Saturday, April 12, 2025

*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 41*

*నాటకాల్లో పురుష పాత్రలు సినిమాల్లో హాస్య పాత్రలు*
*టి.కనకం*

1949 వ సంవత్సరంలో బాక్సాఫీసు రికార్డులు బద్దలు గొట్టిన సినిమా *'కీలు గుఱ్ఱం'.* 

అంజలీదేవి, కనకం రాక్షస స్త్రీలుగా నటించారు. అంజలికి చెలికత్తె అయిన కేకిని పాత్ర కనకానిది. రాక్షస స్త్రీలు కామరూపం ధరించ గలరు గనుక ఒక రాజును వశపరచుకుని ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. 

ఈ చిత్రంలో  *'చెంప చేసినా కంపు చేసితివి చెడ్డ దానివే*' అనే పాట రేలంగితో కలిసి కనకం స్వంతంగా పాడింది. ఆమెకు ప్లేబేక్ లేదు. ఈ చిత్రం విజయోత్సవ వేడుకల్లో చిత్ర నిర్మాత మీర్జాపురం రాజావారు ఈమెకు కూడా పది కాసుల బంగారం కానుకగా ఇచ్చారట. 

కీలు గుఱ్ఱం తర్వాత అంజలి, కనకంలకి అలాంటి వేషాలే వస్తాయని ప్రచారం జరిగింది కాని అంజలికి *'శ్రీలక్ష్మమ్మ కథ*' లో సాత్వికమైన కథానాయిక పాత్ర లభించింది. కనకం మాత్రం కథానాయిక అవుదామని ఎంత ప్రయత్నించినా కాలేకపోయింది. నాటకాల నుంచి సినిమాలకు, తర్వాత మళ్లీ నాటకాలకు ప్రస్థానం కనకం జీవితం.

కనకం పశ్చిమ బెంగాల్లోని ఖర్గపూర్లో 1930 నవంబర్ 12న జన్మించింది. తండ్రి అప్పలస్వామి రైల్వేలో డ్రైవరు. తల్లి షోలాపురమ్మ.

ఇది ఖర్గపూర్ గ్రామ దేవత పేరు. తండ్రి ఉద్యోగరీత్యా ఊళ్లు తిరిగి విజయవాడలో స్థిరపడ్డారు. 

కనకం అసలు పేరు కనక దుర్గ. సినిమాల్లో కనకంగా ప్రసిద్దు రాలైంది. విజయవాడలో చదువుకున్న కనకం తెలుగు భాషపై మంచి పట్టు సంపాదించింది. *విజయ విలాసం* లాంటి ప్రబంధాల్లోని పద్యాలు ఆమెకు కంఠోపాఠం. 

ఈమె బంధువులు నాటక రంగంలో ఉండేవారు వారి దగ్గర శిక్షణ పొంది కనకం నాటకాల్లో నటించింది. 12 ఏళ్ల వయసులో కె.వి. గోపాలస్వామి గారి ఆధ్వర్యంలో *'ప్రతిమ'* నాటకంలో ప్రతిమ సుందరిగా మొదటిసారి నటించి పెద్దల మెప్పు పొందింది. 

ఆ తర్వాత ఎక్కడ నాటకం జరిగినా *ప్రహ్లాదుడు, బాలకృష్ణుడు, లోహితాస్యుడు* వంటి బాల పాత్రలన్నీ ఈమె ధరించేది. రెండో భార్యగా వెళ్లడానికి ఇష్టం లేక పెళ్లి తప్పించుకోడానికి మద్రాసు వెళ్లి తాపీ ధర్మారావు గారి సహాయంతో రేడియోలో జానపద గేయాలు పాడి శ్రోతలను రజింప జేసింది.

1946లో సారధి వారి *గృహ ప్రవేశం'* చిత్రంలో ఆమె మొదటి సినిమా వేషం వేసింది. ఈ చిత్రానికి ఎల్.వి.ప్రసాద్ దర్శకులు. ఇందులో ఈమెది బాలవితంతువు పాత్ర. కీలు గుర్రం తర్వాత ఆమెకు వచ్చిన వేషాలన్నీ హాస్య పాత్రలు, శృంగార పాత్రలే. *'గుణ సుందరి'* కథలో మకర కన్యగా నటించింది. ఈ పాత్రతో ఈమెకు 'సెక్స్ స్టార్' అనే పేరు ప్రచారంలోకి వచ్చేసింది. 

కనకం తన పాటలు తానే పాడుకున్నారు. *'రక్ష రేఖ*' లో ప్రసిద్ధ హాస్య నటులు కస్తూరి శివరావు సరసన నటించింది. 
*'సేయి సేయి కల్పుకో రామావా*... పాటపాడారు. *'మానవతి'* చిత్రంలోనూ *పెళ్లాం పెళ్లాం*' పాట పాడారు. 

టింగ్ రంగా చిత్రంలో నల్ల రామ్మూర్తితో కలిసి *'ఓ టింగారమా ఓ సింగారమా*' పాట పాడారు. 

*సౌదామిని, సతీసక్కుబాయి* చిత్రాల్లో రేలంగితో కలిసి నటించారు. విజయా వారి షావుకారు చిత్రంలో *చాకలి రామి* పాత్ర ఈమెకు పేరు తెచ్చింది. అందులో చీర మోకాళ్లపైకి ఎత్తి కట్టి, పైట చెంగు జారవిడుస్తూ, అమాయకంగా తేగలు నముల్తూ తళుకుల బెళుకుల శృంగార చేష్టలతో రౌడీ రంగడిని (ఎస్వీ రంగారావు) వల్లో వేసుకునే పాత్ర. ఈ చిత్రం విడుదలయ్యాక ఎన్.టి.రామారావు ఈమెను రామక్క అని పిలవడంతో అందరూ రామి, రామక్క అనేవారు. ఈమె *'దాసి*' చిత్రంలో ఎన్.టి.ఆర్కు రెండో భార్యగా నటించారు. గోపీచంద్ గారి ' *ప్రియురాలు*' చిత్రంలో వేశ్య మాత పాత్రలో సరసమైన జావళీపాడింది.

కనకం మరి కొన్ని చిత్రాల్లో కూడా నటించినా సినిమా రంగంలో నిలదొక్కుకో లేకపోయింది. మంచి పాత్రలే రాలేదు. చిత్రాల్లో నటిస్తున్నా ఆమె నాటక రంగాన్ని విడిచిపెట్ట లేదు. సినిమాల్లో హాస్య పాత్రలను రసవత్తరంగా
బాషించిన కనకం నాటకాల్లో పురుష పాత్రలను ప్రతిభావంతంగా పోషించారు.

ఆమె *కృష్ణుడు, రాముడు, నారదుడు, అర్జునుడు* పాత్రలు ధరించింది. ప్రసిద్ధ నటులు పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు, ధూళిపాళ, అబ్బూరి కమలాదేవి వంటి వారితో కలిసి నటించింది. 

చింతామణి నాటకంలో ఈమె *చింతామణిగా* నటించగా నల్ల రామ్మూర్తి శ్రీహరిగా, రఘు రామయ్య భవానీశంకరుడుగా, రేలంగి సుబ్బ శెట్టిగా, మాధవపెద్ది సత్యం బిల్వమంగళుడుగా నటించారు.

1956లో  *దేశ దిమ్మరి*' అనే చిత్రం నిర్మించాలని సన్నాహాలు చేసుకుంది. ఈ చిత్రానికి శ్రీ శ్రీ, ఆరుద్ర రచయితలు. పెండ్యాల సంగీత దర్శకులు జిక్కి, రావు బాల సరస్వతి, ఘంటసాల పాటలు పాడారు. కానీ చిత్రం ఆగిపోయింది. నాటక రంగంలో ఉండగానే మళ్లీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వరుసగా ఎ.వి.ఎం వారి *లేత మనసులు, భక్త ప్రహ్లాద, అవే కళ్లు* చిత్రాల్లో నటించారు. భక్త ప్రహ్లాదలోని *'పాములోళ్లమండి* ... ఆమె చివరి పాట. 1970లో రామానాయుడు గారి *'ద్రోహి'* ఆమె చివరి చిత్రం. ఈ తర్వాత ఆమె 1982 వరకు నాటకాల్లో వేషాలు వేస్తూనే ఉంది. 

మద్రాసులో సినీరంగంలో శ్రీశ్రీ, ఆరుద్ర ఆమెకు ఆప్తులు. ఆరుద్ర ఈమె ఇంట్లోనే కూర్చుని సినిమా రచనలు చేసుకునేవారు. 

ఒకప్పుడు విలాసంగా మద్రాసులో జీవించిన కనకం నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ వారిస్తున్న కొద్దిపాటి ఆర్ధిక సాయంతో విజయవాడలో బ్రతుకు సాగించారు. కనకం గారిని మద్రాస్ తెలుగు అకాడమీ, *అజో - విభో*, *మా*' మొదలైన సంస్థలు పురస్కారాలతో సత్కరించాయి.

*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)

No comments:

Post a Comment