Sunday, March 2, 2025

 లోపల నా యుద్ధం నేను చేస్తూనే ఉన్నాను..
కానీ నీకు తెలియనివ్వనులే..

ఎందుకంటే నీ వంతు యుద్ధం నువ్వూ చేస్తున్నావుగా..
ఈ బతుకుపోరాటంలో...

ఏదో తెలీని ఒక ప్రశ్న..
ఊహూ..చాలానో కొన్నో, ఒకటి కంటే ఎక్కువ ప్రశ్నలే నన్ను వెంటాడుతుంటాయి..
కానీ సమాధానం ఇచ్చేవారు ఇవ్వరు..

నీకూ ఇలానే ఉంటాయిగా కొన్ని ప్రశ్నలు..

అలా అలా సమాధానం దొరకక, ప్రశ్న నిద్రపోతుంది ..
మనసులోనే ఒక సమాధిని కట్టుకుని మరీ నిద్రిస్తుంది..
అలా ఎన్ని సమాధులను మోస్తున్నానో నేను..
నువ్వూ అంతేగా...

మనిషి చనిపోయాక ఒకటే సమాధి..
కానీ బతికున్న మనిషి మనసులో ఎన్నో సమాధులు..రోజురోజుకి దూది తడిసి మొయ్యలేనంత బరువైనట్లు..మన బాధాతప్త కన్నీటి ధారలతో దూదిపింజె మనసు కూడా చాలా బరువు పెరుగుతూ ఉంటుంది..

అయినా ఇదంతా బతుకు సత్యం తెలిసేవరకే..
ఒకసారి బతుకేంటో అర్ధమైతే..
ప్రశ్నలే ఉండవు..
సమాధానాలు అసలే అక్కర్లేదు..

ఏదొస్తే ఆ అనుభవమే జీవితం..
నవ్వొస్తే నవ్వాలి..
ఏడుపొస్తే ఏడవాలి..
అంతా ఆ క్షణానికి మాత్రమే పరిమితం..
ఏ అనుభవాన్నీ మొయ్యద్దు అనుక్షణమూ..
వచ్చేవి వస్తాయి పొయ్యేవి పోతాయి..
అంతే జీవితము..
ఏదీ కాదు శాశ్వతము..
నీతో సహా ఏదో రోజు
చెయ్యకతప్పదు
ఖాళీ ఈ స్థలము
నీది అనుకుంటున్న నీ స్థానము...

No comments:

Post a Comment