*లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే*:- 1975 వేసవి లో, ఢిల్లీ లోని ఒక రద్దీ రోడ్డు పై చార్కోల్ తో స్కెచ్ లు గీస్తూ కూర్చున్నాడు భారత యువ కళాకారుడు ప్రద్యుమ్న కుమార్. అందరూ ఆయనను ప్రేమగా “పీకే” అని పిలిచేవారు. ఆయన వేసిన చిత్రాలు గీతలకే పరిమితం కాలేదు. ప్రతి ముఖం వెనుక ఆత్మను పట్టుకున్నట్టుగా భావాలను ఆవిష్కరించేవి. సమాజం లోని అత్యల్ప కులానికి చెందిన పీకే, సాధారణంగా కనబడని వాడిగా మిగిలిపోయేవాడు. కానీ కళలో మాత్రం అతనికి గౌరవం దొరికింది. ఆ రోజే అతని జీవితాన్ని మార్చేసిన పరిచయం జరిగింది. స్వీడన్ అరిస్టోక్రాటిక్ కుటుంబానికి చెందిన బంగారు వన్నె జుత్తు, కాంతి వంత మైన కళ్ల తో మెరిసే షార్లెట్ వాన్ షెడ్విన్ అతని చిత్రాలను ఆశ్చర్యం తో చూసింది. పీకే గీతల్లో ప్రవహించే మృదుత్వం ఆమెను కట్టిపడేసింది. మాటలకు మించిన అనుబంధం మొదలై పోయింది. కొన్ని వారా ల్లోనే వారి స్నేహం ప్రేమగా వికసించి, ఢిల్లీలో ఆకాశాన్ని సాక్షిగా చేసుకొని సాంప్రదాయ హిందూ వివాహం జరిగింది. కానీ వారి బంధాన్ని పరీక్షించే కాలం త్వరలోనే వచ్చింది. షార్లెట్ స్వీడన్ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. పీకేను వదిలి వెళ్లిపోవడం ఆమె గుండెను ముక్కలు చేసింది. “నా వెంట రా” అని ఆమె వేడుకుంది. టికెట్ కొనిచ్చేందుకు సిద్ధమైంది. కానీ పీకే మాత్రం సున్నితంగా నిరాకరించాడు. “నేను వస్తాను, నా విధంగా వస్తాను. నాకోసం వేచి ఉండు” అని వాగ్దానం చేశాడు. 1978 ఆరంభం లో పీకే చిన్న సంచి తీసుకుని, సైకిల్ ఎక్కి, అద్భుతమైన యాత్రను ప్రారంభించాడు. జేబులో డబ్బు తక్కువే ఉంది, సౌకర్యం ఏమీ లేదు. అతని వద్ద ఉన్నది షార్లెట్ చిరునామా రాసిన చిన్న కాగితమే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ, యుగోస్లావియా, జర్మనీ, డెన్మార్క్ మీదుగా సైకిల్ తొక్కుతూ సాగి పోయాడు. రోడ్డుపై దొరికిన ఆహారంతో గడిపాడు. ఎక్కడైనా చిత్రాలు గీసి డబ్బు సంపాదించాడు. ప్రతి కిలోమీటరు ఒక ప్రార్థన, ప్రతి కష్టం ఒక పరీక్ష. కానీ అతని మనసు మాత్రం విరగలేదు. నాలుగు నెలల పాటు 7,000 కిలోమీటర్ల కు పైగా సైకిల్ పై ప్రయాణించి, చివరికి షార్లెట్ స్వీడన్ లోని ఇంటి ముందుకు చేరుకున్నాడు. అలసి పోయినా గెలిచిన వాడిలా నిలబడి తలుపు తట్టాడు. షార్లెట్ తలుపు తీయగానే మాటలు అవసరం లేకుండా కన్నీటి కౌగిలిలో కలిసిపోయారు. తరువాత వారు చట్ట పరంగా పెళ్లి చేసుకొని కుటుంబాన్ని నిర్మించు కున్నారు. పీకే స్వీడన్ లో గౌరవనీయ కళాకారుడి గా ఎదిగాడు. అయినా అతని గుండెలో మాత్రం ఒకే నమ్మకం నిలిచింది. నిజమైన ప్రేమకు సరిహద్దులు లేవు, కులం, జాతి తేడాలు లేవు, దూరం అడ్డుకాదు. హృదయం నిజాయితీగా ఉంటే, అసాధ్యమనే మాటను కూడా ప్రేమ జయిస్తుంది.
No comments:
Post a Comment