Friday, August 22, 2025

 వేదాంతాధ్యయనానికి అర్హత

అజ్ఞస్యార్ధ ప్రబుద్ధస్య సర్వం బ్రహ్మేతి యో పదేత్ మహానిరయ జాలేషు స తేన వినియోజితః||

అజ్ఞానికి లేదా సగం సగం తెలుసుకున్న వానికి సర్వం బ్రహ్మమే అని బోధిస్తే వాడు దాన్ని అపార్థం చేసుకుంటాడు. అందువలన తత్త్వజ్ఞానాన్ని పొందటానికి అతనికి అర్హత ఉండాలి.

అయితే ఆ అర్హత ఏమిటి? శాస్త్రాలలో, గురువుగారిమాటలలో దృఢమైన విశ్వాసం ప్రాపంచిక విషయాలపట్ల వైరాగ్యం, కోరికలు లేకపోవటం, భగవంతుని పట్ల అనన్యమైన భక్తి ఉండడమే అటువంటి అర్హత.

అందువలన మొదట ఆ లక్షణాలను అలవరచుకోవాలి. ఈ ప్రయత్నం సఫలమైనప్పుడే, తనను తాను సంసిద్ధపరచుకున్నప్పుడే, అతనికి సత్యం (వేదాంత తత్త్వం) గురించి బోధించవచ్చు.

పూర్వకాలంలో తత్త్వోపదేశం కోసం గురువు వద్దకు వెళ్తే, ఆ శిష్యుడు తత్త్వబోధనకు అర్హడుగా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవటానికై గురువు పరీక్షపెట్టి, నిర్ధారించుకుని ఆపైన తత్త్వోపదేశం చేసేవాడు.

ప్రశ్నోపనిషత్తులో ఆరుగురు శిష్యులు (సుకేశ, సత్యకామ మొదలగువారు) పిప్పలాదమునివద్దకు వెళ్లి తమకు తత్త్వాన్ని ఉపదేశించమని కోరారు. ఒక సంవత్సరం తపస్సుచేసి తన వద్దకు రమ్మని పిప్పలాదుడు ఆజ్ఞాపించాడు. తత్త్వబోధనకు సిద్ధంగా వారుండటానికై ఆయన అలా చెప్పాడు. ఒకసంవత్సరం తరువాత ఆయన వాళ్లకి తత్త్వోపదేశం చేసాడు. వాళ్లు కూడ సత్యాన్ని అర్ధం చేసుకుని ముక్తిని పొందగలిగారు.

అందరూ అలా అర్హత గురించి సక్రమంగా అర్థం చేసుకుని, ఆ అర్హతను సంపాదించి, గురువు నుండి వేదాంతోపదేశాన్ని పొందండి. అప్పుడు అందరూ జీవితాన్ని సార్ధకం చేసుకోగలుగుతారు.

 *శారదే పాహిమాం శంకర రక్షమాం* 

జగద్గురు వాణి అను పుస్తకము నుండి ---

🌹🙏

No comments:

Post a Comment