Wednesday, April 9, 2025

 మనసు కథలు 

🌺 రిషిమాధురి 🌺

ఆచారాలు, నియమాలు, కట్టుబాట్లు ఉన్న కుటుంబం లో పెరిగి పెద్దదయ్యింది మాధురి...

తనకి ఇష్టమైన లెక్చరర్ ఉద్యోగం చేస్తోంది, అదే కాలేజీకి, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రతీ శనివారం కౌన్సిలర్  రిషి వచ్చేవాడు.... 

మాధురి, తను చిన్న నాటినుంచీ పెరిగిన వాతావరణానికీ, బయటి ప్రపంచపు తీరుకీ సమన్వయం చేసుకోలేక ఒక్కోసారి చాలా ఒత్తిడికి గురయ్యేది.. 

అందుకే రిషితో కౌన్సిలింగ్ తీసుకునేది మాధురి కూడా, అలా పరిచయం పెరిగి, అతని నుంచీ మానసికంగా ఒక ఊరట దొరుకుతూ, అతను, ఆమెకు, జీవనానికి ఒక బలమైన ఆలంబనగా మారిపోయాడు...

అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకుంది మాధురి, కానీ ఇంట్లోవాళ్ళు, రిషి వేరే కులం అతను, పైగా ప్రేమవివాహం అని పూర్తిగా వ్యతిరేకించారు... అందరినీ ఒప్పించే అన్ని ప్రయత్నాలు చేసి చివరికి అలిసిపోయి, రిషిని ఆర్యసమాజ్ లో పెళ్ళి చేసుకుని ఇంటికి వెళ్ళింది..

తల్లి కాత్యాయని, పిన్ని శారద బాగా తిట్టారు.. 
" ఇలా చేసావేమిటే, మీ తాతగారు, నాన్న, బాబాయ్ లకి వచ్చే కోపానికి బలి కాకముందే వెళ్ళిపోండి "  అని తలుపులు మూసేయబోతున్నారు..

" అమ్మా " అంటూ తల్లడిల్లిపోతూ కాత్యాయని చెయ్యి పట్టుకోబోయింది మాధురి.. 

" ఛీ ముట్టకు నన్ను, నిజంగా అమ్మను నేనంటూ, ఒకదాన్ని నీకున్నాను అని, నీకు గుర్తుండి ఉంటే, ఇలా దొంగపెళ్ళి చేసుకునేదానివా, ఇహ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు " అంది కోపంగా కాత్యాయని,.. 

ఎప్పుడూ శాంతం తప్ప మరో భావం కనపడని కాత్యాయని మొహం ఇప్పుడు కోపంతో ఎర్రగా అయిపోయింది.. 

ఆ ఇంటి తలుపులు మూసుకుపోయాయి మాధురి, రిషి మొహాల మీద....

రిషి, మాధురి, బెంగుళూరులో జీవితం మొదలు పెట్టారు.. నాలుగేళ్ళు గడిచాయి... 

కిందటేడు, తాను తల్లిని కాబోతున్న సంబరాన్ని తల్లికి చెప్పుకోవాలని, మాధురి తన ఇంటికి ఫోన్ చేసింది... 

శారద ఫోన్ తీసింది " పిన్నీ నేను మాధురిని.. " అని చెప్పగానే.. " ఛీ.. " అనేసి ఫోన్ పెట్టేసింది శారద... మళ్ళీ ఆ సాయంత్రం మరొకసారి ఫోన్ చేసింది మాధురి... ఈ సారి మళ్ళీ శారదే ఫోన్ తీసి 

" ఏమే శనిదానా, నా కూతురికి కుదరబోయిన బంగారంలాంటి సంబంధం, నీ విషయం తెలిసి తప్పిపోయింది, నీ బాగు నువ్వు చూసుకుని పోయావు, నా పిల్లలు బాధను అనుభవించాల్సి వస్తోంది కదే, నాశనం అయిపోతావే పాపిష్టిదానా.. సిగ్గుంటే మళ్ళీ ఫోన్ చేయకు... " అనేసి ఫోన్ పెట్టేసింది శారద...

" అయ్యో... " అని అనుకుంటూ మనసు పాడుచేసుకుని కూర్చుంది మాధురి... 

రిషి ఎంతగానో నచ్చచెప్పి, మాధురిని మామూలుగా చేసాడు... కానీ వారానికే మాధురికి అబార్షన్ అయిపోయింది... పిన్ని శాపం తగిలినట్లుంది నాకు అని కుమిలిపోతోంది మాధురి... రిషి అలా ఏమీ ఉండదు, ఈ రోజుల్లో ఆడవారికి ఇవన్నీ ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి అని మాధురికి ధైర్యం చెప్పాడు... అయినా మాధురికి దిగులు రోజురోజుకి పెరిగిపోతోంది....

అలా అలా మరో రెండేళ్ళు గడిచాక ఒకరోజు రిషికి ఆరోగ్యం బాగా పాడయ్యింది.. వాంతులు అవుతూ ఉన్నాయి, జ్వరం బాగా వచ్చింది.. వైద్యపరీక్షలు చేసాక తేలింది రిషికి జాండీస్ వచ్చిందని, ఇప్పటికే ముదిరింది అని... మాధురి ఎంతలా ప్రయత్నించినా రిషిని దక్కించుకోలేకపోయింది... ఒక తెల్లవారుజామున రిషి ప్రాణం గాల్లో కలిసిపోయింది...

ఇహ ఇప్పుడు మాధురికి చుట్టూ అనంతమైన దుఃఖం మాత్రమే చుట్టుముట్టి ఉంది... 

ఇంతటి దుఃఖాన్ని తీర్చే వారెవ్వరూ అని మాధురి తోడు కోసం వెతుక్కుంటే చుట్టూ శూన్యమే కనిపిస్తోంది....

ఇన్నాళ్ళూ బిడ్డలు కలగట్లేదని దిగులు పడుతూ ఉండే దాన్ని, ఇహ ఇప్పుడు ఉన్న నా ఒక్క తోడు రిషి కూడా లేడు, అని మాధురికి పిచ్చి పట్టినట్లుగా ఉంది... 

రిషి కొలీగ్ ప్రీతి, వారి పొరుగింటావిడ మనీషా మాత్రం మధ్యమధ్యలో మాధురి దగ్గరకు వచ్చి కాస్తంత ధైర్యం చెప్పి ఒక గ్లాసు పాలు తాగించో, ఒక చపాతీ తినిపించో వెళుతున్నారు...

రిషి పోయిన నాలుగు రోజులకు, ఒక అర్ధరాత్రి దిగులుగా, ఒంటరిగా ఏడ్చుకుంటూ కూర్చున్న మాధురికి, ఇంక నేను బతకటమెందుకు అని అనిపించింది... చనిపోవాలి అని బలంగా అనిపిస్తోంది... పిచ్చి పట్టినట్లు బుర్ర పాడయిపోయి ఉంది మాధురికి... ఫాన్ కి చీర ముడేస్తోంది... చిన్నప్పటి జ్ఞాపకాలు , రిషితో ప్రేమ పెళ్ళి, అమ్మ గారాబం, పిన్ని శాపనార్ధాలు... అన్నీ గుర్తు తెచ్చుకుంటోంది.. కళ్ళ నుండీ ధారగా నీళ్ళు కారిపోతున్నాయి... గుండె వణికిపోతోంది బాధతోనూ, భయంతోనూ, తెలియని ఆందోళనతోనూ, అయోమయంతోనూ...

" అమ్మా మాధురీ... " అని తల్లి గొంతు ఆప్యాయంగా తీయగా వినిపించింది... కళ్ళు మూసుకుని ముడి వేసిన చీర గొలుసులోకి తల పెట్టి చీరముడి బిగించుకోబోతున్న మాధురి, ఆ ప్రయత్నాన్ని ఆపి,  ఆశగా కళ్ళు తెరిచింది, అమ్మ ఉందేమో కళ్ళ ఎదురుగా అన్నట్లుగా... చుట్టూ చీకటి తప్ప మరేమీ లేదు, మరెవ్వరూ లేరు... 

" హు నా పిచ్చి కాబోతే, అమ్మ నా దగ్గరికి ఎందుకొస్తుంది " అని అనుకుంటున్న మాధురికి నిరాశ ముంచుకొచ్చేసింది మళ్ళీ గాఢంగా... 
మళ్ళీ ఉరి పోసుకునే ప్రయత్నం చేయబోతుండగా మాధురికి కళ్ళు తిరిగి వాంతి వచ్చేస్తోంది... 

మంచం పక్కనే వాంతి చేసుకుంది... స్ప్రుహ కోల్పోయి మంచం మీదకి వాలిపోయింది మాధురి...

మర్రోజు పదింటికి మాధురికి తెలివి వచ్చేటప్పటికి హాస్పిటల్ లో ఉంది,  పక్కన ప్రీతి, మనీషా ఉన్నారు.. పొద్దున్నే ఎనిమిదింటికి మనీషా వచ్చి ఎన్నిసార్లు తలుపు తట్టినా మాధురి తలుపు తీయలేదు, వెంటనే ప్రీతిని పిలిచి, వాచ్ మెన్ సాయంతో తలుపు తీసి చూసి మాధురిని హాస్పిటల్ లో చేర్చారు...

మాధురి తల్లి కాబోతోంది, అని డాక్టర్ చెప్పారని ప్రీతి తెలిపింది మాధురికి... 

ఆనందపడాలో లేదో తెలియని మానసిక స్ధితిలో ఉంది మాధురి... మాధురి కాస్త తేరుకున్నాక ఇంటికి వచ్చారు ముగ్గురూ...

ఇంటి గుమ్మంలో కాత్యాయని, పార్ధసారధి కూర్చుని ఉన్నారు... రిషి పోయిన దగ్గర్నుంచీ ప్రీతి కాత్యాయనికి ఫోన్ చేసి చెబుతూనే ఉంది, మాధురి పరిస్ధితి ఏ రకంగానూ బాలేదని...

అంతకుముందు రోజంతా కాత్యాయనికి, శారదకి ఒకటే గొడవ మాధురి కావాలని కాత్యాయని, వద్దే వద్దని శారద.. 

ఆ రాత్రి నిద్రిస్తున్న కాత్యాయనికి నిద్రలో చిన్నతనంలో మాధురితో తాను ఆడే దోబూచులాట కలగా వచ్చింది, కలలో " అమ్మా మాధురీ.. " అని పిలుస్తూ కలవరిస్తూనే ఉంది కాత్యాయని నిద్రలో... 

అవన్నీ చూస్తూ ఉన్న మాధురి తండ్రి పార్ధసారధి, కిందటేడు గుండెపోటు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే కాస్తంత తేరుకుంటున్న, భార్య కాత్యాయని, ఇప్పుడు మళ్ళీ కూతురు కోసం ఇలా కలవరించి కలవరించి ఏమయిపోతుందో అని భయపడి... భార్యను తీసుకుని కూతురి వద్దకు వచ్చేసాడు...

తల్లీతండ్రీ తన కంట పడగానే, మాధురి 
" అమ్మా, నాన్నా... " అని గుండె పగిలేలా అరుస్తూ వచ్చి తల్లీతండ్రి పాదాల దగ్గర కూలబడిపోయి వెక్కివెక్కి ఏడుస్తోంది .. 

" అమ్మా, మాధురీ.. " అని ఆరాటంగా అంటూ ఏడుస్తున్న కూతురిని గుండెలకు పొదువుకునేందుకు ప్రయత్నిస్తోంది తల్లి కాత్యాయని... మాధురి పిచ్చిదానిలా నేలకేసి తల కొట్టుకోబోతుంటే, తండ్రికి కూడా కళ్ళు తడి అయ్యాయి... " వద్దమ్మా వద్దు, ఊరుకో పిచ్చితల్లీ... " అని అంటూ పార్ధసారధి కూడా కూతురిని తన రెండుచేతులతో దగ్గరకు తీసుకున్నాడు....

సంవత్సరానికల్లా పండంటి పాపాయి రష్మిక, మాధురి చేతుల్లో నవ్వుతూ ఆడుకుంటోంది, అమ్మమ్మా తాతయ్యల సంరక్షణలో...

తులసీభాను.
మంగళవారం
16 : 6 : 2020

🌹సేకరణ 🌹

No comments:

Post a Comment