☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
123. ధర్మాన్నప్రమదితవ్యం...
ధర్మ విషయంలో ఏమరపాటు కూడదు (ఉపనిషద్వాక్యం)
ధర్మము ద్వారా చిత్తశుద్ధి, తద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు, దాని వలన మోక్షం... ఇదీ క్రమం. అందుకే ధర్మం విషయంలో ఏమరపాటు కూడదు అని వేదమాత చేసిన బోధ.
-
వేదాధ్యయనం చేసిన శిష్యునకు గురువు చెబుతున్న మాటలలో ఇది ఒకటి.అలసత్వం చేత, లోభం చేత, అజ్ఞానం చేత, తాను జ్ఞానిననే భ్రమచేత కొందరు ధర్మమయమైన కర్మమార్గాన్ని విడిచిపెడతారు. వారిని "భ్రష్టులు" అని అంటారు.ధర్మభ్రష్టునికి సద్గతి లేదు.
సర్వం బ్రహ్మమయం... అనే స్థితికి చేరుకున్న త్రిగుణాతీతుని స్థితి వేరు. ఆ స్థితికి చేరకుండా కేవల శాస్త్రజ్ఞానంతో వేదాంతాన్ని వల్లెవేస్తూ, లోకంలో తిరిగే వారు మాత్రం భ్రమప్రమలతో 'ఏమరపాటు'కి లోనుకాకూడదు. ధర్మాన్ని తప్పకూడదు. తన వర్ణాశ్రమాదులకు, లోకంలో తన స్థానానికి తగినట్లుగా శాస్త్రవిహిత కర్మాచరణ
చేయవలసినదే.
ఒకవేళ తనకి వైరాగ్యము, ఫలాసక్తి లేకపోతే నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి.
అంతేకానీ, తన ధర్మకర్మనీ, కర్మధర్మాన్నీ పరిత్యజించరాదు. చిత్తశుద్ధి కోసం సత్కర్మాచరణ. అందుకే జ్ఞానులు కూడా లోక సంగ్రహణార్థం ధర్మాచరణను
కొనసాగిస్తారు. కేవల బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మయే యోగీశ్వరేశ్వరుడై కూడా తన కర్మలను చక్కగా నిర్వహించాడు.
కొంతమంది తమకు తాము యోగులమని భ్రమసి కర్మలనీ, భక్తినీ నిరసించడం కేవలం భ్రమప్రమాదమే. జనకాదులనీ, రామకృష్ణాది అవతారమూర్తులనీ గమనించితే
ధర్మం పట్ల జాగరూకత అర్థమవుతుంది.
యత్యాశ్రమ స్వీకర్తల విషయం వేరు. వారికి కూడా తదాశ్రమగత నియమాలు,ధర్మాలు ఎలాగూ ఉన్నాయి.
అదేవిధంగా పరంపై విశ్వాసం లేని నాస్తికులు, సోమరులు, మూర్ఖులు కూడా ధర్మాచరణపై శ్రద్ధ వహించరు. వారందరినీ కూడా శ్రుతిమాత హెచ్చరిస్తోంది.నిష్కామభావన కలిగే కామ్యకర్మలను విడిచిపెట్టవచ్చేమో కానీ, నిత్యనైమిత్తికాలనీ,కర్తవ్యాలనీ, యజ్ఞదాన తపస్సులనీ త్యజించకూడదు.
'దేవపితృ కార్యాభ్యాం నప్రమదితవ్యం'
-
దేవ పితృ కర్మలలో కూడా అజాగ్రత్త పనికి రాదు.
నిపుణతలో, ఐశ్వర్యంలో కూడా అజాగ్రత్త కూడదని ఈ మంత్రాల వరుసలోనే కొన్ని అద్భుత వాక్యాలున్నాయి. వ్యక్తి సమాజంలో భౌతికంగా కూడా పుష్టిగా,
తుష్టిగా ఉండాలి. వాటి కోసం కూడా ఏమరపాటు లేకుండా ప్రవర్తించాలి.
తనకు సంపదాదుల కాంక్ష లేకున్నా, లోకయాత్రకు, దేశసౌభాగ్యానికి క్షేమం,నైపుణ్యం (సమర్థత), ఐశ్వర్యం వంటివి అవసరమే. అలసత్వం, అర్థం చేసుకోని వేదాంత ధోరణి వ్యక్తికీ, సమాజానికీ కూడా క్షేమకరం కాదు. తనకి సహజంగా వైరాగ్యం ఉంటే దానివలన తన స్వార్థచింతన, లోభం వంటివి జయింపబడతాయి.
కానీ ధర్మనిర్వహణకీ, సమాజాభివృద్ధికీ ఐశ్వర్యాదులను, అభివృద్ధినీ సాధించవలసిందే.
అందుకే‘కుశలాన్నప్రమదితవ్యం"భూత్యై న ప్రమదితవ్యం' అని కూడా ఆచార్యుడు హెచ్చరిస్తున్నాడు.
No comments:
Post a Comment