Thursday, September 25, 2025

 231వ భాగం 
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18 
శ్లోకము 19 

భావభావ విహినో యస్త్రప్తో నిర్వాసనో బుధః|
దైవ కించిత్కృతం తేన లోకదృష్ట్యా వికుర్వతా||

భావన రూపం అయిన సృష్టిని తద్విరుద్దమైన అభావాన్ని భావించకుండా నిత్య తృప్తుడై వాసనా రహితుడైన జ్ఞాని ఎన్ని కర్మలను చేస్తున్నట్లు కనిపించిన నిజానికి అతను దేనిని చేయడం లేదు.

జీవన్ముక్తుడైన జ్ఞాని క్షణము కూడా తీరిక లేకుండా సమాజాన్ని సేవిస్తూ కర్మల ఆచరించడానికి ప్రపంచం గుర్తించవచ్చు. అయినా అతడే పనిని చేయడం లేదనే చెప్పాలి. సాధారణంగా కర్మ అంటే ఫలితం ఉండి తీరుతుంది . తప్పలితంగా సంసారచక్రం భ్రమిస్తూ ఉంటుంది. ఈ దృష్టితో చూస్తే జ్ఞాని కర్మలను చేయడం లేదనే అనాలి. అతడి కర్మల ఫలితముగా అతడు సంసార చక్రంలో బంధింపపడడం లేదు.

అహంకారంతో మనము చేసే పనులన్నీ స్వసుఖము కాంక్షించేవిగా స్వార్థపూరితంగా ఉంటాయి. కోరికతో చేసే పనులన్నీ వాసనలను సృష్టించి జన్మ కర్మ వలయంలో బంధిస్తాయి. జీవన్ముక్తునిలో అహంకారము లేని కారణంగా కోరికలు ఉండవు ."తృప్తో నిర్వసనోబుదః"... నిత్య తృప్తుడై వాసన రహితుడై అతడు కర్మలను చేయడం వలన అవి అతనిని బంధింపజాలవు.

"భావ భావవిహీనోయః".... భావన రూపమైన సృష్టిని అభావ రూపమైన అవ్యక్త వాసనలను కూడా త్యజించి నిత్యము ఆత్మగా తన్ను తాను తెలుసుకునే జ్ఞాని కర్మలను చేస్తున్న చేయనట్లే. అతని కర్మలను స్వార్ధపూరితము అని గాని స్వార్ధ రహితమని కానీ అన లేము. అయినా కర్మలను చేయటం చూస్తున్నాము కాబట్టి వాటిని లీలామాత్రంగా ఆటగా భావించవచ్చు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ప్రత్యేకతను విడనాడిన అతని కర్మలతో అతనికి ఏ విధమైన సంబంధము ఉండజాలదు. అయినా ఉపాధి ధర్మంగా ప్రారబ్ధానుగుణంగా అతనిచే జరుపబడే కర్మలు లోక కళ్యాణ కారకాలై అతనిలో లీలామాత్రంగా బాసిస్తాయి.

బాలుడు ఆటలాడేటప్పుడు అతని బుద్ధిని శారీరక శ్రమను వినియోగించిన దానిని కర్మ అని పిలవలేము .ఆటలాడటం వలన బాలుడు ఆశించే ఫలితం కానీ మానివేయడములో కష్టం కానీ అతనికి ఉండవు .అతని శరీరంలోని సహజ శక్తి ఆటగా మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా జీవన్ముక్తుడు చేసే పనులన్నీ వ్యక్తం అవుతున్న లీలా మాత్రాలే .అతని కర్మల వెనుకగా ఎటువంటి కోరిక ఉండదు.

భగవద్గీతలో బోధింపబడిన అకార్మణ్యత్వానికి చక్కటి ఉదాహరణగా ఈ శ్లోకాలన్ని ఆశిస్తున్నాయి.

కర్మలో ఆ కర్మను, అ కర్మలో కర్మను గుర్తించగలిగిన వాడే తెలివైనవాడు. అతడే నిజమైన యోగి. అతడు మాత్రమే నిజంగా పనులను చక్కగా చేయగలిగినవాడు.🙏🙏🙏

No comments:

Post a Comment