Tuesday, April 8, 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*


*యుయుత్సుడు*


యుయుత్సుడు మహాభారతంలో ధృతరాష్ట్రునికి వైశ్య కన్యకయైన సుఖదకు జన్మించిన పుత్రుడు. ధుర్యోధనునితో సమ వయస్కుడు. వంద మంది కౌరవులలో ఒకడు. మహాభారత యుద్ధం తరువాత కౌరవులలో జీవించియున్నది ఒక్క యుయుత్సుడు మాత్రమే. తరువాత ఇంద్రప్రస్థానికి రాజైనాడు.

*జననం*

గాంధారి గర్భం దాల్చి రెండేళ్ళు గడిచినా సంతానం కలగక పోవడంతో ధృతరాష్ట్రుడు వైశ్య కన్యకయైన సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడుగా పొందాడు. యుయుత్సుడు, దుర్యోధనుడు ఒకే రోజు జన్మించారు. మిగతా కౌరవులు, దుస్సల కన్నా ముందే జన్మించాడు.

*ధర్మ నిరతుడు*

ఒకసారి విషపు నీటి ప్రయోగం నుంచి భీముని కాపాడాడు. అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో అందరూ మౌనంగా ఉన్నా యుయుత్సుడు మాత్రమే దానిని వ్యతిరేకించాడు. మహాభారతం ధర్మయుద్ధం కావును అందులో పాల్గొనే ఇరు పక్షాల యోధులకు వారికి ధర్మం ఏ పక్షాన ఉందనిపిస్తుందో ఆ వైపుకి మారే అవకాశం ఉంది. యుద్ధ సమయంలో కౌరవులకు సమాచారం చేరవేయడంలో సహాయం చేశాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు కూడా సహాయం చేశాడు.

గాంధారి మూడో కొడుకు వికర్ణుడు కూడా యుయుత్సుడితో సమానంగా ధర్మాచరణుడే. ధుర్యోదనుని కుటిల బుద్ధిని ద్వేషించిన వాడే కానీ ధర్మాన్ని అనుసరించి యుయుత్సుడు ధుర్యోధనుడిని విడిచి పెట్టాడు. వికర్ణుడు అన్నగారిని విడిచిపెట్ట లేక పోయాడు. ఇది రామాయణంలో విభీషణుడు, కుంభకర్ణుడు సంబంధం లాంటిది.

*కురుక్షేత్రంలో*

పాండవులకు, కౌరవులకూ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవక ముందే యుయుత్సుడు పాండవుల పక్షానికి చేరాడు. నారి తరఫునే పోరాడాడు. కౌరవ సైన్యంలో ఉన్న పదకొండు మంది అతిరథుల్లో (ఒక్కసారి పదివేల మందితో పోరాడగలిగినవాడు) యుయుత్సుడు కూడా ఒకడు. యుద్ధానంతరం పదకొండు మందిలో జీవించి ఉన్నది కూడా యుయుత్సుడే.

*యుద్ధం అనంతరం*

సంగ్రామం ముగిసిన తరువాత పాండవులు హిమాలయాలకు వెళుతూ చిన్నవాడైన రాజు పరీక్షిత్తుకు యుయుత్సుడిని సంరక్షకుడిగా నియమించారు. యాదవకులంలో ముసలం ప్రారంభం కాకమునుపే నగరంలో అరాచకం ప్రభలడం గమనించాడు యుయుత్సుడు. దాన్ని గురించి ప్రజలను అడగగా వారు అతని మీదే నిందలు వేసి ద్రోహిగా సొంత బంధువుల మరణానికి కారకుడిగా ముద్ర వేశారు. కలియుగం ప్రారంభమౌతుందన్న సూచనలు తెలుసుకొన్న ధర్మరాజు ఇంద్రప్రస్థానికి రాజుని చేశారు.

No comments:

Post a Comment