Friday, May 2, 2025

 *విశిష్టాద్వైత కిరణం రామానుజులు*

*ఈ రోజు మే 02 శుక్రవారం శ్రీ రామానుజ జయంతి సందర్భంగా...* 

*యో నిత్య మచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే ।* 
*అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో: రామానుజస్య చరణా శరణం ప్రపద్యే ॥* 
*శ్రియః పతి శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠపురంలో ఆదిశేషునిపై శయనించి దీర్ఘాలోచనలో మునిగి ఉండగా శ్రీమన్నారాయణుని మొట్టమొదటి సేవకుడైన ఆదిశేషుడు స్వామి దీర్ఘాలోచనను పరికించి, ‘ఆవాప్త సమస్త కాములు' అంటే 'పొందవలసిన కోరికలు ఏమి లేని మీకు ఆలోచనలు ఏమిటి స్వామీ, దాసుడు చేయగల సేవ ఏదైనా ఉంటే కృపచేయుము' అని విన్నవించాడు. దానికి సంతోషించిన స్వామి, ‘సంసారంలో పడి ఉన్న జీవులను ఉద్ధరించడానికి నేను ఎన్నో అవతారాలను ఎత్తాను, స్వయంధర్మాన్ని ఆచరించి ప్రబోధించి ప్రచారం చేసాను. అయినా చాలా తక్కువ మందే నా సన్నిధికి చేరారు.* 
*వీరికి ఈ బాధలను ఎలా తగ్గించాలి అనేదే నా ఆలోచన. నీవు భూలోకంలో అవతరించి జీవులను ఉద్ధరిస్తే నాకు సంతోష'మన్నాడు. ‘మహాప్రసాదం’ అని ఆదిశేషుడు ఆజ్ఞను స్వీకరించాడు...*

*ఆనాటి మద్రాసు నగరానికి సమీపంలో ఉన్న శ్రీపెరంబుదూరులో కేశవా చార్యులు, కాంతిమతి దేవి అనే శ్రీవైష్ణవ దంపతులకు కలియుగాది 4,119 సంవత్సరంలో అనగా క్రీ.శ.1017, పింగళ నామ సంవత్సరం వైశాఖ మాసంలో ఆల్ట్రా నక్షత్రంలో ఆదిశేషావతారమైన భగవద్రామానుజులు జన్మించారు. కేశవ సోమయాజి తన కుమారునికి యధావిధిగా వైదిక సంస్కారాలన్నీ జరిపి గర్భాష్టమంలో ఉపనయనం చేయగా, రామానుజులు వేదాధ్యయనం, సంస్కృత సాహిత్యం అభ్యసించారు. 16వ యేట తంజమాంబ అనే కన్యతో వివాహం జరిపిం చారు. తండ్రి పరమపదించిన తరువాత శాస్త్రాధ్యయనానికి కాంచీపురం చేరుకున్నారు రామానుజులు. అక్కడ యాదవ ప్రకాశులు అనే మహాపండితుల వద్ద శాస్త్రాధ్యయనం ప్రారంభించారు.*

*ఆ సమయంలో ఆ దేశపు రాజకుమార్తెను ఒక బ్రహ్మరాక్షసి ఆవహించగా, రాజు తన గురువైన యాదవ ప్రకాశులను పిలిపించారు. నివారణ కోసం యాదవ ప్రకాశులు చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైనది. చివరికి రామానుజుల వారి పాదస్పర్శతో ఆ రాక్షస పీడ వీడింది. అది చూచి గురువుగారి మనసు ఈర్ష్యతో నిండింది . మరొక సందర్భంలో యాదవ ప్రకాశులు ఉపనిషత్తు పాఠం చెబుతున్నపుడు గురువు చెప్పిన ఉపమానం అనుచితంగా ఉండడంతో రామానుజులు ఆయన అనుమతితోనే మంచి ఉపమానం చెప్పారు. అది విన్న తరువాత యాదవ ప్రకాశులకు రామానుజులు తనను మించిపోతాడనే అసూయ కలిగింది. ఇతని వల్ల తన ఉనికికి ప్రమాదమని రామానుజులను చంపించాలని ప్రయత్నం చేసారు. కాశీయాత్ర అనే ఒక సాకు పెట్టి రామానుజులను తీసుకొని బయలుదేరారు. అయితే రామానుజుల పినతల్లి కుమారుడు గోవిందునికి ఈ విషయం తెలిసి రామానుజుల వారికి చెప్పారు. దానితో యాదవ ప్రకాశులను విడిచిపెట్టి బయలు దేరిన రామానుజులు దారి తప్పి అడవిలో చిక్కుపడగా కంచి వరదరాజస్వామి అమ్మవారితో కలిసి బోయ రూపంలో వచ్చి రామానుజుల వారిని జాగ్రత్తగా కాంచీపురానికి చేర్చారు. అక్కడే చామరసేవ చేస్తున్న మహాజ్ఞానులైన కాంచీపూర్ణుల వారి పరిచయం జరిగింది.*

*మూడు ప్రతిజ్ఞలు*

*ఇదిలా ఉండగా శ్రీరంగంలో శ్రీయామునాచార్యులనే మహాపండితులు ఉండే వారు. వారు రామానుజుల వారి ప్రతిభను విని తమ తరువాత శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని ప్రవర్తింపచేయగలిగిన వారు రామానుజులే అని నిశ్చయించుకొని తమ శిష్యులైన పెరియనంబిని రామానుజుల వద్దకు పంపారు. అయితే రామానుజాచార్యుల వారు వచ్చేసరికి యామునాచార్యుల వారు పరమపదించారు. ఆ వార్త విని రామానుజులు ఎంతో దుఃఖించి యామునాచార్యుల వారి పార్థివదేహాన్ని పరీక్షగా చూస్తూ వారి చేతి మూడువేళ్ళు ముడుచుకొని ఉండడం గమనించి వీరి వేళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉండేవా ఇప్పుడు ఈ మార్పు వచ్చిందా అని వారి శిష్యులను అడిగారు. ఈ మార్పు ఇప్పుడే వచ్చింది అని వారు చెప్పారు. దానితో యామునాచార్యులు తన శిష్యులకు ఏదైనా చెప్పాలనుకున్నారేమో అని అనగా దీర్ఘంగా ఆలోచించిన భగవద్రామానుజులు*

*1) పంచ సంస్కారాలు పొంది, పొందించి ఆళ్వార్ల ప్రబంధాన్ని లోకంలో ప్రవర్తింప చేస్తాను.*

*2) తత్త్వార్థము తెలిపి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేస్తాను.*

*3) పరాశర మహర్షి విష్ణుపురాణం అందించి, వేదవ్యాస భగవానుడు బ్రహ్మ సూత్రాలను రచించి వేద విభాగములు చేసి లోకానికి మహోపకారం చేసారు. ఆ ఇద్దరి పేర్లను ఈ సంసారంలో చిరస్థాయి చేస్తాను, అని మూడు ప్రతిజ్ఞలు చేసారు. అలా ప్రతిజ్ఞలు చేయగానే యామునాచార్యుల వారి మూడు వేళ్ళు విడిపోయాయి.*

*వార్తాషట్కం*

*యామునాచార్యుల వారిని చూడకుండా చేసారని రామానుజులు రంగనాధునిపై అలిగి, మరలా కాంచీపురం చేరి కాంచీ పూర్ణులు ప్రతి నిత్యం వరదరాజస్వామితో మాట్లాడ తారని తెలిసి వారి ద్వారా ఆరు వార్తలను వరదరాజస్వామిని అడిగి తెలుసుకున్నారు. దీన్నే వార్తాషట్కం అంటారు. అవి*

*1) శ్రీమన్నారాయణుడే పరమ తత్త్వము*

*2) జీవాత్మ పరమాత్మకు భేదం నిత్యము*

*3) మోక్షోపాయము ప్రపత్తి ఒక్కటే*

*4) అంతిమ కాలంలో దైవ చింతన చేయకున్నా విచారించవలసిన పనిలేదు*

*5) శరీరాన్ని విడిచిన తరువాత ప్రపన్నులు వెంటనే మోక్షమును పొందుతారు.*

*6) మహాపూర్ణులను ఆశ్రయించి పంచ సంస్కారాలను పొందుము.*

*ఇలా వరదరాజస్వామి ఆజ్ఞానుసారం మహాపూర్ణులను కలుసుకొని పంచ సంస్కారాలను పొంది ఆరు నెలల్లో అన్ని శాస్త్రాలను ఆళ్వార్ల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేసారు. అటు తరువాత దేవరాజ సన్నిధిలో సన్యాసాశ్రామాన్ని స్వీకరించారు. వరదరాజులే వారిని స్వయంగా 'యతి రాజా' అని సంబోధించారు. ఆ తరువాత తమకు పూర్వ గురువులైన యాదవ ప్రకాశులు, తమ తల్లి వల్ల రామానుజ వైభవాన్ని విని స్వప్నంలో స్వామి ఆజ్ఞ వలన శ్రీరామానుజులను ఆశ్రయించి వారి వల్ల పంచ సంస్కారాలను పొంది గోవిందదాసులుగా పేరు గాంచారు.*

*స్వయంగా శ్రీరంగనాధుడే రామానుజుల వారిని శ్రీరంగానికి పిలిపించి లీలావిభూతి, నిత్య విభూతులపై అనగా ఉభయ విభూతి నాయకత్వాన్ని రామానుజులకే అందించారు. అప్పటి నుంచి రామానుజులు 'యతిరాజులు', 'ఉడయవర్లు’ అనే సార్థక నామాన్ని పొందారు.*

*రామానుజులు గోష్ఠీపూర్ణుల వద్దకు 18 సార్లు తిరిగి అతికష్టం మీద వారి వల్ల తిరుమంత్ర చరమ శ్లోక రహస్యార్థాలను తెలుసుకోగలిగారు. ఈ మంత్రార్థం తెలియడం తనకే ఇంత కష్టమైతే ఇక సామాన్యుల గతి ఏమిటి అని పామరులపై జాలి తలచిన రామానుజులు తాను తెలుసుకున్న అర్థాన్ని గుడి గోపురం ఎక్కి అందరికి అందించారు. ఆ వార్త విన్న గురువు రామానుజులను పిలిచి, 'పరీక్షించకుండా ఎవరికీ ఉపదేశించవద్దు' అని చెప్పినా గురుద్రోహం చేసినందుకు నరకం వస్తుందని తెలియదా అని ఆగ్రహించారు. 'స్వామీ! క్షమించండి, మంత్రార్థాన్ని నేను ఒక్కడినే దాచుకుంటే నా ఒక్కనికే మోక్షం వస్తుంది అదే అందరికీ చెబితే వారందరికీ కూడా మోక్షం వస్తుంది. ఇంత మందికి మోక్షం వచ్చినపుడు నా ఒక్కనికి నరకం వచ్చినా సంతోషమే' అన్నారు రామానుజులు. దాన్ని విన్న గోష్టీపూర్ణులు ఏమి ఔదార్యమని, ఎంతటి సాహసం అని సంతోషించి 'ఎంబెరు మానారే' అంటే 'నా నాథ' అని ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచి రామానుజులకు 'ఎంబెరుమానారే' అనే నామం కూడా సార్థకమైంది. అంతే కాక ఆనాటి నుంచి శ్రీవైష్ణవ సిద్ధాంతం 'రామానుజ సిద్ధాంతం'గా పిలవబడుతుంది అని వరమిచ్చారు.*

*యామునాచార్యుల శిష్యుల నుంచి సంస్కృత సాహిత్యం, తిరువా యముడి వంటి సకల ద్రావిడ సాహిత్యాన్ని అనతి కాలంలోనే గ్రహించారు. ఆ తరువాత వ్యాస భగవానుని బ్రహ్మ సూత్రాలకు విస్తృత వ్యాఖ్యగా పేరు గాంచిన 'బోధాయన సూత్ర వృత్తి' అనునది కాశ్మీర దేశంలో శారదాపీఠంలో ఉన్నదని తెలుసుకొని కూరేశులను వెంటబెట్టుకొని శారదాపీఠానికి వెళ్ళి అక్కడి వారు సహకరించకున్నా ఆ గ్రంథాన్ని ఒక రాత్రిలో కూరేశులు సంపూర్ణంగా చదివారు. ఆ గ్రంథాన్ని వారికి ఇచ్చేసి ఏక సంథాగ్రహి అయిన కూరేశుల సహ కారంతో రామానుజులు బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యాన రూపంలో అద్భుతమైన 'శ్రీ భాష్యము'ను రచించారు. ఈ గ్రంథానికి స్వయంగా శారదాదేవే 'శ్రీ భాష్యం' అని నామకరణం చేసి, రామానుజుల వారికి 'శ్రీ భాష్యకారులు' అని బిరుదు నిచ్చారు. ఆ తరువాత కురత్తాళ్వార్లకు రంగనాధుని వర ప్రసాదంగా లభించిన ఇద్దరు పుత్రులకు పరాశరభట్టరు, వ్యాస ~ భట్టరు నామకరణం చేసి యామునాచార్యుల వారి మూడవ కోరికను తీర్చారు. ఆ తరువాత భగవద్రామా నుజులు శ్రీరంగం, కరిశైలం, అంజనగిరి, తక్ష్యాద్రి, సింహాచలం, శ్రీకూర్మం, బదరీ నారాయణం మొదలగు దివ్య దేశాలన్ని తిరిగి ఆయా క్షేత్రాలలో ఆరాధనా విధానాలను పరిష్కరించారు. తిరుమలలో శ్రీ వేంకట నాధుడు తన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఇచ్చిన శంఖ చక్రాలను తిరిగి స్వామివారికే ప్రసాదించి శ్రీనివాసునికే ఆచార్యుడయ్యాడు. అందుకే ఈనాటికీ తిరుమలలో స్వామివారి ఆలయంలో హుండీ రామానుజులవారికి ఎదురుగా ఉంటుంది.*

*సంఘ సంస్కర్త*

*క్రిమి కంఠుడనే వైష్ణవ ద్వేషి రామానుజులను బంధించాలని చూడగా ఆయన శ్రీరంగాన్ని విడిచి తిరునారాయణపురం చేరారు. అక్కడ ఉండగా భగవంతునిపై భక్తి ఉన్నవారు అందరూ, అన్ని కులాల వారు సమానమే అని ప్రకటించి హరిజనులకు ఆనాడే ఆలయ ప్రవేశం కలిగించారు. ఆ విధంగా ఆయనను మహా సంఘసంస్కర్త, సమతామూర్తి అనవచ్చు. తమ తరువాత కూడా శ్రీమద్రామానుజ సిద్ధాంతం అవిచ్చిన్నంగా కొనసాగాలని 74 మంది పీఠాధిపతులను నియమించి, నలుగురు సింహాసనస్థలను ఏర్పాటు చేసి, 1200 మంది ఏకాంగులను ఏర్పరిచారు. ఇంకా వేల సంఖ్యలో ప్రచారకులను నియమించారు. వారి శిష్యులు గురువు గారిని వీడి తాము బ్రతకలేము అని విలపిస్తే వారికి 82 మహా వాక్యాలుగా ప్రవర్తనా నియమావళిని అందించారు. శిష్యుల మీద దయతో తమ ఆకారంతో మూడు శిలా విగ్రహాలను నిర్మింపచేసి వారికి కళావాహ నాదులు చేసి తామే స్వయంగా ఆ విగ్రహాలను కౌగిలించుకొని తమ తేజస్సును ఆ విగ్రహాలలో ప్రవేశింపచేసారు. ఆ మూడు విగ్రహాలను శ్రీరంగం, శ్రీపెరుంబుదూరు, తిరునారాయణపురం అనే మూడు క్షేత్రాలలో ప్రతిష్ఠించారు. రామానుజుల వారి ఆజ్ఞతో అనంతాళ్వార్లకు రామానుజులే స్వయంగా ఇచ్చిన రామానుజ మూర్తిని శ్రీనివాసుని ఆజ్ఞతో తిరుమలలో ప్రతిష్ఠింపచేసారు. భగవద్రామానుజులు తాము చేయదలచిన అన్ని అవతార కృత్యాలను 120 సంవత్సరాలలో పూర్తి చేసారు.*

*గోవింద భట్టరు ఒడిలో తలపెట్టి, ఆంధ్రపూర్ణుల ఒడిలో పాదాలనుంచారు. తమ ఆచార్య మహాపూర్ణుల పాదాలను మనసులో నిలుపుకొని శ్రీయామునాచార్యుల వారికి దాసోహాలు సమర్పించారు. శిష్యులందరూ ఆనందవల్లి, భృగువల్లి, తిరువాయ్ముడి దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తుండగా దివిలో, భువిలో ఎన్నో మంగళవాయిద్యాలు మోగు తుండగా మాఘశుద్ద దశమి శనివారం మధ్యాహ్న సమయంలో భగవద్రామా నుజులు బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని తన స్వస్థానమైన పర మపదానికి వేంచేసి తిరిగి స్వామి కైంకర్యంలో లీనమయ్యారు.*

*┈━❀꧁గురుభ్యోనమః꧂❀━┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌺🌺🌺 🙏🕉️🙏 🌺🌺🌺

No comments:

Post a Comment