తెలుగు రచయిత లలో శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 - ఏప్రిల్ 8, 1977) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు.
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. "నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం" అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.
మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి చెప్పాడు.
సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.
రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు.
సినిమాలకు కూడా పాటలు రాసాడు. మహాత్మాగాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాసాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా. సుందరాచారి "మా తెలుగు తల్లికి" గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడడానికి నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.
ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రూను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
"ఆయన వర్థంతిసందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము!!!
🙏🙏🙏
No comments:
Post a Comment