోంది.
శంకరం తండ్రయాడు. కావ్య పుట్టింట్లో వుంది. బాబుకు అయిదునెలలు నిండాక శంకరం వెళ్లి కొడుకును భార్యను తీసుకుని తల్లిని చూడ్డానికి వచ్చాడు.
మరునాడు సాయంత్రం వాళ్ళు బయలుదేరి వెళ్తూన్న సమయంలో వీధిలో పూవులవాని కేక విని కావ్య మల్లెలు కనకాంబరాలు తీసుకుని
"అత్తయ్యా! ఎప్పుడు వచ్చినా మీరు సిగలో పూవులు తురుముకోగా చూడలేదు...
వీటిని మాలకట్టి ఇచ్చేందుకు నాకు టైమ్ లేదు.
మీరే మాలకట్టి తురుముకొని ఫోటో తీసి పంపండి"
ఈమాటలు మంచంలో ఉన్న సుందరమ్మ వింటూనే ఉంది.
బయలుదేరి వెళ్ళిపోయారు వారు.
మాలకట్టి లేచింది. అద్దం తెచ్చుకుందామని లోపలకు వెళ్ళబోతూ అత్తగారిని చూసింది. ఆవిడ తదేకంగా తననే చూస్తోంది. వెంటనే గోడకు తగిలించి ఉన్న రాములవారి పటానికి ఆ దండ తగిలించి చేతులు రెండూ జోడించింది.
***
*కమలాదేవి* *పురాణపండ*
No comments:
Post a Comment