Wednesday, March 5, 2025

 *చిన్నప్పుడు వూర్లో పెళ్ళిళ్ళకు, ఫంక్షన్ లకు చాలా అంటే చాలా రేయ్ గా వెళ్ళేవాళ్ళం....వెళ్ళినా భోజనం మాత్రం* *చేయను‌..ఇంటికొచ్చాకే తినే దాన్ని...మా అమ్మమ్మ తిట్టేది...*
*కారణం ఏంటంటే....*

*అప్పట్లో...అంటే....లడ్డూ, బూందీ కారాల కంటే ముందు కాలం అన్నమాట....*
*బెల్లం పాయసం...అంటే శనగపప్పు, సగ్గుబియ్యం, సేమ్యా, బెల్లం తో చేసిన నేతి పోపుతో ఘుమాలిచ్చే పాయసం మాత్రమే స్వీట్ అంటే...యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం...*

*అప్పట్లో బంతి భోజనాలు...టేబుళ్లు వాడకం కూడా తక్కువే...నేల మీదే కూర్చునేవారు ఎక్కువగా....నేలేమో ఎగుడుదిగుడు...*
*అందరూ బంతిలో కూర్చున్నాక ఇలాంటి ఆకులు కుట్టిన విస్తర్లు పెడతారు మనముందు ( వాటి ఆడాడ చిన్న బొక్కలు కూడా వుండేవి )...*
*వాటిని కొన్ని నీళ్ళు పోసి అట్టట్ట రుద్ది ఆ నీళ్ళు ఆన్నే పోస్తారు....*
*ఇంకా ఆకును రెడీ చేసుకుని ఆవురావురుమని ఎదురుచూస్తుంటారు జనాలు....*

*బక్కెట్ పట్టుకుని వస్తారింక....ఫస్ట్ బకేట్ పాయసం...*
*పెద్దగంటె అందులో....వేడి వేడి పాయసం పెద్ద గరిటె నిండా తీసి విస్తరాకులో పోస్తే సర్ర్ మని పారిపోతా వుంటది* *అది....వీళ్ళేమో ఆ వేడి వేడి పాయసాన్ని బయటికి పారిపోనీకుండా ఒడుపుగా చేతినిండా గుంజుకుని రెండు నాకుళ్ళల్లో అవగొట్టేసి వుట్టి ఆకును, చేతిని నాకుతూ కూర్చుంటారు (ఆ తీపిని ఆస్వాదిస్తూ).*

*సెకండ్ రౌండ్ కూడ పాయసమే....ఆరారగా, ఆనందంగా ఆరగిస్తారు...*
*ఇదంతా ఒక ఎత్తయితే ....next episode ఇంకో ఎత్తు...(అంటే నేను తినకపోవడానికి అదో కారణం, ఇదో కారణం* *అంటున్నా....తప్పుగా అనుకోవద్దు ఎవరూ)*
*మొత్తం ఆకంతా తీపి తీపిగా వుంటుంది....దాన్లోనే అన్నం, కూరలు, పప్పు, పచ్చడి, ఆలుగడ్డ ఫ్రై, అప్పడం, అన్నీ వడ్డిస్తారు.....ఆ పాయసం తీపి తగిలి ఈ కూరలు రుచి కూడా మారిపోతుందనుకుంటా.....ఎగుడు దిగుడు నేలమీద పాయసాన్ని జాగ్రత్తగా తినడం ఒక ఎత్తైతే, ఆ తీపి మీద కారం తినడం ఇంకో ఎత్తు...*

*తర్వాతి కాలంలో టేబుల్ లు, ఛెయిర్లు వచ్చినా ఇదే ప్రాసెస్......*
*ఆ తర్వాత వాళ్ళకే విసుగొచ్చిందేమో పాయసం ఆపేసి లడ్డు, బూంది కారాలు పెట్టేవాళ్ళు.....పెళ్ళికొచ్చిన వాళ్ళు (చాలామంది) పెద్ద పెద్ద కర్చీపులు తెచ్చుకునేవారు....వీళ్ళ కుటుంబం అంతా వర్సగా కూర్చుంటారు కదా....*
*అందరి లడ్లు, బూందీ ఆ కర్చీఫ్ లో మూటకట్టి చాటుగా దాచుకుని ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు....*
*అదేం పెద్ద విషయం కాదు...*
*కానీ....*
*బంతిలో ఛెయిర్లో కూర్చుంటారు కదా.... నెక్స్ట్ బంతిలో కూర్చోవడానికి రెడీగా ఛెయిర్ పట్టుకుని మరీ నిల్చునవాళ్ళు సీట్ కోసం ఎర్ర బస్సులో కర్చీఫ్ వేసినట్టు*

*కూర్చున్న వాళ్ళకి కొందరికేమో మొహమాటం, తొందరగా లేద్దాంతీ , వాళ్ళు అలా చూస్తుంటే ఎలా తింటాం అని సిగ్గుపడేవాళ్ళు కొందరు...మరి కొందరేమో ఎవడు చూస్తుంటే నాకేంటి , నేను ముందొచ్చినా, నాదయ్యేదాకా ఆగాల్సిందే అనుకుంటారేమో, ఇంకో నాలుగు సార్లు ఎక్కువ పెట్టించుకుని నిమ్మళంగా తింటారు....బంతి అంతా ఒకేసారి లేవాలి...అడ్డదిడ్డంగా లేవడానికి లేక మిగిలిన వాళ్ళు తిట్టుకుంటుంటారు వీళ్ళని.*

*ఇప్పుడంటే స్వీట్లు గానీ , పులిహోర, బిర్యానీ, మాంసం కూరలు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయిగానీ....*
*ఆ కాలంలో మాత్రం పండగో, పబ్బమో...లేక రాకరాక చుట్టాలు వస్తేనో వండుకునేవారు.*

*ఇంక పెళ్లి భోజనం అంటే చాలా ఆశపడేవారు.*

*ఆ విస్తట్లో భోజనం ఫోటో చూసి నాకొచ్చిన జ్ఞాపకాలు ఇవి...*

No comments:

Post a Comment