Sunday, March 2, 2025

 *ఈరోజు పురాణ కథ సుగ్రీవుఁడు గురించి:*

వాలి తమ్ముఁడు. తండ్రి ఋక్షవిరజుఁడు. భార్య రుమ. తొల్లి ఒకప్పుడు బ్రహ్మ యోగాభ్యాసమున ఉండువేళ అతని కంటినుండి ఒక జలబిందువుపడి అది ఒక వానర రూపము అయ్యెను. ఆవానరమునకు ఋక్షవిరజుఁడు అని బ్రహ్మ నామకరణము చేసెను. అనంతరము ఆవానరము సమస్త దేశములయందును వనములయందును సంచరించుచు మేరుపర్వతమునకు పోయి అచట ఒక కొలనిలో తోఁచిన తన ప్రతిబింబమును పొడగని అది తన్నెదిరింపవచ్చిన మఱియొక కోఁతి అను తలఁపున దానితో పోరాడ ఆకొలని నీటిలో ఉఱికెను. అందు మున్ను ఒకప్పుడు పార్వతి స్నానము చేయుచు ఉండఁగా కొందఱు కామరూపులు అగు రాక్షసులు స్త్రీవేషము ధరించి వచ్చి స్నానము చేయవచ్చిన వారివలె నీళ్లలో దిగి విహరింపసాగిరి. అది ఆమె తెలిసికొని 'ఈకొలనియందు ఇంకను ఎవ్వరు క్రుంకినను వీరియట్లు స్త్రీలు అగుదురు గాక, వీరికి ఇంక పురుషత్వము రాకపోవుగాక' అని శాపము ఇచ్చి ఉండినందున అట్లు ఉఱికిన ఈకోఁతియు తత్ క్షణమే మిక్కిలి మనోజ్ఞతగల ఒక ఆఁడుకోఁతి అయ్యెను. ఆకాలమునందు ఇంద్రసూర్యులు ఆ మార్గమున పోవుచు దీని లావణ్యాతి శయమును చూచి చిత్తము చలింపఁగా వారికి రేతస్కందము అయి ఇంద్రునిరేతస్సు దాని వాలప్రదేశమునందును సూర్యుని రేతస్సు దాని గ్రీవా ప్రదేశమునందును పడెను. ఆపుడు వాలప్రదేశమున పడిన రేతస్సు వలన వాలియు, గ్రీవా ప్రదేశమున పడిన రేతస్సు వలన సుగ్రీవుఁడును పుట్టిరి. వీరు ఇరువురును మహా బలపరాక్రమ సంపన్నులు. వీరిలో వాలికి ఇంద్రుఁడు తన మెడను ఉన్న హేమమాలికను ఇచ్చి ఏవీరుఁడు నిన్ను ఎదిరించినను, ఎదిరించిన వాని బలమున సగము నీకు రాఁగలదు; దానఁజేసి ఎల్లవారికి అజేయుఁడవై వెలయఁగలవు అని వరము ఇచ్చి పోయెను. కనుకనే రాముఁడు వాలిని చెట్టు మఱుఁగున ఉండి చంపెను అందురు. ఒకప్పుడు మాయావి అను దనుజునితో పోరాడపోయి ఉండిన తన యన్న అగు వాలి, ఆమాయావి చేత చంపఁబడెను అని ఇతఁడు తలఁచి రాజ్యమును కొనెను. అది కారణముగ అన్నదమ్ములకు ప్రబలవిరోధము కలిగి వాలిచే ఇతఁడు కిష్కింధనుండి తఱుమ కొట్టఁబడెను. అంత ఇతఁడు ఋశ్యమూక పర్వతమున బహుకాలము ఉండి సీతను వెదకుటకయి రాముఁడు వచ్చినప్పుడు అతనిచే వాలిని చంపించెను.      

No comments:

Post a Comment