Friday, May 2, 2025

 వార్ అండ్ పీస్ :- 
యుద్ధమూ శాంతీ :-

వాలెంటైన్స్ డే స్పెషల్. 
🌹

 "జీవితమే సఫలమూ ...రాగసుధా భరితమూ ...ప్రేమకధా మధురమూ ...ఈ జీవితమే .."

"ఏవండోయ్ శ్రీవారూ... పొద్దుపొద్దుటే కాఫీ కూడా తాగకుండా ఈ ప్రేమ పాటలేమిటో ...ఇదిగోండి కాఫీ"  

"కాఫీ సంగతి తరువాత ...ముందుగా మనింట్లో అందంగా పూసిన ఈ ఎర్ర గులాబీ అందుకో ...మోకాళ్ళమీద కూర్చుని ఇవ్వాలని ఉంది గానీ కాళ్ళు నెప్పులోయ్ ..ఇలా నిలబడే ఇస్తున్నా పుచ్చేసుకో. 

"ఏవిటీ వేషాలూ ...రాత్రి చేసిన "సునాముఖి ఆకు " చారు తేడా చేసినట్లుంది. "పైత్యాంతక లేహ్యం" ఒక స్పూను ఇమ్మంటారా ...

"అయ్యో ! ఇంత మొద్దు ముఖానివేంటే ...ఈ రోజు ఎంత గొప్పదినం ...ప్రేమికుల దినం. అందుకే నీకీ గులాబీ ఇచ్చింది. ఆనందంగా తీసుకోవాలిగానీ పైత్యం గీత్యం అంటూ అప్రాచ్యపు మాటలు మాట్లాడతావేం."  

"సరీపోయె ...ఆ దినాలూ, తద్దినాలూ నాకెందుకు గానీ, నాకు కాదు మీకే కొత్తగా అప్రాచ్యపు బుద్ధులు పుడుతున్నాయి. పెళ్ళికో రోజున్నట్లు ప్రేమకో రోజుంటుందా చెప్పండి." 

"అహ ..ఉంటే తప్పేంటీ అంట ...ఎంచక్కా ప్రేమను చెప్పుకోటానికి ఒక సందర్భం అనుకోవచ్చుగా .."

"జీవితంలో ఎన్ని సందర్భాలు లేవు ప్రేమను ప్రకటించడానికి ...పెళ్ళిలో బ్రహ్మముడి పడిన దగ్గరినుంచీ ఎదుటి వ్యక్తిలోని సుగుణాలూ లోపాలతో సహా స్వీకరించి ప్రేమించటమేగా జీవితం." 

"ముందుగా ప్రేమా ...ఆ తరువాతే కదోయ్ పెళ్ళీ ..."

"అంటే ప్రేమకు ముగింపు పెళ్ళా ...కానేకాదు శ్రీవారూ ..ప్రేమకు మొదటి అడుగు పెళ్ళి. ఆ ప్రేమ ఎంత గాఢమైనది కాకపోతే...ఒకరి కొకరు కొన్ని విషయాల్లో నచ్చినా, నచ్చకపోయినా, ఒకరివల్ల ఒకరు బాధపడినా, ఒకరిమీద ఒకరికి చంపేయాలన్నంత కోపమొచ్చినా తట్టుకుంటూ , తిట్టుకుంటూ ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు ఎలా కలిసి బ్రతుకుతారు చెప్పండి. అదీ అసలైన ప్రేమంటే ...మీ లోపాలతో సహా మొత్తంగా మిమ్మల్ని ప్రేమించడం." 

"ప్రపంచమంతా ఆనందంగా ప్రేమికుల రోజు జరుపుకుంటోంది. ఎంతమంది దానివల్ల ఆనందం పొందుతున్నారో ..అందరి దారిలో మనమున్నూ ...దానివల్ల తప్పేంటి. "

"తప్పని నేను అనటం లేదు మహానుభావా ...అన్నీ ప్రేమరోజులే అంటున్నా ...అది విశ్వ వ్యాప్తం . అంతా ప్రేమమయం. అది ప్రేమికులకే పరిమితం కాదు. అమ్మానాన్నా, తోబుట్టువులూ, స్నేహితులూ మన చుట్టూ ఉన్న సమాజం అందరితో ప్రేమతో ఉండమని, ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చునూ ..అని. "

"చాల్లే !! చెప్పొచ్చావు ...ఒక్కరోజైనా ఏవండీ మీరంటే నాకెంతో ఇష్టం. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానూ అని ఒక్క మాటైనా చెప్పావా ...ఒక్క ప్రేమ లేఖైనా రాసావా ...ఒక్క కానుకన్నా  ఇచ్చావా. "

"చెపితే తప్ప తెలుసుకోలేని వెర్రి మొఖమేం కాదులే మావారు అనుకున్నాను. అయినా ఈ ప్రపంచంలో మిమ్మల్ని అందరికన్నా అధికంగా ప్రేమించే మనిషెవరో చెప్పగలరా ..."

 "ఓ ...మొదటి వ్యక్తి మా అమ్మ." 

"మరి ఆవిడ ఎప్పుడైనా ఆ మాట చెప్పిందా ..మిమ్మల్ని పుట్టినప్పటినుంచీ పాలిచ్చిపెంచి , పసివాడిగా మీరు చేసుకోలేని పనులన్నీ అసహ్యించుకోకుండా చేసి పెద్దవాళ్ళను చేసిన ఆ ప్రక్రియ అంతా ప్రేమే కదా ...ఇంత చేసిన ఆవిడకు ఎప్పుడైనా మీ ప్రేమ వ్యక్తపరిచారా లేదే ...ఆవిడ దానికోసం ఆశించదు కూడా ఎందుకంటే మీ ప్రేమను ఆమె మీరు చెప్పకుండానే తెలుసుకోగలదు."

"అబ్బబ్బ ...మూడంతా చెడగొట్టావు గదే ...ఇంతకీ ఈ ఎర్ర గులాబీ తీసుకుంటున్నావా లేదా ...."

"ఒక పట్టాన చెబితే అర్ధం కాదు గదా ...ప్రేమ అనేది నోటితో చెబితే తప్ప తెలుసుకోలేకపోతే అక్కడ ప్రేమ లేదని అర్ధం. ఇలాంటి తిక్క పనులు చేసి ప్రేమ విలువను దిగజార్చకండి. 
మీ కాలేజీ రోజుల్లో సుగుణ లాగా చెంపదెబ్బ తగిలించాల్సి ఉంటుంది." . 

"అమ్మో !! ఇది కూడా తెలిసిపోయిందా ..."

"ఆ ...సుగుణ పెళ్ళయ్యాక మా అక్కావాళ్ళ పక్కింట్లో ఉండేవాళ్ళు. ఒకసారి మనం వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తు పట్టిందిలెండి." 

"మరి అప్పుడే చెప్పలేదేం. "

"నాకు తెలిస్తే ఫీలవు తారనీ ...దీన్ని కూడా ప్రేమ అనొచ్చు కదా ..."

"హమ్మో ...నువ్వు సామాన్యురాలివి కాదే ...నాగురించి ఆ నిజం తెల్సినా తట్టుకున్నావ్ అందుకే బోలెడు నచ్చేశావ్. ఇదిగో గులాబీ ...అందుకో ప్రియా ..."

"హూ ...పైత్యం బాగా తలకెక్కినట్లే ఉంది. అయితే ఒక షరతు . ఈమధ్య టీవీలో ఆ గుండబ్బాయి డబ్బులు ఊరికే రావు. రేటు బాగా చూసి తీసుకొండి అంటున్నాడు. వాడిక్కూడా మనమీద ప్రేమ ఎక్కువేనండోయ్ ..."

"గుండేసుకుని వాడొకడూ ...అయినా వాడి ప్రేమకూ , ఈ ప్రేమకూ ఎవిటే లింకూ "

"అక్కడికే వస్తున్నా ...వాడి ఎడ్వర్టైజుమెంటులో ఒక జత రవ్వల గాజులు !! చూడగానే వాటిని విపరీతంగా ప్రేమించేశా ...రాత్రి కలల్లోనూ అవే , ఆకలి వెయట్లేదు. అన్నం సయించట్లేదు. ముద్దుగా నా చెతుల్లోకి తీసుకుని ఎప్పుడు ముద్దాడదామా అనిపిస్తోంది. నా ప్రేమను నిలబెట్టండి. మీ ప్రేమను ఒప్పుకుంటా  ... ఆ గులాబీతో పాటుగా ఆ రవ్వలగాజులు కూడా ఇవ్వండి తీసుకుంటా ..."

 "హా.. ఆ ..ఆ ..."

"ఇంక నోరు ముయ్యండి . మరీ అంతలా తెరవకండి. ఈగలూ దోమలూ దూరతాయి. 
కొనేటప్పుడు రెండుమూడు షాపుల్లో ధర విచారించటం మరిచిపోకండి. పాపం ఆ గుండాయన ధర విచారించి మరీ కొనమంటున్నాడు ...ప్రేమతో "

"అదికాదే రవ్వల గాజులంటే ఇప్పటికిప్పుడు ఎలా అంత డబ్బూ ..."

"ప్రపంచమంతా ఈ ఒక్కరోజే కోట్లాది రూపాయలు బిజినెస్ ఎలా జరుగుతుందని ...ఇలాగే మరి. మీ ప్రేమ గెలవాలంటే ఈ క్షౌర కళ్యాణం తప్పదు మరి ...మన ఎస్వీ రంగారావుగారు ఏం చెప్పారూ ...సాహసం శాయరా డింభకా ...రాకుమారి లభిస్తుందీ ...అన్నారుగా కానివ్వండీ ..సాహసం  శాయండీ ..."

"అది కాదే ...అసలు ప్రేమా ..."

"ప్రేమనేది పేడలాంటిది శ్రీవారూ ...దిబ్బలో వేస్తే ఎరువౌతుంది. గోడక్కొడితే పిడకౌతుంది. ముగ్గులో పెడితే గొబ్బెమ్మ అవుతుంది.  ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమించిన ప్రేమ ప్రేమకై జీవిస్తుంది. అందుకే ప్రేమను ప్రేమించు ప్రేమకై .....ఆహా !! మీ మీద ఎంత ప్రేమో చూశారా ఈ కొటేషన్లు ప్రేమ ప్రవాహం లా వస్తున్నై ...ఇంక నేనంతలా  ప్రేమించిన ఆ రవ్వల గాజుల పనిమీద ఉండండి. అంతే నాకు సాలు ...తమలపాకు తొడిమే పదివేలు....అందర్లాగ అడిగేదాన్ని కాదు. కొందర్లాగ కొసరేదాన్ని కాదు ...శ్రీవారూ ..."

"అయ్యబాబోయ్ !! అనవసరంగా కదిలించుకున్నాను. ప్రేమ దోమ బాగా కుట్టింది. ప్రేమే నేరమౌనా ...నా ప్రేమే నేరమౌనా ...నాపై పగేలా ...వేదనగానే నా మనసంతా వేసారు..నా.. ప్రేమే నేరమౌనా ...

 *పద్మజ* *కుందుర్తి* .

No comments:

Post a Comment