Tuesday, April 8, 2025

 *💎 నేటి ఆణిముత్యం 💎*


తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

*భావం :*

తనకు ఉన్న కోపమే తనకు హాని చేసే శత్రువు. తనలో ఉన్న శాంతగుణమే తనకు రక్షగా ఉంటుంది. ఇతరుల దుఃఖాన్ని పోగొట్టటానికి తాను చేసే పనే తనకు బంధువు, చుట్టం. తనకు ఉండే సంతృప్తే స్వర్గం అంటే సంతోషాన్ని కలిగించే చోటుతో సమానం. తనకు ఉన్న బాధే దుఃఖాలను, ఇబ్బందులను కలిగించే స్థానమని విజ్ఞులు చెబుతుంటారు.

*ప్రతిపదార్థం :*

తన కోపము + ఎ అంటే తనకి ఉన్న కోపమే. తన శత్రువు అంటే ఆ ప్రాణికి పగవాడు. తన శాంతము + ఎ అంటే తనలో ఉన్న నెమ్మదితనమనే లక్షణమే. తనకు రక్ష అంటే తనకు రక్షణనిస్తుంది.

దయ అంటే ఇతరుల కష్టాలను పోగొట్టటానికి ప్రయత్నం చేయటం. చుట్టంబు + ఔన్ అంటే బంధువు లేదా చుట్టం అవుతుంది. తన సంతోషము + ఎ అంటే తనకు ఉండే సంతృప్తే. స్వర్గము అంటే కష్టాలు లేకుండా కేవలం సుఖం మాత్రమే ఉండే దేవలోకం. తన దుఃఖము + ఎ అంటే తనకు ఉండే బాధే. నరకము అంటే కష్టాలకు నెలవైన నరకం (పాపాలు చేసినవారికి శిక్షపడే చోటు) తో సమానం. అండ్రు అంటే అంటారు లేదా చెబుతారు తథ్యము అంటే ఇది వాస్తవం.

కోపంతో ఉన్న మనిషి పశువుతో సమానం. ఏం చేస్తున్నదీ వారికే తెలియదు. ఆ కోపంలో విచక్షణ పోగొట్టుకుంటారు. కోపం తగ్గిన తరవాత తాము చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటారు. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోతుంది. అందువల్ల కోపాన్ని అణచుకుంటే మంచిదని ఈ పద్యంలో కవి వివరిస్తున్నాడు.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment