*మహావీర జయంతి*
*రేపు ఏప్రిల్ 10 గురువారం మహావీర జయంతి సందర్భంగా...*
*కర్మలు అంటే మన చర్యలు. మనం పూర్వ జన్మలో చేసిన పనులే ఈ జన్మలో కర్మలుగా మారతాయంటారు. ఆత్మ స్వేచ్ఛ పొందడానికి ఈ కర్మలు అనుమతించవు. అవి మనిషిని ఆత్మతో బంధించి ఉంచుతాయి. జీవులను జీవన మరణాల వలయంలో తిప్పుతాయి. కర్మ ఫలితానికి ఎదురుతిరిగి ఆత్మను భావరహితంగా చెయ్యడమే మోక్షం. కఠిన నియమాల ద్వారా, శరీరాన్ని శుష్కింపజేసు కోవడంవల్ల కర్మనాశనాన్ని సాధిస్తూ మోక్షాన్ని పొందవచ్చు. ఇది జైనధర్మం లోని తాత్వికభావన.*
*భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో జైనం ఆవిర్భావం ఒక విలక్షణ ఘట్టం. జైన సంప్రదాయంలో 24 మంది తీర్ధంకరులున్నారు. వారిలో చివరివాడు మహావీరుడు. తీర్థంకరుడంటే భవసాగరాన్ని దాటించేవాడని అర్థం.*
*మహావీరుడి అసలు పేరు వర్ధమానుడు. క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో నేటి బిహార్ లోని కుంద గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు ఒక మండల పాలకుడు. తల్లి త్రిశాల. భార్య యశోద. కుమార్తె అణోజా (ప్రియదర్శిని). 12 సంవత్సరాల దేశసంచారం తరువాత ఒక సాలవృక్షం కింద ధ్యానంలో ఉండగా జ్ఞానం పొందాడు. 72వ ఏట పావాపురిలో నిర్యాణం చెందాడు.*
*23వ తీర్థంకరుడు పార్శ్వనాధుడు బోధించిన అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం అనే వాటికి అదనంగా బ్రహ్మచర్యమనే భావనను ప్రతిపాదించాడు. ఈ అయిదింటినీ జైనులు 'పంచమహావ్రతాలు'గా పరిగణిస్తారు. సమ్యక్ చరిత, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవితం అనే మూడు అంశాలను మహావీరుడు బోధించాడు. జైనమతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవడం, మంచిజ్ఞానం సంపాదించడం, మంచిమార్గంలో జీవించడమనే ఈ మూడింటినీ జైనధర్మంలో 'త్రిశీలాలు' అంటారు. మహావీరుడు దైవం ఉనికిని విశ్వసించలేదు. వేదప్రామాణ్యాన్ని, వర్ణవ్యవస్థను కూడా అంగీకరించలేదు. తన కాలంనాటి భారతీయ సమాజంలోని సాంఘిక రుగ్మతలపై పోరాడాడు. సర్వమానవ సమానత్వాన్ని ఆశించాడు. అహింస, ఆత్మవిజయం, వ్రతం, వినయం, శీలం, మైత్రి, సమభావం, సమాధానం అనే ఎనిమిది తత్వాల్ని ప్రచారం చేసేందుకు సంఘం నెలకొల్పాడు. ఈ సంఘంలో శ్రమణులు (పూర్తి వ్రతధారులు), శ్రావకులు (సాధారణ వ్రతులు) అనే రెండు రకాల శిష్యులుంటారు.*
*అహింసా సిద్ధాంతానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చిన మహావీరుడు వృక్షాలకూ ఆత్మ ఉంటుందని నమ్మాడు. అందువల్ల వాటిని బాధించవద్దన్నాడు. ఉపవాసం, భిక్షాటనం, రుచికరమైన ఆహార విసర్జనం, శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, మానవసేవ మొదలైన అంశాలను ప్రబోదించాడు. జీవం, ఆజీవం అంటే చేతనాచేతనాలు రెండూ కలిసి జీవిస్తాయని, కానీ స్వేచ్ఛా యుతమైనవని, ఒకదానిపై ఒకటి ఆధారపడిలేవని మహావీరుడు పేర్కొన్నాడు. భౌతిక, ఆధ్యాత్మికాల కలయికే మానవుడి జీవితంగా మహావీరుడు భావించాడు. మనిషి భవిష్యత్తుకు మనిషే కర్త అని చెబుతూ నిర్వాణ స్థితికై ఎదురుచూసే పరిపూర్ణ ఆత్మను 'అర్హత'గా వ్యవహరించాడు. ఇంద్రియాల్ని జయించినవాడు అనే అర్థంలో వర్ధమానుణ్ని 'జినుడు' అనీ అంటారు. జైనధర్మం మౌలిక భావనలు అంతకుముందే ఉన్నా 'జాన'శబ్దం నుంచే 'జైనం' ఏర్పడిందని చెబుతారు.*
*కాలక్రమంలో జైనంలో శ్వేతాంబర, దిగంబర శాఖలు ఏర్పడ్డాయి. వివిధ కాలాల్లో బింబిసారుడు, అజాతశత్రువు, మౌర్యచంద్రగుపుడు, కళింగ ఖారవేలుడు మొదలైన పాలకులు జైనధర్మం అవలంబించారు. భారతీయ వాఙ్మయం, సంస్కృతి, కళలకు జైనం విశేషంగా దోహదపడింది.*
*┅━❀꧁గురుభ్యోనమః꧂❀━┅*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🧘♀️❤️🧘♂️ 🙏🕉️🙏 🧘♂️❤️🧘♀️
No comments:
Post a Comment