Wednesday, August 13, 2025

 *శ్రీకృష్ణం ధర్మం సనాతనం.....* 

*'కృష్ణం ధర్మం సనాతనం' అని పురాణ వాక్యం. కృష్ణః అంటే అపరిమిత ఆనంద స్వరూపుడు. “పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనగా సాధు జన రక్షణ, దుష్టజన శిక్షణ, ధర్మ సంస్థాపనానికైతాను మళ్ళీమళ్ళీ అవతరిస్తాననిస్వయంగా ప్రకటించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు.*

*రామావతారంలో రాజుగా ఆర్తులను, దీనులను, భక్తులను ఆదుకున్నా అందరికీ అందుబాటులో లేని కారణంగా కృష్ణుడుగా క్షత్రియ వంశంలో పుట్టి రేపల్లెలోని గోపాలకులతో, గోపికలతో, గోవులతో కలసి మెలసి తిరిగాడు. పాపాలకు దూరంగా ఉన్న వారితోనే, వారిలోనే ఉంటానని చాటాడు. బాలునిగా ఉండి రేపల్లెలో ధర్మానికి హాని కలిగించేకంసుడు పంపిన రాక్షసులను వధించాడు. చివరికి కంసుని కూడా వధించగా ఆవైరంతో తనపై కక్షకట్టి దాడి చేసిన జరాసంధుని సైన్యాన్ని పద్దెనిమిది సార్లు హతమార్చాడు. చక్రవర్తి అయిన* *జరాసంధుడు ఎప్పుడు యుద్ధానికి వచ్చినా 23 అక్షౌహిణిల సైన్యాన్ని తీసుకొని వచ్చేవాడు. (అక్షౌహిణి అంటే 10 వేల రథాలు, ఇరవై వేల ఏనుగులు, ఇరవై వేల గుర్రాలు, 40 వేల సైన్యం). ఈ విధంగా 18 సార్లు ఓడించి అనగా 414 అక్షౌహిణిల సైన్యాన్ని కృష్ణ బలరాములు ఇద్దరు మాత్రమే వధించారు. 18 అక్షౌహిణిల సైన్యాన్ని కృష్ణుడు వెనకుండగా వధించిన అర్జునుడు, భీముడు మహా వీరులుగా కీర్తించబడితే 414 అక్షౌహిణిలను వధించిన కృష్ణుడు ధర్మ నిర్వహణ కర్తవ్య దీక్ష మూర్తీభవించిన అవతారం.*

*కృష్ణావతారంలో ఆశ్రిత వాత్సల్యం, ఆశ్రిత పక్షపాతం, భక్తజన సౌలభ్యం ప్రస్ఫుటంగా కనపడతాయి. పాండవులకు దూత, సారథి అయి అనుక్షణం వారికి కంటికి రెప్పలాగా ఉన్నాడు. ఒక సారథిగా అర్జునుని గుర్రాల ఆలనాపాలనా చూసి, రధానికి ఉన్నదుమ్ము, దూళి తొలగించినట్లే మీ శరీరం, మనస్సులలోని మలినాలను తొలగించి గమ్యానికి చేర్చే రథసారథిని నేను అని పాండవులకు చాటినవాడు కృష్ణుడు. ధుర్యోధనుడు విందుకు పిలిస్తే కాదని విదురుని ఇంట్లో భోజనం చేసి ఆశ్రిత పక్షపాతాన్ని చాటిన ఆశ్రిత వత్సలుడు, ధర్మ వత్సలుడు శ్రీకృష్ణుడు. తప్పుచేసిన దేవతలను ఓడించి భక్తులైన గోపాలురను, గోవులను, గోపికలను అక్కున చేర్చుకున్న ధర్మ పక్షపాతి శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణం ధర్మం సనాతనం.*

*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🍁🕉️ 🙏🕉️🙏 🕉️🍁🕉️

No comments:

Post a Comment