Sunday, March 30, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
                 *విజయపర్వం*

*అనంత కాల వాహినిలో అనుక్షణం విలువైనదే. విలువైన కాలాన్ని విజ్ఞతతో వినియోగించుకుంటే విజయం తప్పకుండా వరిస్తుందని తెలిపే పర్వదినం ‘విజయదశమి’. ఈ పండుగ పేరులో రెండు అర్థాలున్నాయి. ఒక అర్థంలో విజయాన్ని ప్రసాదించే దశమీ తిథి అని అన్వయించుకోవాలి. రెండో అర్థంలో విజయాన్ని అందించే శమీ వృక్షం(జమ్మిచెట్టు) అని సమన్వయపరచుకోవాలి. ఈ రెండు అర్థాల్లోని విశేషాలు ఈ పర్వదినం నాడు కనిపిస్తాయి.*

*ఆరు రుతువుల్లో శరదృతువుకు ఎంతో పవిత్రత ఉంది. ఈ రుతువు ప్రారంభం కాగానే స్వచ్ఛంగా నిర్మలంగా కనిపించే ఆకాశం, జలాశయాలు, వనాలు, దారులు మనోనిర్మలత్వానికి ప్రతీకలుగా దర్శనమిస్తాయి. రాత్రివేళలో పిండారబోసినట్లుగా ఉండే వెన్నెల, హృదయాలను ఆనందాల్లో విహరించే విధంగా మారుస్తుంది.* 

*తెల్లదనం మనిషిలోని పారదర్శకతకు చిహ్నంగా గోచరిస్తుంది. అందుకే పూర్వం చక్రవర్తులు, రాజులు రాజ్యవిస్తరణకు, దిగ్విజయ యాత్రలకు ఈ కాలాన్ని సముచితంగా భావించేవారని కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో చెప్పాడు. శరదృతువులోని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో దశమీ తిథినాడు ఈ విజయ ముహూర్తం సంభవిస్తుందని సంప్రదాయం చెబుతోంది.*

*పూర్వం ద్వాపరయుగంలో పాండ వులు అజ్ఞాతవాసారంభంలో తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టు(శమీవృక్షం) కొమ్మపై భద్రపరచారని మహాభారతం చెబుతోంది. ధర్మరక్షణ కోసం వినియోగించే దివ్యాయుధాలను శమీవృక్షం రక్షిస్తుంది కనుక మానవులంతా ఈ రోజున జమ్మిచెట్టుకు పూజలు చేయడం కనబడుతుంది. ఈ పవిత్ర పర్వదినాన శమీ దర్శనం, శకుంత(పాలపిట్ట) దర్శనం పుణ్యప్రదమనే నమ్మకం వ్యాప్తి చెందింది.*

*మనిషి తన జీవితంలో అడుగడుగునా విజయాలు కలగాలని, సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటాడు. తన జీవనయాత్ర విజయయాత్ర కావాలనే వాంఛకు ప్రతిరూపమే విజయదశమి. ఈ దినాన సాయం సంధ్యాకాలంలో ప్రజలు తమ తమ నివాసాల నుంచి బయలుదేరి ఊరి పొలిమేరల దాకా వెళ్ళి పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టును పూజించి తమ ఇళ్లకు తిరిగి వస్తారు. పాలపిట్ట విజయానికి సంకేతమైన పక్షి అని అందరి భావన. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యే దేవీ శరన్నవరాత్రోత్సవాలు ‘విజయదశమి’తో ముగుస్తాయి. నవనవోన్మేషంగా నవరాత్రుల పాటు సాగే ఈ శక్తిపూజల ముగింపు సంకేతమే ‘విజయదశమి’.*

*ప్రతి పండుగ వెనక సామాజిక, పారమార్థిక నేపథ్యం ఉంటుంది. సమాజంలో సహజీవన సౌందర్యానికి ప్రతిరూపాలుగా పండుగలు కనిపిస్తాయి. తాత్త్వికంగా ఆలోచించేవారికి దివ్యశక్తి ప్రేరణ రూపంలో పండుగ నిండుదనాన్ని సంతరించుకొంటుంది. మనిషి తన నిత్య జీవితంలోను, మరణానంతర జీవితంలోను ఉత్తమ స్థితినే కోరుకుంటాడు. అందుకే ధర్మార్థ కామమోక్షాల సాధనలుగా పండుగలను పెద్దలు నిర్వచిస్తారు.*

*జీవించినంత కాలం తాను, తన కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం అభ్యుదయాలను చూడాలని, క్షేమంగా ఉండాలని భావించే సంప్రదాయానికి ప్రత్యక్షరూపం ‘విజయదశమి’. ఈ పండుగ అందించే స్ఫూర్తి, మనిషిలోని ఆర్తిని తొలగించి, విజయకీర్తిని నిలపాలని ఆకాంక్షించడమే మనిషి కర్తవ్యం!*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴

No comments:

Post a Comment