తెలుసుకోండి...280825
తెలియజేయండి....
*శ్రీ నగజా తనయం 3/11*
అల్లసాని పెద్దన గారిపద్యం:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!
దశకుమార చరిత్రలో కేతన గారి పద్యం:
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!
గణేశుని' పుష్టిపతి' అని కూడా పురాణాలు వర్ణించాయి. ధనపుష్టి, ధాన్యపుష్టి, జ్ఞానపుష్టి, సిద్ధిపుష్టి, గృహారామక్షేత్రపుష్టి- మొదలైన సమృద్ధి భావాలను శాస్త్రాలు పేర్కొన్నాయి. ఆ పుషులన్నిటికీ ప్రభువు ఈతడు. గణపతి స్వరూపమే ఈ లక్ష్మికి ప్రతీక. బ్రహ్మాండమంతటా మహాతత్త్వమే గణపతి మహాకాయ స్వరూపం.
"సప్తకోటి మహామంత్ర మంత్రితావయవద్యుతిః”-అని గణపతి నామం. ఈ దేవుని శరీరం నుండి వెలువడే కాంతులకీ ఏడుకోట్ల వేదమంత్రాల స్వరూపాలు- అని భావం. అంటే సర్వమంత్ర స్వరూపుడు ఈతడు.
యోగశాస్త్ర పరంగాకూడా తొలిచక్రమైన మూలా ధారానికి గణపతి అధిదేవత. ఒక వృక్షానికీ, తీగకీ పాదు ఎలాంటిదో - ప్రాణచైతన్యానికి ఆధారస్థానం అలాం టిది. దీనినే 'కుదురు' అంటారు. కుదురు సరిగ్గా లేకపోతే నిలుకడ, ఎదుగుదల ఉండదు. ఆ కుదురును చేకూర్చే దైవం గణపతి.
ఆదిదేవుడిని అర్చించే ఏకవింశతి పత్రాలు.. మాచీ పత్రం, బృహతీపత్రం (ములగ), బిల్వ (మారేడు), దూర్వారయుగ్మం (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), అపామార్గ (ఉత్తరేణి), తులసీ పత్రం, చూతపత్రం (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (అవిసె), దాడిమీ (దానిమ్మ), దేవదారు, మరువక, సింధూర (వావిలాకు), జాజి, గండకీ (కామంచి), శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు) పత్రులన్నీ ఓషధీ గుణాలు కలిగినవే. వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించ వచ్చని ప్రకృతి వైద్యం చెబుతోంది. వీటిలోనూ గరిక శ్రేష్ఠమైనది. ఇది చర్మవ్యాధులను నివారిస్తుంది. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే.
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
శైలజ వాస్తు జ్యోతిషాలయం 9059743812
No comments:
Post a Comment