Sunday, January 19, 2025

 Vedantha panchadasi:
సప్తమము:
        తృప్తిదీప ప్రకరణము
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఆత్మానం చేద్విజానీయాదయమస్మీతి పూరుషః ౹
కిమిచ్ఛన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్ ౹౹ 1 ౹౹

1. 'పురుషుడు తన ఆత్మను పరమాత్మయే కదా అని తెలిసికొనినచో ఇక దేనిని కోరి ఎవని కోరిక కొరకు శరీరతాపములను అనుసరించి తపించును? '
బృహ:ఉప.4.4.12.ప్ర.14.5.

అస్యాః శ్రుతేరభిప్రాయః సమ్యగ్రత విచార్యతే ౹
జీవన్ముక్తస్య యా తృప్తిః సా తేన విశదాయతే ౹౹ 2 ౹౹

2. పైన చెప్పిన శ్రుతివాక్యపు అభిప్రాయము ఈ ప్రకరణమున చక్కగా విచారింపబడును.దాని వలన జీవన్మక్తుని తృప్తి,ఆనందము, విశదమగును.

మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతత్వతః ౹
కల్పతావేవ జీవేశౌ తాభ్యాం సర్వం ప్రకల్పితమ్ ౹౹ 3 ౹౹

3. బ్రహ్మమును ప్రతిఫలించు మాయ జీవుని ఈశ్వరుని కల్పించును. జీవేశ్వరులు సమగ్ర ప్రపంచమును సృష్టింతురు అని శ్రుతి చెప్పును.
నృసింహ ఉత్తర తాపనీయ ఉప.9.

వ్యాఖ్య:- ఈ ప్రకరణము నందు 
"ఆత్మానం విజానీయాత్" - అనే  
శ్రుతిని గూర్చి విపులంగా వ్యాఖ్యానింప బడుతోంది.
ఎందుకోసమంటే,

ఈ విధమైన విచారణవల్ల జీవన్ముక్తునికి శ్రుతియందు చెప్పబడినట్టి నిరతిశయానందరూపమైన తృప్తి స్పష్టంగా కలుగుతుంది కాబట్టి !

 " నేనే నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడనైన బ్రహ్మను, అని తెలుసుకున్న వాడు ఇక కోరేదేమి ఉంటుంది ?"
"ఏ భోగాలకోసం ఈ శరీరము వెంటబడి సంతృప్తుడౌతాడు ?" అంటే,

అతనికి కోరవలసినవేవీ ఉండవు.దేనిని గూర్చియు దుఃఖింపడు.దేనిని గూడా వాంఛింపడు.శుభాశుభములను ఆశింపరు. వ్యవహారములన్నియు చేయుచూ,వాస్తవముగ దేనిని చేయనివారే యగుదురు.

"ఆత్మబోధ కలిగిన వానిని జన్మ జరాది దుఃఖాలు బాధింపవు" - అని భావము.

"పురుషుడు తన ఆత్మను పరమాత్మయే" - అని తెలుసుకొనిన కోరవలసిన దేమున్నది ?

వ్యాఖ్యానానికి  -
పదచ్ఛేదము, 
పదార్థోక్తి,
విగ్రహము,
వాక్యయోజన,
ఆక్షేపానికి సమాధానం అనే అయిదు లక్షణాలు ఉంటాయి.
పైన చెప్పబడినట్టి శ్రుతివాక్యంలో ప్రయోగింపబడిన "పురుషుడు"
అనే పదం యొక్క అర్థాన్ని చెప్పటానికి పూర్వం ,
దానికి ఉపోద్ఘాత రూపంలో ఉండే సృష్టిని గూర్చి సంక్షేపంగా చెప్పుకుందాం -

మాయ అనేది చిదాభాసద్వారా జీవేశ్వరుల నిర్మాణం చేస్తుంది -
అని శ్రుతి చెపుతొంది.
"జీవేశా వాభాసేన కరోతి మాయా చ స్వయమేవ భవతి" - నృ.ఉ.తా.9.అందుచేత జీవుడు,ఈశ్వరుడూ కూడా కల్పింపబడ్డవారే !
ఆ ఇరువురి చేతనూ ఈ సంసారమంతా కల్పింపబడ్డది.

పురమునందు, శరీరము నందు ఉండునది పురుషుడు.
వ్యష్టి శరీరమైన జీవుడు,
సమిష్టి శరీరమైన ఈశ్వరుడు అని పురుష శబ్ధమునకు అర్థము.
చూ.ప్ర.1.15. -17.

ఈక్షణాది ప్రవేశాన్తా సృష్టిరీశేన కల్పితా ౹
జాగ్రదాది విమోక్షాన్తః సంసారః జీవకల్పితః ౹౹4౹౹

4. సంకల్పము మొదలు ప్రవేశము వరకు గల సృష్టిని ఈశ్వరుడు కల్పించెను. జాగ్రదవస్థ మొదలు మోక్షము వరకు గల సంసారమును జీవుడు కల్పించెను.
చూ. ప్ర.6.213. 
వరాహ. ఉప. 2.54.

వ్యాఖ్య:- ఈ క్షణం మొదలుకొని, 
ప్రవేశం జరిగే సృష్టి ఈశ్వర రచన.ఇక ,
జాగ్రత్తునుండి మోక్ష పర్యంతం జరిగే సంసారమంతా జీవసృష్టి. అంటే -

"తదేవైక్షత బహుస్యాం ప్రజాయేయ" -ఛాం 6-2-3.(పరమాత్మ తాను అనేకం కావాలి అని ఆలోచించాడు) అంటూ ప్రారంభించి "
"అనేన జీవేనాత్మనాను 
ప్రవిశ్య " ఛాం.6-3-2.
(అతడు జీవాత్మ రూపంలో ప్రవేశించి నామరూపాలను వ్యక్తంచేసాడు)అన్నంతవరకు జరిగిన సృష్టి అంతా ఈశ్వర నిర్మితం.

"స ఏష మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వమ్,
స్త్రీయన్నపానాది విచిత్రభోగైః స ఏవ జాగ్రత్పరి తృప్తిమేతి. - 
స్వప్నే ఽపి జీవః సుఖదుఃఖభోక్తా స్వ మాయయా కల్పిత జీవలోకే, సుషుప్తికాలే సకలే విలీనే తమోఽ భి భూతః సుఖరూప మేతి.పునశ్చ జన్మాన్తర కర్మభోగా త్స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః, పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం విచిత్రం; ఆధార మానన్ద మఖన్డ బోధం యస్మింల్లయం యాతి పురత్రయంచ." -
కైవల్య.12 - 14.

 -- ఈ జీవాత్మ, విమోహితమై ఆసక్తితో కూడి శరీరంలో ఉండి అన్ని పనులూ చేస్తూ ఉంటుంది. జాగ్రదవస్థలో స్త్రీ,అన్నపానాదులు,విషయ భోగాలతో తృప్తి ననుభవిస్తూ ఉంటుంది.అట్లాగే,

స్వప్నంలో సైతం,తన మాయచేత కల్పింపబడిన సుఖదుఃఖాలకు భోక్త అవుతుంది.

ఇంద్రియాలన్నీ సుషుప్తిలో లీనమైపోగా,అజ్ఞానం అనే తపస్సుచేత ఆవరింపబడి సుఖరూపాన్ని పొందుతుంది.
మళ్ళీ జన్మాంతరాల్లో , సంపాదించుకొన్న పాప పుణ్యాలను బట్టి స్వప్నాన్నో, జాగ్రత్తునో పొందుతొంది.

ఇలా,జాగ్రదాదిగా,అనేక విధాలుగా క్రీడిస్తూ ఉంటే జీవుడు,మనోమయ జగత్తుకు రచయిత.అతడే జాగ్రదాదిగా ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తూ చివరకు "నేనే బ్రహ్మను" అనే జ్జానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు.

ఇలా జాగ్రదాది మోక్షపర్యంతం జరిగే సృష్టి అంతా జీవ రచన -
అని భావం.    

No comments:

Post a Comment