Friday, May 2, 2025

 కథానిక : 'మానవత వర్ధిల్లాలి.'

రచన : ద్విభాష్యం రాజేశ్వరరావు.

(మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథానిక.)


"కాఫీ తీసుకోండి!"
ఫ్యాక్టరీ నుండి వచ్చి పేము కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్న సద్గుణ రావు, భార్య జయంతి పిలుపుతో కళ్ళు తెరిచి కాఫీ కప్పు అందుకున్నాడు.
వేడి కాఫీ చప్పరించేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది అతనికి! 
"కంపెనీలో మీ 'యూనియన్ టాక్స్' ఎంతవరకు వచ్చాయి?"భర్తతో బాటు తాను కూడా కాఫీ సిప్ చేస్తూ కుతూహలంగా అడిగింది.
"మేము అనుకున్నవన్నీ యాజమాన్యం ముక్కు పిండి మరీ, పదిశాతం బోనస్ తో సహా, సాధించుకున్నాం. బుధవారం అగ్రిమెంట్ మీద సంతకాలు అయిపోతే మా కార్మికులందరూ, యూనియన్ ప్రెసిడెంట్ గా, నాకు మారుతి డిజైర్ కారు బహుమతిగా ఇస్తారు."గర్వంగా అన్నాడు సద్గుణ రావు. 
"మొత్తానికి సాధించారన్నమాట! గ్రేట్! కంగ్రాట్యులేషన్స్!" అంటూ తన కాఫీ కప్పు టేబుల్ మీద ఉంచింది.

         జయంతి, సద్గుణ రావు బీఎస్సీలో సహథ్యాయులు. ఇద్దరూ కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నారు. డిగ్రీ తీసుకున్నాక సద్గుణ రావు ఓ పెయింట్స్ కంపెనీలో టెక్నీషియన్ గా చేరిపోయాడు. ఉద్యోగం వచ్చాక ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అతని ప్రోద్బలంతో జయంతి ఎమ్మే సోషియాలజీ చదివి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా చేరింది. జయంతి సభ్యతకు, సంస్కారానికి జోహార్లు అంటాడు సద్గుణ రావు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో భార్య సలహాలు తప్పక పాటిస్తాడు. 

"మీకు మరో చిన్న కార్మిక సమస్య. మన పనిమనిషి సూరమ్మ ఐదు వందల రూపాయలు జీతం పెంచమంటోంది. మనం ఇచ్చే జీతం సరిపోవటం లేదట!"అంది జయంతి నవ్వుతూ. 
"అయితే మనమేం చేయగలం?ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాం కదా! ఇప్పట్లో పెంచేది లేదని చెప్పు!"అన్నాడు సద్గుణ రావు విసుగ్గా ముఖం పెట్టి. 
"సూరమ్మ మీతో మాట్లాడాలి అంటోంది..."అంటూ"...సూరమ్మా! ఇలా రా!"అని కేక పెట్టింది.

సూరమ్మ మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చి డ్రాయింగ్ రూమ్ తలుపు వెనకే నిలబడిపోయింది. ఆమెకు యాభై సంవత్సరాలు పైనే ఉంటాయి. ముగ్గురు పిల్లలు ఉన్న అతిబీద సంసారం ఆమెది. ఈ ఇంట్లో పని చేస్తూ, ఆ జీతంతో ముగ్గురు పిల్లల్ని సాక్కొస్తోంది.
"ఏం సూరమ్మా! జీతం చాలటం లేదన్నావా?"అడిగాడు. 
"బాబూ! పొద్దుటేల నుండి పొద్దు పోయే వరకు మీ ఇంట్లో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నాను ! వంట చేయటం, అంట్లు  తోమటం, పిల్లల క్యారేజీలు కట్టడం, ఇల్లు ఊడ్చటం, బట్టలు ఉతకడంతో సహా అన్ని పనులూ చేస్తున్నాను. ఈ పనంతా మీరు ఇచ్చే జీతానికి మాత్రమే ఆశపడి చేయటం లేదు బాబూ! మీరు పెట్టే గుప్పెడు మెతుకులకు, గ్లాసుడు కాఫీ నీళ్ళకు ఆశపడి చేస్తున్నాను! కానీ నా కడుపు గురించి నేను చూసుకుంటే, నా కొడుకుల ఆకలి ఎలా తీరుతుంది? వాళ్ళ చదువులు ఎలా సాగుతాయి? ఈ ఇంట్లో పనికి కుదురుకొని మూడు సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి దాకా పైసా పెంచమని అడగలేదు !అందుకని ఓ ఐదు వందలు పెంచితే మీ రుణముంచుకోను." అంది రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ.
"ఆ సోది అంతా చెప్పకు! ఇప్పట్లో నీ జీతం పెంచడం కుదరదు. మరో ఏడాది ఆగు! అప్పుడు ఆలోచిద్దాం!" అన్నాడు విసుగ్గా.
"మూడు సంవత్సరాల బట్టీ ఆగలేదా బాబూ... ఇప్పుడు కష్టంగా ఉంది." అంది బతిమాలుతున్నధోరణిలో.
"సూరమ్మ! నన్ను విసిగించకు! ఇష్టముంటే పని చెయ్యి! లేదా వేరే ఇల్లు చూసుకో ! నమ్మకంగా ఉంటున్నావని మూడు వేలు ఇస్తున్నాం. ఆశకు అంతు ఉండాలి!"అంటూ చిరాకుగా పేపర్ చేతిలోకి తీసుకున్నాడు సద్గుణ రావు. 
సూరమ్మ మరి మాట్లాడలేదు."పోనీలే బాబూ!"అంటూ గొణుక్కుంటూ అక్కడనుండి కదిలిపోయింది.  రెండు నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది.

తర్వాత జయంతి తన వంక అదోలా చూడటం గమనించి,"ఏమిటి అలా చూస్తున్నావ్?" అన్నాడు సద్గుణ రావు.
జయంతి చిరునవ్వుతో,"అబ్బే ఏమీ లేదు... మధ్యాహ్నం వరకు కార్మికుల తరఫున వకాల్తా తీసుకొని మేనేజ్మెంట్ తో వాద ప్రతి వాదనలు కొనసాగించి వచ్చారు. ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ కుర్చీలో కూర్చున్నారు. పరస్పర విరుద్ధమైన భావాలను ఎంత చక్కగా ప్రకటించగలుగుతున్నారో చూస్తున్నాను!" అంది .
ఆ మాటలలో ఉన్నది నిజాయితీయో లేక వ్యంగ్యమో గ్రహించ లేకపోయాడు.
"నీకు తెలీదు జయా! వీళ్ళు అలాగా జనం! వీళ్ళ ఆశకు అంతు ఉండదు! కాస్త మెత్తగా ఉంటే నెత్తికెక్కుతారు!! జీతం పెంచకపోతే సూరమ్మ ఏం చేస్తుంది?! పనిలోకి రావడం మానేస్తుంది, అంతే కదా! మనకు మరో పని మనిషి దొరక్కపోదు!" అన్నాడు జయంతి వంక చూస్తూ.
"అవును నిజమే! సూరమ్మ మానేస్తే మరో పుల్లమ్మ వస్తుంది. కానీ మన సూరమ్మ పని మానదని  నాకు నమ్మకం ఉంది!" అంది .
ఆమె ఎంత మెల్లగా మాట్లాడినా, గొంతులోని ఆవేశం అణిచి పెట్టుకోలేకపోయింది. 
ఆమె పెదాలు వణకటం గమనించి కాస్త ఆశ్చర్యంతో అడిగాడు సద్గుణ రావు."ఎందుకలా అంటున్నావు? చెప్పకుండా హఠాత్తుగా పని మానేయకూడదని అగ్రిమెంట్లు ఉన్నాయా? బాండ్ పేపర్ మీద సంతకాలు ఉన్నాయా? మానేస్తే అడిగేది ఎవరు? అడగగలిగింది ఎవరు?"
"మానేస్తే ఎవరూ అడగలేని మాట వాస్తవమే. అయితే మీరు ఏ విధమైన అపాయింట్మెంట్ ఆర్డర్ దాని చేతికి ఇచ్చారని అది అగ్రిమెంటు రాస్తుంది? మీరు ఏ విధమైన జాబ్ సెక్యూరిటీ చూపించారని అది బాండు రాస్తుంది? మనం దానికి ప్రావిడెంట్ ఫండ్ జమ చేస్తున్నామా... మెడికల్ ఇన్సూరెన్స్ చేయించి రోగాలకు అయ్యే ఖర్చులు భరిస్తున్నామా.. బోనస్లు ఇస్తున్నామా.. పెన్షన్ చెల్లించబోతున్నామా?... అవన్నీ లేనప్పుడు హఠాత్తుగా మానేసే హక్కు దానికి ఉంది! కాదంటారా?" మాటలు ముగించేసరికి ఆమె ముఖం కందగడ్డలా అయిపోయింది.
"ఎందుకు కాదంటాను? అందుకే పని మానేస్తుందని చెప్తున్నాను!" అన్నాడు సద్గుణరావు. 
జయంతి వింతగా నవ్వింది." పని మానేస్తే భుక్తి గడవద్దా దానికి? అది మీలా 'వర్కు టు రూల్' పాటించలేదు. నల్ల బ్యాడ్జీలు ధరించలేదు. సమ్మె చేయలేదు. సూరమ్మే కాదు... ఈ వ్యవస్థలో వ్యవసాయ కూలీలు గాని వెట్టి చాకిరీ చేసే వాళ్ళు గాని; ఈ రకం కార్మికులు ఎవ్వరూ పని మానేసి యజమానిని ఎదిరించలేరు. కేవలం పారిశ్రామిక కార్మికులకు మాత్రమే ఆ హక్కు ధారా దత్తమయింది."
జయంతి మాటల్లో ఆవేశం చూసి మతి పోయినట్లయింది అతనికి. ఆమెలో వింత వ్యక్తిని దర్శిస్తున్నట్లు అనిపించింది!

      మాటలు కూడదీసుకుంటూ అన్నాడు" జయంతీ! పారిశ్రామిక కార్మికులతో పని మనుషులను, వ్యవసాయ కూలీలను పోల్చకు! పరిశ్రమల్లో కార్మికుల వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయో నీకు తెలియదా? ఘోరమైన ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం పారిశ్రామిక కార్మికులను వెన్నంటి ఉన్నాయని మరిచిపోకు! మేము ఎంత రిస్కు తీసుకుంటున్నామో లెక్కలోకి తీసుకోవద్దా?!"           జయంతి బరువుగా ఊపిరి పీల్చుకుని ఒక క్షణం ఆగి తర్వాత అంది." పరిశ్రమలో ఒక కార్మికునికి ఎంత రిస్కు ఉందో వ్యవసాయ కూలీలకీ అంతే రిస్కు ఉంది. ఆఖరికి రోడ్డుమీద నడిచే మనిషికీ రిస్కుంది! ఈ దేశంలో పరిశ్రమల్లో చావుల కంటే రోడ్డు ప్రమాదాలలో చావులు ఎక్కువ అనే సంగతి మర్చిపోకండి. పరిశ్రమలలో ప్రమాదం జరిగితే ఆ కార్మికుడ్ని ఆదుకునేందుకు ఈఎస్ఐ హాస్పిటల్స్, రకరకాల ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి. పరిశ్రమల్లో ఆసుపత్రులు ఉన్నాయి. అయితే పొలం దున్నే జీతగాడిని ఎద్దు డొక్కాలో పొడిస్తే ఏ రాజ్యాంగ సూత్రం ఆదుకుంటుంది? ఏ పారిశ్రామిక చట్టం అతనికి కట్టు కట్టిస్తుంది ?ఏ ఆసుపత్రి అతనికి ఉచితంగా మందులు ఇస్తుంది? అతడి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటున్నారు?.. చెప్పండి! ఇక వాతావరణ కాలుష్యం సంగతి అంటారా.... నలభై ఏళ్ల క్రితం భోపాల్ విషవాయు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో హెచ్చు మంది ఊళ్లో ప్రజలే! అందులో పని చేసే కార్మికులు కాదు!!"

                 సద్గుణ రావుకు తన వాదం వీగిపోవటంతో పౌరుషం ముంచుకొచ్చింది!"అయితే పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇంతింత జీతాలు ఎందుకు ఇస్తున్నారు? యజమానులు మూర్ఖులు అనుకుంటున్నావా?" అన్నాడు గొంతు పెంచి.
"పరిశ్రమల యజమానులు మూర్ఖులు కాదు. వాళ్ళు అంతంత జీతాలు ఇవ్వడానికి కారణం కార్మికులు చేసే పనిని బట్టి కాదు నిజానికి !"
"మరి దేన్ని బట్టి? సరదాకిస్తున్నారా?!" ఆమె మాటలకు అడ్డు తగిలాడు సద్గుణ రావు.
" మీ పారిశ్రామిక కార్మికుల వెనుక 'ఆర్గనైజ్డ్ లేబర్ యూనియన్' లు ఉన్నాయి. అందువలన మీకు 'బార్గైనింగ్ కెపాసిటీ' ఉంది. మీరు మీ యజమానులకు 'టరమ్స్ డిక్టేట్' చేయగలరు. ఈ దేశంలో మేలుపొందుతున్న కార్మికులు కేవలం పారిశ్రామిక కార్మికుల మాత్రమే! జీతాలు పెంచుకునేది, బోనస్ లు రాబట్టుకునేది మీ ఒకకోటి మంది మాత్రమే! సూరమ్మ లాంటి ముఫై కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో పీడింపబడుతూనే ఉన్నారు. నిజానికి వాళ్లు రోజులో మీ కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. పారిశ్రామికంగా మీరు ఇచ్చే ఉత్పాదక శక్తి కంటే వ్యవసాయంలో, ఇతర రంగాలలో వారి ఉత్పాతక శక్తి మూడింతలు ఉంటుంది! అయితే వాళ్లకి సంఘటితశక్తి లేదు!" జయంతి మాటలు ఆపింది. ఆమె ముక్కుపుటాలు ఎగిరి పడుతున్నాయి.

 సద్గుణ రావు కొంతసేపు మౌనం వహించాడు . 
తర్వాత "వాళ్లందరూ సంఘటితమై వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాడవచ్చు కదా... వాళ్లకు పోరాడే శక్తి, బేరం చేసే శక్తి వచ్చిన నాడు మనం ఎలాగూ జీతం పెంచక తప్పదు! ఇప్పుడు ఎందుకు పెంచాలి?" అన్నాడు. 
"నాలుగు గోడల మధ్య ఉంటున్నారు కనుక మీకు సంఘటితం కావటం సులువవుతోంది. అదీగాక , మీకు చదువు ఉంది! ఆదుకునే ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉంది. కార్మిక చట్టాల్లోని మంచి చెడ్డలు అర్థం చేసుకొని ఎదరకు నడిపించే నాయకత్వం ఉంది. మిగిలిన వాళ్లకు సంఘటితమై ఒక సంఘంగా ఏర్పడడానికి ఈ దేశంలో అవకాశాలు చాలా తక్కువ....." అంటూ జయంతి ఒక్క క్షణం మాటలు ఆపి, తర్వాత మెల్లగా అంది "సూరమ్మకు ఈ నెల నుండి జీతం ఐదు వందలు పెంచుదాం. రేపు పండగకు ఒక చీర బోనస్ గా ఇద్దాం. కాదనకండి ప్లీజ్! సూరమ్మ లాంటి పని మనుషుల విషయంలో మనం చూడవలసింది
 బార్ గైనింగ్ కెపాసిటీ కాదు! వాళ్ళ యెడల మనం చూపవలసింది మానవతా దృక్పథం! అంతే!!" అంటూ మెల్లగా లేచి కాళీ కప్పులు ట్రేలో సర్దింది .

సద్గుణ రావు మరి మాట్లాడలేదు!
                             *********

No comments:

Post a Comment