Sunday, August 31, 2025

 *అవతార్ మెహర్ బాబా - 62*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


*ద్వితీయాంధ్ర దేశ పర్యటన*

04.03.54 తేదీన సామర్లకోటలో పూనా ప్యాసింజర్ లో ఎక్కి బాబా మండలి వారితో తిరుగు ప్రయాణమయ్యారు. రాజమండ్రి స్టేషన్ లో బాబా మాణిక్యాల రావును పిలిచి 'ఆ రైలు కంటె ముందు విజయవాడకు వెళ్ళగలవా' అని అడిగారు. 'అలాగయితే విజయవాడకు ముందుగా వెళ్ళి మద్రాసు నుండి వచ్చిన సంపతయ్యంగారి కుటుంబ సభ్యులు ముందుగా తన దర్శనం చేసుకోవాలని తరువాతనే మిగిలిన వారంతా 
ప్లాట్ఫారం పైన తన దర్శనం చేసుకోవాలని అందరికీ చెప్పవలసింది'గా ఆజ్ఞాపించారు బాబా. కాని అనుకోకుండా చాగల్లు స్టేషన్ లో ప్యాసింజర్ను ఆపి మెయిల్ను పంపి వేసారు. ఇక మాణిక్యాల రావుకు విజయవాడకు ముందుగా చేరే అవకాశం లేకపోయింది. 'బాబా ఆజ్ఞ పాటించడ మెలాగా' అని మాణిక్యాలరావు దిగులుగా కూర్చున్నాడు. విజయవాడ స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద ప్యాసింజర్ బండి ఆగిపోయింది. వెంటనే బండి దిగి రెండు ఫర్లాంగుల దూరం పరుగెత్తుకుంటూ ప్లాట్ఫారం వద్దకు వెళ్ళాడు మాణిక్యాల రావు. అక్కడికి వచ్చిన బాబా ప్రేమికులకు బాబా ఆదేశాన్ని వివరించి సంపతయ్యం గారి కుటుంబం వారు బాబాను అందరి కంటే ముందుగా దర్శించుకోవాలని చెప్పాడు. 

బాబా ఆదేశాన్ని పాలించగానే బాబా వస్తున్న ప్యాసింజర్ రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చేసింది. మెయిల్ బండి తప్పిపోయిందని విచారిస్తున్న మాణిక్యాల రావుకు ఔటర్ సిగ్నల్ వద్ద బండి ఆగిపోవడం బాబా ఇచ్చిన అవకాశం. అయితే సంకోచించకుండా ఆ అవకాశాన్ని వినియోగించుకొని బాబా ఆజ్ఞను పాటించి మాణిక్యాలరావు ధన్యుడైనాడు. బాబా మాణిక్యాల రావును చూసి భేష్ అన్నట్లుగా మందహాసం చేసారు. అపార కరుణామయుడు కదా మెహెర్ బాబా!

సామర్లకోట నుండి విజయవాడ వరకు తిరుగుప్రయాణంలో ప్రతి స్టేషన్ లో ప్రేమికులు అధిక సంఖ్యలో వచ్చి బాబా దర్శనం చేసుకొని దివ్య ప్రియతమునికి వీడ్కోలు చెప్పారు. ఈ పర్యటనలో బాబా తో సన్నిహితంగా ఉండి ఆయన సహవాస భాగ్యం పొందిన ప్రేమికులెందరో ఆయన ఎడబాటు సహించలేక విలపించారు. కొందరు ఏమీ తోచని స్థితిలో నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. కొందరు 'అవతార్ మెహెర్ బాబా కీ జై' అని జయ జయ ధ్వానాలు చేసారు. కొందరు వారి మనసు బాబాకిచ్చి చేతులు జోడించి మౌనమూర్తి వైపు చూస్తూ మౌనంగా నిలబడ్డారు. రైలు రెండవ తరగతి పెట్టెలో తలుపు వద్ద నిలబడి బాబా విభిన్న తరహాలలో తన వీడ్కోలు చెప్పుతున్న ప్రేమికులను ప్రేమతో ఆశీర్వదించారు. రైలు బెజవాడ స్టేషన్ దాటి పూనా వైపు వెళ్ళిపోయింది.
📖

ఆంధ్రదేశ పర్యటన ముగించుకొన్న తర్వాత బాబా మహాబలేశ్వర్, సాకోరీ, కొల్లాపూర్, సతారాలకు వెళ్ళారు. మస్తుల సాంగత్యం చేసే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ వచ్చారు. బాబా 19వ నెంబర్ నవ జీవన ప్రకటన ద్వారా ప్రేమికులంద రూ 10.07.54 తేదీ మౌనంగా ఉండి ఉపవాసం చేయాలని ఆదేశించారు. ఆ 24 గంటల కాలంలో మంచి ఆలోచనలు వచ్చే లాగ ప్రయత్నించాలని మూడుసార్లు టీ గాని, కాఫీగాని త్రాగవచ్చని సాధ్యమైనంత వరకు ఏదైనా భగవన్నామాన్ని జపించాలని ఆదేశించారు.

12.09.54 ఆదివారం రోజు బాబా అహమ్మద్ నగర్లోని వాడియా పార్క్ లో ప్రజాదర్శనం యిచ్చారు. ఆ ప్రజా దర్శనానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసారు. సాకోరీ నుండి గోదావరి మాయి కన్యలను తీసుకొని వచ్చింది. పండరి పూర్ నుండి గాడ్గే మహరాజ్ వచ్చారు. అసంఖ్యాకమైన ప్రజావాహిని బాబా దర్శనార్థం కదలివచ్చింది. దర్శనానికి ముందు ఏడుగురు పేదలకు కాళ్ళు కడిగి 'మీరందరూ ఏదో ఒక విధంగా భగవంతుని అవతారాలే గనుక మీకు నేను ప్రణమిల్లు తున్నాను. మీ పాదాల వద్ద నేనుంచిన దైవ దక్షిణ 'స్వీకరించండి' అని ప్రతి ఒక్కరికి రూ. 51/దైవదక్షిణగా యిచ్చారు. బాబా వేదిక ముందుకు వచ్చి వేదిక దిగి స్త్రీల వైపున మళ్ళీ పురుషుల వైపున కూర్చుండి  
“మానవుడు మానవునకు మ్రొక్కినట్లు గాక భగవంతుడే భగవంతునకు ప్రణమిల్లి నట్లు నేను మీకు ప్రణమిల్లుతున్నాను” అని అందరికీ నమస్కారం చేసారు. బాబా దర్శనం ఇస్తూ కుడిచేతితో ప్రసాదం పంచి పెట్టారు. కుడిచేయి నొప్పి పెట్టినందున ఎడమ చేతితో ఇచ్చారు. మండలి వారు చెప్పినా వినకుండా బాబా మధ్యహ్నం 3 గంటల వరకు ప్రసాదం పంచారు. దాదాపు 15000 మంది భోజనాలు చేసారు. బాబా స్వయంగా వారికి వడ్డించారు. ఆ తర్వాత కారు టాపుపై కూర్చుని అందరికీ దర్శనం యిచ్చారు. నిరంతరాయంగా ప్రవాహం లాగా వచ్చి బాబా దర్శనం చేసుకున్న దర్శనార్థులతో వాడియా పార్క్ క్రిక్కిరిసి పోయింది. ఆ దర్శన కార్యక్రమం మరువరానిది. 'భగవంతుని ప్రేమించుట ఎట్లు?' అనే సందేశం మరియు 'మెహెర్ బాబా పిలుపు' అనే సందేశం వినిపించబడ్డాయి.

బాబా సెప్టెంబర్ 29, 30 తేదీలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికై వచ్చిన 20 మంది పాశ్చాత్య ప్రేమికులు కూడా ఈ దర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు బాబా సహవాసంలో గడిపిన రోజులు చిరస్మరణీయంగా మిగిలి పోయాయి. ఆ రోజులలో బాబా ఎన్నో ప్రవచనాలను వారికి చెప్పారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment