Sunday, March 2, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-433.
4️⃣3️⃣3️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*17. శ్రద్ధాత్రయ విభాగ యోగము*
(పదునేడవ అధ్యాయము)
_________________________
*27. వ శ్లోకము:*

*”యజ్ఞే తపసి దానే చ స్థితిస్సదితి చోచ్యతేl*
 *కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతేll”*

“ఈ సత్ అనే పదము యజ్ఞములలోనూ, తపస్సునందు, దానముల యందు, కూడా వాడబడుతూ ఉంది. భగవంతుని ప్రీతి కొరకు చేసే అన్ని కర్మలు సత్కర్మలు అని ఈ సత్ అనే పదం ముందు చేర్చి పిలువబడుతున్నాయి.”
```
‘యజ్ఞములు, తపస్సు, దానములు, ఇంకా భగవంతుని కొరకు చేసే ఏ కార్యమైనా ఒక నిష్ఠతో, శ్రద్ధతో, నిశ్చలమైన మనస్సుతో చేయాలి. ఆ నిష్ఠనే సత్ అని కూడా అంటారు. అందుకే వాటిని సత్కర్మలు అని అంటారు. ఎటువంటి నిష్ఠ లేకుండా, యాదాలాపంగా, శ్రద్ధాభక్తులు లేకుండా, ఏదోఒక ఫలితాన్ని కోరి చేసే యజ్ఞము, తపస్సు, దానము, పూజ కేవలం సాధారణ కర్మలు గానే మిగిలిపోతాయి కానీ సత్ కర్మలు కావు. ఆ కర్మలలో దైవత్వము ఉండదు. ఏదో చేయడం చేయాలని చేయడం అవుతుంది.   

సత్ అంటే నిత్యము సత్యము అవ్యయము అనే పరబ్రహ్మ స్వరూపము అని తెలుసుకున్నాము కదా. దీనికి ఆకారము లేదు అని తెలుసుకున్నాము కదా. మరి ఈ పరబ్రహ్మ స్వరూపము ఏ విధంగా ప్రకటితమౌతుంది అంటే యజ్ఞములలోనూ, యాగములలోనూ, తపస్సులోనూ, దానములలోనూ ఇంక పరమాత్మను ఉద్దేశించి చేసే అన్ని కర్మలలోనూ సత్ రూపంలో ప్రకటితమౌతుంది. మరి ఈ కర్మలు అన్నీ ఎలా చేయాలి అనే విషయం ఈ అధ్యాయం లోనే చెప్పాడు పరమాత్మ. యజ్ఞములు, తపస్సు, శ్రద్ధ, దానములు ఎన్ని రకాలో అవి ఎలా చేయాలో, ఎలా చేయకూడదో ఈ అధ్యాయంలో వివరించాడు. పరమాత్మను ఉద్దేశించి చేసే కర్మలు అన్నీ సాత్వికంగా, వేదవిహితంగా ఉంటేనే, చిత్త శుద్ధితోనూ, నిష్కామంగానూ, ఫలాపేక్షరహితంగానూ, చేస్తేనే, అవి మోక్షమార్గాన్ని చూపుతాయి.

ఏ కర్మ చేసినా భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, ముఖ్యము. అన్ని కర్మలు భగవంతుని పరంగానే చేయాలి. అహంకారము, కర్తృత్వభావన ఉండకూడదు. అన్ని కర్మల ఫలములను భగవదార్పణం చేయాలి. అప్పుడు ఆ కర్మలన్నీ సత్కర్మలు అవుతాయి. దైవత్వము సంతరించుకుంటాయి. లేకపోతే అవి అన్నీ స్వార్ధంతో యాంత్రికంగా చేసే కర్మలుగానే మిగిలిపోతాయి. బంధనములకు కారణం అవుతాయి. కాబట్టి ఆ పరబ్రహ్మ కొరకు చేసే అన్ని కర్మలు, ఆ కర్మల చేయడానికి ఉపకరించే అన్ని రకములైన కర్మలు అన్నీ సత్ కర్మలు అని పిలువబడతాయి.’```


*28. వ శ్లోకము:*

*”అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్l*
 *అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహll”*

“ఓ పార్థా! అశ్రద్ధతో చేయబడే హోమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ, సత్ పరిధిలోకి రావు. అవన్నీ అసత్తులు అని చెప్పబడతాయి. అటువంటి కర్మలు ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఎటువంటి ఫలితములను, సుఖములను ఇవ్వలేవు.”
```
‘ఇప్పటిదాకా చెప్పింది మరిచిపోతామేమో అని మరొకసారి గుర్తుచేస్తున్నాడు పరమాత్మ. ఎటువంటి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, పరమాత్మ భావన లేకుండా, కేవలం స్వలాభాపేక్షతో, యాంత్రికంగా చేసే యజ్ఞములు కానీ, యాగములు కానీ, దానములు కానీ, వ్రతాలు, పూజలు కానీ, అవన్నీ అసత్ అంటే అసత్యములు అనిపించుకుంటాయి. అటువంటి కర్మలు చేసినా చేయనట్టే. ఆ కర్మలు ఎందుకూ పనికిరాకపోగా బంధనములు కలుగచేస్తాయి. ఇటువంటి కర్మలు ఈ లోకంలో కానీ, పరలోకంలో గానీ ఎటువంటి మంచిఫలితములను ఇవ్వవు. ఇటువంటి కర్మలు చేసినా ఒకటే, చెయ్యకా ఒకటే. కాబట్టి ఏ పని చేసినా సాత్వికమైన శ్రద్ధ, భక్తి ముఖ్యము అనీ మరొకసారి ఘంటాపథంగా చెప్పాడు పరమాత్మ. శ్రద్ధ, భక్తి లేకుండా చేసే పనులు, కేవలం యాంత్రికంగా ఇతరుల మెప్పు కొరకు, పేరుప్రతిష్టల కొరకు చేసే పనులు, అసత్తులు కాబట్టి ఎందుకూ పనికి రావు. అవి ఇహలోక సుఖాలను కానీ, పరలోక సుఖాలను కానీ ఇవ్వవు. అటువంటి కర్మలు చేయడం వృథా అంటూ ఈ అధ్యాయమును ముగించాడు కృష్ణ పరమాత్మ.’✍️```

ఉపనిషత్తులయొక్క, బ్రహ్మ విద్యయొక్క, 
యోగశాస్త్రము యొక్క సారమయిన భగవద్గీతలో, 
పదునేడవ అధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము సంపూర్ణము.
*ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.*
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment