Wednesday, June 4, 2025

 రెండుపార్శ్వాలు
కథ:— పేపరు బోయ్
               -------------
    "ఏవోయ్ !పేపరొచ్చిందా?"కాఫీ కప్పు చేతిలో పెట్టిన భార్యను ప్రశ్నించాడు రామరావు.
      "ఇంతవానలో పేపరెలా వస్తుదండీ! ఏళ్ళూ ఊళ్ళూ ఏకమైపోతుటేను" అని సమాధానం చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది అతడిభార్య.
    రమారావుకి ఉదయం లేవగానే ,కమ్మగా వేడివేడి కఫీతాగుతూ పేపరుచదవడం ఆలవాటు.ఈ రెంటిలో ఏది ఆలస్యమైనా గంగవెర్రిలెత్తిపోతాడ

గాతడు.
       ఇంతలో "పేపర్" అన్న అరుపుతో పాటు రివ్వన  పేపరు వచ్చి అతడి కాళ్ళదగ్గర పడింది.  రమారావు పేపరు తీసిచూస్తే దాని చివర్లు కొంచం తడిసి వున్నాయి.
       వెంటనే రమారావు కొంపమునిగినట్టు, బాల్కనీలోకెళ్ళి ఓ పెను కేకపెట్టి"ఒరేయ్  పేపరు కుర్రాడా ఇలారా! "అనిఅరిచాడు.
      ఆ పేపరుకుర్రాడికి ఎనిమిదీ ,పదేళ్ళ మధ్యవయసుంటుంది. నల్లగా బక్కగా వున్నాడు.డొక్కులా వున్న మొఖంలో కళ్ళూ పళ్ళూమాత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి.
      రమారావరచిన అరుపుకు సీటుకూడా అందని డొక్కుసైకిలు ఫెడలు పై కాలేయబోతున్న ఆ పేపరబ్బాయి, హడలిపోతూ, ఆయాసపడుతూ 
మేడమెట్లెక్కి  వచ్చి రామరావు ముందర నిలబడ్డాడు.అతడి తలనుండి నీళ్ళుకారిపోతున్నాయి.పూర్తిగాతడసిపోయి, చలికి వణుకుతున్నాడో రామారావు అరిచిన అరుపు వణుకుతున్నాడో తెలియదు గాని, గజగజ వణుకుతూ వచ్చి నిలబడ్డాడు.
    "ఏరా! పొగరుబలిసిందా? పేపరు వానలో పడేసిపోతున్నావు?మీ ఏజంటుతోచెప్పి ఉద్యోగం ఊడగొట్టించేయగల్ను  జాగ్రత్త. రేపటినుంచి మేడపైకి వచ్చి ఇచ్చేలావుంటేనే పేపరు వేయించుకొంటాను .లొకపోతే అవసరంలేదు." మండిపడ్డాడు ఆకుర్రాడిపైన రామారావు.
     "పైకి పేపర్  తీసుకొచ్చి యిస్తానయ్యా!పేపరు మాన్పించకండి.మా ఏజంటుగారితోకూడా చెప్పకండయ్యా! మీకాళ్ళుమొక్కుతా!"అంటూ కళ్ళనీరు తుడుచుకొంటూ మేడదిగి, కీచుకీచు మని అరచే,తనడొక్కు సైకిలు సీటుకూడా అందని ఆ కుర్రాడు ,ఫెడల్ పై తొక్కుకుంటూ,వర్షాన్నేమాత్రం లేక్కచేయకుండా వెళ్ళిపోయాడా పేపర్ బోయ్ .
      పేపర్ చదువుతూ రామారావు"ఏవోయ్ !బుజ్జిగాడిని ఈవర్షంలో,చల్లగాలిలో స్కూలుకు పంపించొద్దులే.ఈ ఒకరోజు స్కూలు పోయింనంతమాత్రాన ఏమీ మనిగిపోదు.హాయిపడుకోనీ ఈరోజుకువాడిని. రగ్గు సరిగ్గాకప్పి వాడికి,తలుపులు దగ్గరికి జేరేయ్ !నేను టీ.వీ.పెట్టుకొంటే,ఆ శబ్దానికి మెలుకువవస్తుంది వాడికి"భార్యకు ఆర్డరేసాడు రామారావు.అతడి భర్య కళ్ళముందు నిలువెల్లా తడిసి ముద్దై చలికో, భయానికో గజగజ వణుకుతూ నిలబడిన పేపరు కుర్రాడి రూపం కళ్ళముందు ప్రత్యక్ష్రమై స్త్రీసహజమైన జాలితో ఒక నిట్టూర్పు విడిచింది.

        సత్యవాణి కుంటముక్కల

No comments:

Post a Comment