Sunday, August 31, 2025

 ఎందుకూ చదవడం ?
అసలేమొస్తుంది చదవడం వల్లా ?

చాలా చాలా తరుచుగా 
ఎదురయ్యే ప్రశ్నలివి 

*******

ఎదుటి వ్యక్తిని
మనం నివసిస్తున్న సమాజాన్నీ 
సహానుభూతితో అర్థం చేసుకోవడం కోసం 

మనని మనమే
నిశితంగా విమర్శించుకోవడం కోసం
మనని మనమే పుటం పెట్టుకోవడం కోసమూ 

చదవాలి ...
చదివి తీరాలి మనం 

**********

చదివే ...
ఈ లక్షణమే అలవడకుంటే 
అచ్చం కూపస్థ మండూకంలా 
కొనసాగుతుంది మన ఆలోచనా ధోరణి 

మన అనుభవాలే సత్యమనీ 
వాటి నుండి పుట్టిన అభిప్రాయాలే నిత్యమనీ 
మన నమ్మకాలూ విశ్వాసాలే అచంచలమనే 
మూఢత్వం మూర్ఖత్వం అజ్ఞానం ఉన్మాదం నిలువెల్లా ఆవేసిస్తాయి మనని

*********

ఒక్కసారి 
చదవడం మొదలిడగానే 

కాస్తంతైనా 
అర్థం చేసుకోవడం ఆరంభించగానే 

సానుభూతీ సానుభూతి 
వివేకం విచక్షణా సంయమనంతో 
చదవడం కొనసాగించే కొద్దీ ...

కరిగిపోవడం మొదలౌతుంది 
ఈ దట్టమైన అజ్ఞానమనే అంధకారం

సమసిపోవడం 
వేగం పుంజుకుంటుంది 
ఉద్రేకం ఉన్మాదం రాక్షసత్వం

********

మనిషి చేసిన 
అత్యద్భుతమైన ఆవిష్కరణలు 
ఏవీ .... ? అంటే 

నిస్సందేహంగా 
భాషా లిపీ మాత్రమే.....

మరి మనిషి చేయగలిగిన 
అత్యుత్తమమైన మానసిక చర్య 
ఏదీ ? అంటే...

నిర్ద్వంద్వంగా 
హేతుబద్ధంగా విమర్శనాత్మకంగా చదవడమే 

- రత్నాజేయ్ (పెద్దాపురం)

No comments:

Post a Comment