*శంకర జయంతి*
*ఈ రోజు మే 02 శుక్రవారం శ్రీ శంకర జయంతి సందర్భంగా...*
*శంకరులు హైందవ ధర్మ పునరుత్థానానికి పునాదులు వేసిన ఆదిగురువు. 'అహం బ్రహ్మాస్మి', 'తత్వమసి' అని ప్రవచిస్తూ కాలాతీత దివ్యత్వమైన పరబ్రహ్మాన్ని తన అద్వైత సిద్ధాంతాలతో మానవాళికి విశదపరచిన మహాజ్ఞాని. హరిహర భేదాన్ని సులభ గ్రాహ్యం చేసే శివానందలహరి, సౌందర్యలహరి, భజ గోవిందం వంటి ఉత్కృష్ట రచనలతో వేదాంతసారం కరతలామలకం కావించి నిత్య పారాయణానికి అందుబాటులోకి తెచ్చి ఆధ్యాత్మిక హృదయాలకు ఆనందం కలిగించారు.*
*మనిషి చూస్తున్న ప్రపంచం, కార్యకారణ పర్యవసానాల మధ్య సాగే ఒక మహా నాటకమని గుర్తించిన మహామేధావి శంకరులు. ఆయన ప్రతిపాదించిన అద్వైత వాదానికి మూలసూత్రమైన కర్మ సిద్ధాంతం చెప్పేది ఈ కార్యకారణాలనే. భౌతిక ప్రపంచంలో మనిషి ఉనికిని ప్రభావితం చేసేవి ఈ కార్యకారణాలేనని, ఆత్మకు మాత్రమే వాటిని నియంత్రించగల శక్తి ఉందని*
*తెలియజెప్పారు కార్యకారణాల ప్రభావం సన్నగిల్లాలంటే 'నువ్వెవరో' నువ్వు ముందు తెలుసుకోవాలన్నారు. సకల చరాచర జగత్తు ఒకే ఒక ఆత్మతత్వం నుంచి ఉద్భవించిందని, జీవాత్మ పరమాత్మలన్నవి ఒక్కటేనని, ద్వైతానికి తావే లేదని ఆయన నిర్ద్వందంగా చెప్పారు. ఆ సిద్ధాంత సారమే ఆయన మన ముందుంచిన మాయావాదం. జగత్తును సృష్టించింది దేవుడని ఆయన ఒక్కడే మనుషుల కర్మ లన్నీ నిర్దేశించి కర్మఫలాలు నిర్ణయిస్తాడని నిర్దుష్టమైన వాదనలతో నిరూపించారు. ఆయన తార్కిక జ్ఞానం తిరుగులేనిది. తెలిసిన దాని నుంచి తెలియని ఆ బ్రహ్మాన్ని చేరుకునే శరణాగతుడు కాగల అత్యుత్తమ అవస్థకు మనిషిని చేర్చేలా ఆయన వాదనలుంటాయి.*
*శంకరులు వేదాల్లో ఉన్న వైదిక ధర్మాన్నంతా తన రచనలన్నింటిలో పొందుపరచారు. పది ఉపనిషత్తుల్ని ఎంచుకుని భాష్యాలు రచించారు. అవి ఈశ, కేన, కథ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు. ప్రపంచంలో లౌకిక మనిషికి తానున్న వాతావరణంలో, జగన్మిథ్యత్వం అంటే ఏమిటని అర్థం కావటానికి, అనే కత్వభావనల నుంచి అతణ్ని బయట పడవేయటానికి సుగమమైన మార్గాలన్నీ ఆయన చేసిన అన్ని రచనలూ ప్రస్ఫుటిస్తాయి. అద్వైత జ్ఞానభక్తికి ఆయన ఆద్యులు. గంగాభిషేకంలో హరిహరులని ఆయన ద్వైతం లేని దివ్యత్వంపై తన మనసు లగ్నమయ్యేలా అనుగ్రహించమని అర్థిస్తారు. దేహం కలిగించే*
*నేను' అనే భావన తొలగి, సర్వబంధాల నుంచి విముక్తి కలిగి, తిరిగి తానే అనంత దైవత్వంలో లీనం కావటానికి ఆయన చేసిన ప్రార్థనల సారాంశమే వివేక చూడామణి. విష్ణుసత్పతిలో అహంకార రహితుణ్ని చేసి, బుద్ధికి ఉపశమనం కలిగిస్తూ, కోరికలకు, దురాశకు దూరంగా తనను నడిపించమంటారు.*
*వైదిక కర్మలన్నీ దేహాన్ని, మనసును శుద్ధిపరచుకుని వేదాంత జిజ్ఞాస పెంపొందించుకునేందుకే ఉన్నవని నమ్మిన శంకరులు వేదాంత విచారం కోసం- ఇతర వర్ణాశ్రమాల కన్నా, సన్యాసాశ్రమమే సరైనదని భావించారు. అతి పిన్నవయస్సులోనే అది స్వీకరించారు. అహాన్ని అధిగమించి దాని స్థానంలో ఆత్మసాక్షిని ప్రవేశపెట్టుకునేందుకు అదే సరైనదని అనుకున్నారు. పన్నెండు సంవత్స రాల ప్రాయంలోనే వేదాలు నాలుగూ క్షుణ్నంగా అధ్యయనం చేసి పన్నెండు శాస్త్రాల్లో తిరుగులేని పాండిత్యం సంపాదించారు. ఆనేతు హిమాచల పర్యంతం కాలినడకన పర్యటించి సనాతన ధర్మ సత్ సంప్రదాయాలను సంరక్షించారు. హైందవ ధర్మజ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండేందుకు దేశం నలుమూలలా ధర్మపీఠాలు ఏర్పాటుచేశారు. పరమశివుడి అపరావతార మని అందరూ నమ్మే ఆ మహాగురువు, నాలుగు పదుల వయస్సు నిండకుండానే శివ సాయుజ్యం పొందారు. మే నెలలో వైశాఖ శుక్ల పంచమినాడు జరిగే ఆయన జయంతి హిందూ ధర్మావలంబులు అందరికీ పర్వదినం.*
*┈━❀꧁గురుభ్యోనమః꧂❀━┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏🚩🙏 🌹🕉️🌹 🙏🚩🙏
No comments:
Post a Comment