అమ్మభాషకు గొడుగు
ఆధునిక తెలుగు భాషా, సాహిత్యాలకు వైతాళికులుగా పేర్కొనే వారిలో గిడుగు వెంకట రామమూర్తి ఒకరు. ఉపాధ్యాయుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, విద్యావేత్తగా, వక్తగా పేరొందిన ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. రాతకోతల్లో వ్యావహారిక భాషా వినియోగానికి గిడుగు చేపట్టిన ఉద్యమం అసామాన్య మైనది. అలాగే సవర భాషకు సంబంధించి ఆయన చేసిన కృషి కూడా అనుపమానమైంది.
సవరల భాష, సంస్కృతుల పట్ల గిడుగుకు 1880ల్లోనే ఆసక్తి కలిగింది. మన్యం ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పని చేయడం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కష్టపడి సవరభాష నేర్చుకున్న ఆయన వారికోసం వారి భాషలోబోధించే బడులు పెట్టారు. ఆ భాషకు చేసిన కృషికి గాను ప్రభుత్వం బహు మతి ఇస్తానంటే ఆ డబ్బుతో మరిన్ని బడులు పెట్టమన్నారు. సవరభా షకు ఓ లిపిని రూపొందిం చడమే కాక, వారి జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాల్ని అధ్య యనం చేశారు. చరిత్రగా రికార్డు చేశారు. సవరభా షకు నిఘంటువు, వ్యాక రణం రూపొందించారు. వాచకాలను తయారుచేశారు. తన కృషితో సవరల హృదయాలను గెలిచిన గిడుగు వారి గురించి కథలు రాశారు. వాటిని వారికి వినిపించి, వాళ్లు సూచించిన సవరణలతో తిరగరాసిన గొప్పతనం ఆయనది.
అభివృద్ధిపరంగా మానవ సమాజం శరవేగంగా మార్పులకు లోనవుతోంది. కానీ ఎటువంటి ఆధునికతా అంటని స్వచ్ఛమైన మన్యాలూ వాటిలో ప్రజా సమూహాలూ ఇప్పటికీ ఉన్నాయి. ప్రకృతే వారికి పాఠశాల. కూడూ గూడూ ప్రకృతి ప్రసాదాలే. వన్యమృగాలే బంధువర్గాలు. అలాంటి ఓ సమూహమే సవర జాతి. ఒడిశాలోని గంజాం, ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా లక్షల్లో ఉంటుంది. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. ఎదురెదురుగా ఇళ్లు కట్టుకుం టారు. అంటువ్యాధులు ప్రబలినా, ప్రమాదవశాత్తూ కానీ, క్రూర మృగాలవల్ల కానీ జనం చనిపోయినా, ఆ ప్రాంతాన్ని వదిలి కొత్త చోట నివాసాలు ఏర్పాటుచేసుకుంటారు. వారి జీవనవిధా నంతో మమేకమయ్యారు కాబట్టే గిడుగు సవర కథలను రాయగలిగారు. ఈ కథల రెండో పుస్తకం ముందుమాటలో 'ఇందులోని కథలన్నీ సవర వాళ్లు నాకు చెప్పినవే. ఇంచుమిం చుగా వాళ్ల మాటలే' అంటారాయన. సవర జీవన విధానంతో పాటు వారి భాష కూడా కథల్లో సహజంగా వచ్చేలా చూశారా యన. నాలుగో భాగం 'సవర కథల్లో భాషకు ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది. ఇల్లు, పొలం, సంత, తగవులు, పూజలు, కల్లు తాగడం, సోది, కేసులు, పోలీసులు, జడ్జిలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి మధ్య చోటుచేసుకునే సంభాషణల్లోని సహజత్వానికి గిడుగు అక్షరరూపమిచ్చారు. సవర భాషపై చేసిన కృషే ఆయనను తెలుగు గురించి కూడా ఆలోచింపజే సిందంటారు. సవర భాష లిపికర్తగా, వ్యావహారిక భాషా ఉద్య మకారుడిగా, కాలం కన్నా ముందున్న భాషా శాస్త్రవేత్తగా గిడుగు చరిత్రకెక్కారు. వర్తమానంలో ఎదురవుతున్న అవరోధా లన్నింటి నుంచి తెలుగుభాషను కాపాడుకోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి.
భమిడిపాటి గౌరీశంకర్
No comments:
Post a Comment